భవానీ భవానీ భవానీ త్రివారం
ఉదారం ముదా సంతతం యే జపంతి
నశోకం నమోహం నపాపం నభీతిః
కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం

ఆదిపరాశక్తి, సమస్త శక్తులకు ఆధారం. ముగురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ దుష్టశిక్షణకై విజృంభించిన తరుణమిది. జగన్మాత తొలి మూడు రోజులూ మహాకాళిగా, మహాదుర్గగా అవతారమెత్తింది. తర్వాత మహాలక్ష్మిగా, చివరి మూడు రోజులూ  మహాసరస్వతిగా దుష్టరాక్షసులను చీల్చిచెండాడింది. పదోనాడు అపరాజితగా విజయోత్సవాలు జరుపుకుంటుంది. అదే విజయదశమి. దేశమంతటా దుర్గామాతను కృతజ్ఞతాభావంతో ఆరాధించే పెద్ద పండగ ఈ దసరా (21 నుంచి 30 దాకా). విజయదశమికి ముందు దుర్గాష్టమినాడు (28వ తేదీ) ఆయుధ పూజ జరుపుకుంటారు. కర్మాగార యంత్రాల నుంచి చేపరికరాల దాకా ఆయుధపూజ నాడు పూజలందుకుంటాయి. అన్ని వృత్తులవారూ తమ పనిముట్లను దుర్గామాత సన్నిధిలో ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారు. నేటి నాగరికుని పనిముట్లే జీవనపోరాటంలో ఉపకరించే ఆయుధాలు. శరన్నవరాత్రుల విశిష్టతను విప్పిచెప్పే వ్యాసాలను ఈ సంచికలో పొందుపరిచాం. ఇదే తరుణంలో (20 నుంచి 30) బంగారు బతుకమ్మను ఊరూరా ఓలలాడించే సంబురాలు వస్తున్నాయి. పసుపు పూల బతుకమ్మను జానపద ఆటపాటలతో తెలంగాణ ఆడపడుచులు కొలవడం ఆనవాయితీ. జమ్మి ఆకులను వెండి బంగారంగా పెద్దలకు పంచి దీవెనలు అందుకోవడం, పాలపిట్టను దర్శించడం దసరా వేడుకల్లో ముఖ్య భాగం. మానవ సంబంధాలను ఉద్ధరించే అలయ్ బలయ్ వేడుక తెలంగాణ సంస్కృతికి దర్పణం. సమస్త దేవీదేవతలను ఆరాధించుకునే మహిమాన్వితంగా వెలుగుతున్న ఈ మాసం ఎల్లరికీ శుభాలు చేకూర్చాలని కాంక్షిస్తూ ...

➠ అగస్త్యుని కమండలం నుంచి జాలువారిన పుణ్యనది కావేరి. ఆ నదీతీరం వెంట ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. సమతావాదం నేర్పిన శ్రీమద్రామానుజుని కార్యక్షేత్రం కావేరీ తీరం. త్యాగరాజాదుల సంగీత ప్రవాహ ఝరి కావేరీ తరంగం. కావేరి నీళ్లలో సంగీతం ఉంది. సంస్కరణవాదం ఉంది. గురుని తులాసంక్రమణంతో విశేష పుణ్యబలం కూడా ఆ జీవనదిని వరిస్తోంది. 
 
➠ భాద్రపద బహుళ పాడ్యమి మొదలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి వరకు పదహారు రోజులకు మహాలయ పక్షం అని పేరు. ఈ పదహారు రోజులూ పితృదేవతారాధనకు సంబంధించినవే. ఈనెల 7వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభమవుతోంది. ఈ మహాలయ పక్షాలను ఇంటివద్ద నిర్వర్తించవచ్చు. ఈ అమావాస్య నాడు ఎవరైనా శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.

➠ బ్రహ్మోత్సవ వేళ తిరువేంకటనాథుడు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తకోటిని తరింపచేస్తాడు. కనులకు మిరుమిట్లుగొలిపే దీపతోరణాలతో, అఖండజ్యోతులతో, జిగేల్మనే నవరత్నహార సంచయంతో, కర్ణపేయమైన వేదఘోషలతో, భక్తిభావ లహరులైన పాటలతో, గోవిందనామాలతో సప్తగిరులు శోభిల్లుతాయి.

➠ ఆమె ధర్మం సేవాధర్మం. మనసు అమృతం. వాక్కు అమృతం. ఆమెది అమృతత్వం. ఆర్తులకు, ఆపన్నులకు అమృతహస్తం అందించి... సుధలు పంచడానికే పుట్టిన పున్నమి జాబిలి మాతా అమృతానందమయి. మానవాళిని సాంత్వనపరిచే లక్ష్యం కోసం జీవితాన్ని అంకితం చేసింది. మన కన్నీరు తుడుచుకున్నంత సహజంగానే ఇతరుల కన్నీరునూ తుడవాలంటారు.

➠ శరన్నవరాత్రులలో మూలానక్షత్రం నాడు విద్యలకు అధిదేవత అయిన మహాసరస్వతిని అర్చిస్తారు. విద్య, విజయాలను అందించే సరస్వతీదేవి శత్రుసంహారిణి కూడా. శుంభనిశుంభులను సరస్వతీదేవియే మూలానక్షత్రం నాడు వధించింది. అందుకే ఆరోజున శక్తి ఆలయాల్లో సరస్వతీ అలంకారం ప్రత్యేకంగా చేస్తారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. 

➠ ఈ సమస్త సృష్టికి మూలధారమైన జగన్మాతకు గ్రామీణుల జాతరలంటే పరమప్రీతి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామదేవతలకు జరిపించే జాతరల్లో మన సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అటువంటి జాతరల్లో ప్రసిద్ధమైనది నెల్లూరు వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర.

Recent Comments