త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం 

ఏకబిల్వం శివార్పణం అంటూ కార్తికమాసంలో (నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు) ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు. ఓం నమశ్శివాయ చెబుతూ కాసిన్ని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి భుజించగలిగితే చాలు. హరోంహర శంకరా అంటూ నెల రోజుల్లో ఒక్క పర్వతిథి నాడైనా పుణ్యనదుల్లో మునకవేస్తే చాలు. తీర్థాలు, క్షేత్రాలు సేవించే భాగ్యం.... సాధు సత్పురుషులను దర్శించిన ఫలం.... పరమశివుని సన్నిధిలో దీపారాధన చేసే సదవకాశం కార్తికమాసమే మనకు అందిస్తుంది. కార్తికంలో ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో కోటిదీపోత్సవం నిర్వహించడం భక్తిటీవీ ఒక సత్సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో, ప్రభుత్వ ఆంక్షలను ప్రజారోగ్య పరిస్థితులను మదింపు చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది. ఉత్సవాలకు ఆంక్షలు, పరిమితులున్నా మనలో భక్తికి మాత్రం ఏ హద్దులూ, పరిమితులూ ఉండవు. అప్పటి వాతావరణాన్ని అనుసరించి అందరమూ కార్తిక నియమాలను పాటిస్తూ మహాదేవుని కరుణకు పాత్రులవుదాం.

ఈసారి కార్తిక శుభవేళలోనే గురువు మకర సంక్రమణంతో తుంగభద్రానదికి పుష్కరాలు వస్తున్నాయి. నవంబర్ 20 నుంచి 30వరకు ఉండబోయే పుష్కర పుణ్యవేళలో జలసిరులతో మమ్మల్ని కాపాడమంటూ శక్త్యనుసారం ఆ నదీమతల్లిని వేడుకుందాం. దీపావళి పండుగ (నవంబర్ 14) వేళ ప్రారంభించే దీపసంప్రదాయం వచ్చే డిసెంబర్ నెలలో కూడా కొనసాగనుంది. ఈ పవిత్ర కార్తికమాసంలో ఆలయ ధ్వజస్తంభాలపై వెలిగే ఆకాశ దీపాన్ని దర్శించినా చాలు. నదీమతల్లి ఒడిలో ఉయ్యాలలూగే దీపానికి నమస్కరించినా చాలు. దీపమే దైవస్వరూపం. నెల పొడవునా ప్రతి సంధ్యలోనూ మనం వెలిగించే దీపమే మనకు రక్షణ కవచం కావాలని దైవాన్ని ప్రార్థిద్దాం.

➠ దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఆయుధం దీపమే. అందుకే దీపేన సాధ్యతే సర్వం అన్నారు. ఆ దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపం. దేవుని గూట్లో వెలిగించిన దీపం నిశ్చలంగా ప్రకాశిస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏకాగ్రత కుదురుతుంది. పుణ్యం లభిస్తుంది.

➠ కార్తికం సమైక్యతా స్ఫూర్తినిచ్చే మాసం. సామూహిక వ్రతాచరణలు, వనభోజనాలు, అభిషేక కార్యక్రమాలతో ప్రజలందరూ ఏదో ఒకచోట ఒక్కటిగా కలగలిసిపోతారు. మామూలు మనుషుల్లోనే కాదు దేవతల్లోనూ అభేదాన్ని, అద్వైతాన్ని ప్రతిపాదించే పావన మాసం కార్తికం.

➠ కార్తికమాసమంతా భీమమండలంలోని దేవాలయాలన్నీ శివనామస్మరణతో పులకించి పోతుంటాయి. ఇప్పటికి ఆరువందల సంవత్సరాలకు పూర్వం శ్రీనాథమహాకవి ఈ ప్రాంతమంతా కలయతిరిగాడు. దక్షారామ భీమేశ్వరుని కథను పురాణంగా రచించాడు. తాను చూసిన ప్రతి స్థలాన్ని, ఎంతో మనోహరంగా కావ్యంగా అందించాడు. 

➠ భిన్నత్వంలో ఏకత్వం సృష్టి అంతటా ఉంది. ఈ సృష్టిలోని సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి సమస్తం ఒకే పదార్థంతో తయారయ్యాయి. ఆ ఒక్కదానికే శివం అని పేరు. జీవం ఉన్న ప్రతి వస్తువులోనూ శివతత్త్వం ఉంది. అటువంటి శివతత్త్వం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ధ్యానరూప చైతన్యస్థితిని సాధించాలి.

➠ సమతకు నిలువెత్తు దర్పణం శ్రీచినజీయర్ స్వామి. శ్రీమద్రామానుజుల బాటలో అడుగులు వేస్తూ సమతా సాధనే లక్ష్యంగా సాగుతున్న సాధుమూర్తి. నరునికి నారాయణ సందేశమందించే ఆధ్యాత్మికవేత్త. సత్సమాజం కోసం స్వప్నిస్తున్న సర్వసంగ పరిత్యాగి.
కోట్లాది భక్తుల పాలిట కల్పవల్లి. ఆయన తిరునక్షత్రం సందర్భంగా స్వామికి భక్తిపత్రిక ప్రణతులర్పిస్తోంది. 

➠ వెలుగుతున్న ఒక దీపం మరెన్నో దీపాలను వెలిగిస్తుంది. తిమిరాన్ని తరిమికొడుతుంది. కార్తికంలో కైలాసనాథుని స్మరించి వెలిగించే కార్తికదీపం పాపాలను హరిస్తుంది. కార్తికంలో వెలిగే ప్రతిదివ్వె మంగళప్రదం.

➠ మానవుడు చేసే ప్రతీ పనికి ప్రతిఫలం ఆశిస్తాయి. అయితే ఫలాపేక్షతో చేసే కర్మలు బంధానికి కారణమవుతాయి. బంధవిముక్తి కలగాలంటే కర్మలు ఫలాపేక్ష రహితంగా చేయాలి. స్వార్థరహితంగా, ప్రేమపూర్వకంగా సేవ చేయాలి. ఏవిధంగా సేవచేసినా మనకు మనమే సేవచేసుకుంటున్న ఎరుక ఉండాలి అంటారు భగవాన్ సత్యసాయి బాబా.

➠ శ్రీసత్యనారాయణ స్వామి తెలుగువారి ఇలవేలుపు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాల సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. సకల అభీష్టాలు సిద్ధించడానికి సత్యదేవ వ్రతం సర్వోత్తమమైనదని భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమికి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలసిన రత్నగిరికి భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు.

➠ కార్తికమాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తుల కోలాహలం మొదలవుతుంది. ఇది మండలదీక్షలు ప్రారంభమయ్యే మాసం. ఆలయాలలో గురుస్వాముల చేతులమీదుగా స్వామి దీక్షలు తీసుకుంటారు. తెలుగునాట అయ్యప్ప ఆలయాలెన్నో ఏడాది పొడవునా
కరిమలవాసుని దర్శనభాగ్యం కలిగిస్తున్నాయి.

➠ భూమి లోపలి భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులు నాగులు. వాటిని దేవతలకు ప్రతిరూపాలుగా భావించడం అనాది ఆచారం. నాగుల చవితినాడు పుట్టకు పూజచేస్తారు. పుట్టమన్ను పవిత్రం. సారవంతం. అందుకే కార్తికమాసమంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు.

Recent Comments