"ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం"

వైశాఖ మాసం దివ్యమైన పండుగల మాసం. నృసింహ జయంతి (6వ తేదీ), హనుమజ్జయంతి (17వ తేదీ) మనకు ప్రధాన పండుగలు. నృసింహుడు ఉగ్రమూర్తి కాగా హనుమ రుద్రాంశ సంభూతుడు. ఒకరేమో కోరిన వెంటనే వచ్చి భక్తుల మాటను నిలబెట్టేవారైతే... రెండోవారు నిష్ఠకు, సేవాపరాయణత్వానికి ప్రతీకగా నిలిచినవారు. నృసింహుడు ఎందరికో ఆరాధ్య దైవం. ఆయనను సేవిస్తే శీఘ్రంగా వరమిస్తాడని, నెరవేరని కోరికలంటూ ఏమీ ఉండవని ప్రతీతి. ఇక హనుమ అందరికీ ప్రియమైన దేవుడు. శ్రీరామదూతగా, అతులిత బలధామునిగా, విద్యా పారంగతునిగా, జితేంద్రియునిగా ఆ అవతారమూర్తి తత్త్వాన్ని పెద్దలు ఈ సంచికలో వేర్వేరు కోణాలలో దర్శింప చేశారు. ఇంకా ఈ నెలలోనే కన్యకా పరమేశ్వరి జయంతి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వస్తున్నాయి. అన్నవరం సత్య నారాయణ స్వామి, ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. అయితే మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఉత్సవాలకు మునుపటి శోభలేదు. ఆడంబరాలకంటే అంతరంగంలోని భక్తిప్రపత్తులనే భగవంతుడు అధికంగా ఇష్టపడతాడు. కనుక మనసా అభీష్ట దైవాలకు నమస్కరిద్దాం. కరోనా మహమ్మారి వల్ల ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. మళ్లీ వీలైనంత వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. 

 

➠ వైశాఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతి. దీనిని తెలుగువారంతా వైభవంగా నిర్వహిస్తారు. సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణలు నిర్వహిస్తారు. స్వామికి సిందూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణలు ప్రత్యేకంగా చేస్తారు. హనుమంతుని గుణగానం చేసినవారిలో భక్తిశ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి.

➠ పిలిచినంతనే పలికే దైవం నరసింహుడు. భక్తుని రక్షణ కోసం తక్షణం అవతరిస్తాడు. కోరిన కోర్కెలను వెంటనే తీరుస్తాడు ఆ స్వామి. అనేక ప్రదేశాలలో వివిధ రూపాలతో అవతరించాడు. నృసింహ జయంతికి ఆ క్షేత్రాలన్నింటిలోనూ విశేష ఉత్సవాలుంటాయి. 

➠ తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించకుండా తిరుమల యాత్ర పరిపూర్ణం కాదు. పద్మసరస్సులో పుట్టి ఆకాశరాజు కూతురుగా శ్రీనివాసుని చేపట్టిన అలమేలు మంగ సాక్షాత్తూ మహాలక్ష్మియే. పద్మావతీ శ్రీనివాసుల వార్షిక కల్యాణం వైశాఖమాసంలో మూడురోజుల పాటు తిరుచానూరులో వైభవంగా నిర్వహిస్తారు.

➠ మే 26వ తేదీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జన్మదినం సందర్భంగా.... ఆధ్యాత్మిక సాధన, సేవ మార్గాలద్వారా ధర్మమార్గాన్ని ఉపదేశిస్తున్న యోగిపుంగవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. ఆయన నెలకొల్పిన అవధూత దత్తపీఠం సమాజంలో ఆధ్యాత్మిక జీవన వికాసానికి కృషి చేస్తోంది. ధర్మాచరణ, సాధన, సేవ అనే మార్గాల్ని అనుసరిస్తూ యాభయ్యేళ్లకు పైబడి సమున్నతమైన పథంలో పయనిస్తోంది. 

➠ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కథ ఇప్పుడే ముగిసిపోలేదు. కనీసం మరో ఏడాదిపాటు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యవేత్తలు చెబుతున్నారు. భారతీయ సంప్రదాయం మెరుగైన ఫలితాలనిస్తోందని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో దీనికి సాటిలేదని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో మనం పాటిస్తున్న మంచి పద్ధతులను మన జీవన విధానంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తిస్తున్నారు. 

➠ అన్నవరం క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా అలరారుతుంది. ప్రతినిత్యం అక్కడ మంగళవాద్యాలు, పెళ్లిబాజాలు వీనులవిందు చేస్తాయి. శ్రీ సత్యదేవుడు, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవాలు దేవస్థానంలో వైభవంగా నిర్వహిస్తారు. దీనినే వార్షిక
కల్యాణం అంటారు. పాంచరాత్రాగమ పద్ధతిలో వారంరోజులపాటు జరిగే ఈ కల్యాణోత్సవాలను తిలకించడానికి రెండుకన్నులు చాలవు. 

➠ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మికతను ఆధునికతతో మేళవించి శాంతిమయ జీవనానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఆధునిక మానవునికి ఆనందం, ఆత్మవిశ్వాసం పెంపొందే విధానమిది. సుదర్శనక్రియాయోగంతో జీవనకళ నేర్పుతూ అందమైన జీవితాన్ని జీవించడం నేర్పుతున్న ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్. 

➠ బ్రహ్మంగారి పేరుచెబితే కాలజ్ఞాన తత్త్వాలు స్ఫురణకు వస్తాయి. దేశంలో ఎక్కడ ఏ వింత జరిగినట్టు తెలిసినా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏనాడో చెప్పారుగా అదే జరిగింది అనుకోవడం తెలుగునాట పరిపాటిగా మారిపోయింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచనలన్నీ ప్రాథమికంగా కాలజ్ఞానాన్ని తెలుపుతూ, వాటి నడుమ వేదాంత తత్త్వాన్ని చెప్పడం వల్లనే అంతగా ప్రజాదరణ లభించింది.

➠ రాయలసీమ ఎందరో యోగులకు పుట్టినిల్లు. అటువంటి యోగుల్లో ఆదోని లక్ష్మవ్వ సుప్రసిద్ధురాలు. తన అవధూత స్థితి ద్వారా కొందరిని, మహిమల చేత మరికొందరిని విశేషంగా ఆకర్షించింది. వైశాఖ బహుళ సప్తమి ఆమె సమాధి పొందిన మే 14వ తేదీన ఆదోని పట్టణంలో రథోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. 

Recent Comments