నూతన విద్యాసంవత్సరం ఆరంభమైంది. ఇప్పటికే ఓనమాలు దిద్దుకున్న చిన్నారులు చదువుల తల్లి గుడిలాంటి పాఠశాలలకు హాజరయ్యే తరుణం మొదలైంది. మనిషి నిగూఢంగా దాచుకొనే సంపద చదువు. మన భారతీయుల ప్రాచీన పరంపరాగత సంపద యోగ విద్య. మానసిక శారీరక సామాజిక రుగ్మతలకు స్వస్తిపలికే మహత్తరమైన విద్య. అంతర్జాతీయ యోగా దిమోత్సవ (జూన్ 21) వేళలో యోగ సంప్రదాయాలపై విశేష రచనలను ప్రచురించాం. భగీరథ ప్రయత్నంతో దివినుంచి భువికి దిగివచ్చిన గంగమ్మకు నీరాజనాలిచ్చే దశపాపహర దశమి ఈనెలలోనే వస్తోంది. ధర్మం, అహింస, బ్రహ్మచర్యం మానవునికి విలువైన ఆస్తులను బోధించిన స్వామి నారాయణ వర్థంతి సంస్మరణీయమైంది. ఆయన కొలువై ఉండే అక్షరధామ్ దర్శనీయమైంది. అప్పట్లో చెట్టుకింద చదువు చెప్పేవారు. ప్రకృతి ఒడిలో పిల్లలు పచ్చగా ఎదిగేవారు. కాలుష్యం లేని రోజులు కనక కావాల్సినంత సూర్యరశ్మి సరిపడేంతగా అందేది. ప్రతిభకు కొలమానం పేరుతో డా. గరికపాటి నరసింహారావు రాసిన వివరణ చూద్దాం. జ్యేష్ట శుద్ధ ద్వాదశినాడు ఆదిశంకరులు కైలాసగమనం చేసినట్లు శంకరవిజయం చెబుతోంది. పరతత్త్వ నిరూపణ చేస్తూ.. ఎన్నెన్నో శ్రీ విద్యా రహస్యాలను సౌందర్యలహరి బోధిస్తోంది. సాధకులకు, ముముక్షువులకు చరమలక్ష్య సిద్ధి ప్రదాత్రి సౌందర్యలహరి. శ్రీవిద్యా సౌందర్యం పేరుతో చాగంటి కోటేశ్వరరావు రాసిన వివరణ చూద్దాం.

➠ ఈశ్వరుడు ప్రకృతి భోక్త కాడు. దాని స్పర్శయే లేనివాడు. అతడు స్వతంత్రుడు. ప్రకృతికి వసుడు కాడు. సంపూర్ణమైన స్వయం సమృద్ధిని సాధించిన వాడు అతడు. ఇదంతా అతడికి ఎలా సాధ్యమైంది అంటే జ్ఞానం చేత అని సమాధానం. పరమపురుషునికి మంత్రమే శరీరం పేరుతో సద్గురు శివానంద మూర్తి వర్ధంతి సందర్భంగా రాసిన వ్యాసం చూద్దాం.  

➠ యోగ- మనిషిని అతడి గమ్యం చరుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. మనస్సుకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. జీవితంలోని ప్రతి అడుగులో నడవడికను తీర్చిదిద్దిుతుంది. అంతిమంగా ఖచ్చితమైన మార్గంలో జీవన లక్ష్యాన్ని చేరుకునేలా మార్గదర్శనం చేస్తుంది. అపూర్వయోగం పేరుతో డా. కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసాన్ని చూద్దాం. 

➠ ఆధునిక యాంత్రిక యుగంలో పిన్నల నుండి పెద్దల వరకు అందరూ ఏదో రకంగా మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. మానసిక ఆందోళనల నుంచి బయటపడాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సంతోషకర వాతావరణంలో ప్రశాంతంగా గడపడమే కదా ఎవరైనా కోరుకొనేది. శాంతస్థితిని సాధించాలంటే ధ్యానమే మంచి సాధనం. సహజ ధ్యానం పేరుతో శ్రీశ్రీ రవిశంకర్ రాసిన వ్యాసం చూద్దాం. 

➠ విషయాలను యధార్ధంగా ఎలా ఉన్నాయో అలా చూడగలిగితే చాలు జీవ చైతన్యం అంతా సరికొత్తగా దర్శనం ఇస్తుంది. సత్యం అనే మజిలిలో మనసుకు నిర్ణయాత్మకంగా ఉండాల్సిన అవసరం తగ్గిపోతుంది. సత్యాన్వేషణ చేసే యోగికి మనస్సు స్థిరం అవుతుంది. సత్యాన్వేషణ పేరుతో సద్గురు జగ్గీ వాసుదేవ రాసిన వివరణ చూద్దాం. 

➠ ఇంకా నీవు చేసేదంతా దేవుని పని అంటూ డా. మంజులూరి నరసింహారావు రాసిన వ్యాసం, రాజయోగం, ఆత్మమర్మం, గంగాతీరం, చార్ ధామ్ యాత్ర, మంచుకొండల్లో మహాదేవుడు, తొలకరి పులకింత వంటి వ్యాసాలను చూడవచ్చు. 

➠ అదేవిధంగా మాసఫలం, యోగాసనాలను మూర్తిమంతం చేసే వివరణలతో ఈ సంచికతో పాటు ఉచితంగా యోగాసనాలు పేరుతో చిరుపుస్తకం కూడా పొందవచ్చు.

Recent Comments