"సర్వకాలకృతం మన్యే భవతాం చ యదప్రియం
సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావళిః"

మన తెలుగు కాల చక్రానికి అరవై ఆకులుంటాయి. చాంద్రమానాన్ని అనుసరించి కాలం నడుస్తూ జీవులకు వయసులు పెంచుతూ పోతుంది. ఈనెల 25న వికారి వెళ్లిపోయి శ్రీశార్వరి నామ సంవత్సరం అడుగు పెడుతోంది. తెలుగు వారికి ఉగాది శుభప్రదమైన వేడుక. కోటి కొత్త ఆశల్ని చిగురింపచేస్తూ సరికొత్త ఉత్సాహాల మొగ్గలు తొడుతుంది. వసంత రుతువును వల్లెవాటుగా ధరించి కోయిల పాటల సందళ్లతో విచ్చేస్తుంది. షడ్రుచుల వేపపూత ప్రసాదం విలక్షణమైన ఉగాది సందేశమై మన జిహ్వలను చైతన్య పరుస్తుంది. పంచాంగవేత్తలు గ్రహచలనాలను కాలగమనాన్ని సమన్వయ పరచి నూతన సంవత్సర పంచాంగాన్ని ఘడియ, విఘడియ సైతం తేడా రాకుండా సృష్టించి పెడతారు. దేశ కాలమాన స్థితిగతుల్ని, పాడిపంటల ప్రాభవాన్ని సూచిస్తారు. ఆయా రాశుల వారికి నూతన సంవత్సరంలో అనుకూల ప్రతికూల పవనాలు ఎట్లా వీచబోతున్నాయో కందాయ ఫలాలు చెబుతాయి. ఉగాది పండుగ రోజు ఇంటిని తోరణాలతో అలంకరించుకుని శుచిగా ప్రసాదం స్వీకరించి పంచాంగ శ్రవణం చేయడం మన సంప్రదాయం. శ్రీశార్వరి నూతన ఉగాది అందరికీ శుభప్రదంగా, లాభదాయకంగా ఉండాలని మనసా కోరుకుంటున్నాం. మార్చి నెల ఆరంభంలో మంత్రాలయ శ్రీ రాఘవేంద్రుల జయంతి పండుగ భక్తుల ముందుకు వస్తోంది. అక్కడనుంచి ఈ మాసం కల్యాణప్రదంగా సాగుతుంది. యాదాద్రి నృసింహ స్వామి, అహోబిల, కదిరి, ధర్మపురి, మంగళగిరి నృసింహులు ఈ నెలలోనే పెళ్లి కొడుకులై బాషికాలు ధరించనున్నారు. పెళ్లిపీటలపై ప్రసన్నులుగా ఉండే నృసింహమూర్తులు అందర్నీ తమ చల్లని చూపులతో కటాక్షిస్తారని ఆశిద్దాం. తరతమ భేదాలు మరచి సమత మమతలనే వసంతాలుగా చల్లుకునే హోలీ రంగుల పండుగ సందడి చేయనుంది. ఇంకా అనేక జాతరలు, తీర్థాలు భక్తజనం ఏడాది పొడుగునా ఎదురు చూసే సందర్భాలు ఈ మాసంలోనే వచ్చి సంపన్నం చేయనున్నాయి. శ్రీ శార్వరి ఉగాది వేళ పన్నెండు రాశుల వారి సంవత్సర ఫలితాలు చిన్న పుస్తకంగా ఇస్తున్నాం.

 

➠ ఉగాది అంటే ప్రకృతి పుట్టిన రోజు. చైత్రమాసం శుక్ల పక్షంలో బ్రహ్మ దేవుడు మొదటి రోజున ఈ ప్రకృతికి శ్రీకారం చుట్టాడు. ‘చైత్రమాసే జగద్ర్బహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్ర తథా సూర్యోదయే సతి’ అనే శ్లోకాన్ని అనుసరించి ఉగాదిని మనం ప్రకృతి 

పుట్టినరోజుగా జరుపుకుంటాం. కాల గణనకు, కవిత్వానికి ఉగాది శ్రీకారం.

➠ తెలంగాణ ప్రజల ఇష్టదైవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడు. ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణం జరిపించుకుంటున్న నేపధ్యంలో యాదగిరీశుడు ప్రస్తుతం బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఫాల్గుణ మాస బ్రహ్మోత్సవాల్లో 

భాగంగా కల్యాణోత్సవ, రథోత్సవాలకు సిద్ధపడుతున్నాడు. బాలాలయంలో పగటిపూట, భక్తులందరి సమక్షంలో జడ్పీ హైస్కూల్ మైదానంలో రాత్రివేళ నృసింహ కల్యాణం జరగబోతోంది.

➠ భారతీయ సంస్కృతి రంగుల హరివిల్లు. కాలానికి అనుగుణంగా ఆనంద పర్వాలతో ఆ హరివిల్లు ఎప్పటికప్పుడు కొత్తగా విరబూస్తుంది. వసంత రుతువు అడుగిడే వేళ ప్రకృతి ఆహ్లాదభరితమైన రసాకృతిని సంతరించుకుంటుంది. హరిత వర్ణ శోభతో 

ముస్తాబవుతుంది. మధుమాసవేళ అందరూ వయోభేదాలు మరిచి వసంతాలాడతారు. ఆనందహేల హోళీ వెనుక సంప్రదాయ విశేషాలెన్నో ఉన్నాయి.

➠ కాలంతో పాటు మన పంచాంగాల నిర్మాణం కూడా మారింది. అందరికీ అర్థమయ్యేలా, పంచాంగం స్వయంగా చూసుకునేందుకు అనువుగా రూపొందిస్తున్నారు. పంచాంగంలో ఏమేమి ఉంటాయి? పంచాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పంచాంగాన్ని 

ఉపయోగించుకుని మంచిచెడులను ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలపై అవగాహన కలిగించే ప్రయత్నం.

➠ శుభ ముహుర్తాలు, ఆర్థిక, సమస్త వ్యవహారాల - అనుకూల, ప్రతికూల ఫలితాలు, ప్రతిరోజు రాశిచక్రాలు, రాశి ఫలితాలు, పండుగలు, ప్రయాణ ముహుర్తాలు, గౌరీ పంచాంగం, నక్షత్ర ఫలితాలు, కర్తరీ నిర్ణయం, మూఢమి, గ్రహణాలు, వ్యవసాయ పంచాంగం, వాస్తు 

ప్రకరణం, నక్షత్ర జనన ఫలితాలు, జనన మరణ సంబంధిత అశౌచం, సూర్యోదయాస్తమయాలు, తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం – ఇవన్నీ పంచాంగాల ద్వారా తెలుసుకోదగిన అతిముఖ్యమైన విశేషాలు.

➠ కర్ణాటకలోని పడమటి కనుమలలో జన్మించిన దివ్యనది తుంగభద్ర. ఇది తుంగ, భద్ర నదుల కలయికతో ఏర్పడి కృష్ణానదిలో సంగమిస్తున్నది. శృంగేరి, హంపీ వంటి క్షేత్రాల మీదుగా ఈ నది తెలుగునేలమీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రవహిస్తోంది.
గురుగ్రహం మకర సంక్రమణం చేసిన సమయంలో తుంగభద్రకు పుష్కరాలు ఏర్పడతాయి. 

Recent Comments