ఆది దేవుడు, విజయాన్నిచ్చే విఘ్నదేవుణ్ని ఆరాధించుకొనే వినాయక చవితి ఈనెల 13న విచ్చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు పల్లెల నుంచి పట్టణాల వరకు ఆధ్యాత్మిక శోభ తోరణాలు కడుతుంది. ఇక్కడ నుంచే పండుగలు మొదలౌతాయి. పత్రి, పూలతో శ్రద్ధాభక్తులతో జరుపుకొనే పండుగ ఇది. ఈ మాసారంభంలోనే కృష్ణాష్టమి విజయం చేస్తోంది. దేశమంతా కృష్ణస్వామి స్మరణతో, కోలాటాలతో, ఉట్టికొట్టే ఆటలతో కోలాహలంగా ఉంటుంది. ఈ నెల 13న తిరుమలలో అధికమాస బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతున్నాయి. శ్రీనివాసుడు తిరుమాడ వీథుల్లో ఊరేగుతూ... భక్తులను అనుగ్రహిస్తాడు. సప్తగిరులు పులకించిపోతాయి. మంచి పని సంకల్పించడంలోనే దైవత్వం ఉంది. దానికి చిత్తశుద్ధి తోడైనప్పుడు దైవం కూడా ఉండి నడిపిస్తాడు. అప్పుడు ఎంతటి బృహత్కార్యమైనా అవలీలగా సాగిపోతుంది. సత్సంకల్పానికి మించిన పూజ ఏదీ లేదు అన్న మహాగురువుల సందేశాన్ని తలచుకొని సత్సంకల్పాలకు నాంది పలుకుదాం. గతించిన పెద్దలను పేరుపేరునా స్మరించుకుంటూ వారి సౌఖ్యం కోసం దానధర్మాలు చేసే మహాలయ పక్షాలు 25నుంచి ప్రారంభమౌతాయి. వారిని తరింపజేద్దాం.

➠ శ్రావణ బహుళ అష్టమినాడు మధురానగరంలో శ్రీకృష్ణ జననం జరిగింది. వైష్ణవులు రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమినాడు జన్మాష్టమి నిర్వహిస్తారు. ఈనెల 2వ తేదీన స్మార్త కృష్ణాష్టమికాగా.. 3వ తేదీ వైష్ణవ కృష్ణాష్టమి వచ్చింది. శ్రీకృష్ణ భక్తులకు రెండూ పర్వదినాలే అంటూ కోగంటి  వేంకట శ్రీరంగనాయకి రాసిన భగవాన్ శ్రీకృష్ణ వ్యాసంలో వివరణ చూద్దాం. 

➠ ద్వారక అంటే మోక్షానికి ద్వారమని అర్థం. సప్తమోక్ష క్షేత్రాల్లో ప్రధానమైంది. లోకపావనుడు నడయాడిన నేలపై ద్వారకాధీశ మందిరం, బేట్ ద్వారక దర్శనానికి యాత్రికులు అధికసంఖ్యలో తరలివెళ్తారు. కృష్ణాష్టమి పర్వదినం రోజున మాత్రమే అభిషేక దర్శనభాగ్యం కలిగించే ద్వారకాధీశుని వైభవ విశేషాలు పారిజాత పరిమళాలను అదిగో ద్వారకలో చూద్దాం. 

➠ మన దేవతలందరిలో గణపతిని మాత్రమే మహాగణపతి అని పిలుస్తాం. మహాగణపతి అనే శబ్దానికి మహాంశ్చాసౌ గణపతిః అని, మహతాం గణానాం పతిః అని రెండు వ్యుత్పత్తి అర్థాలున్నాయి. అంటే గొప్ప గణపతి, విశేషమైన గణపతి అని అర్థం. ప్రతి సంవత్సరం మనం పూజించే గణపతికి సైతం పూజనీయుడైన గణపతియే మహాగణపతి అంటూ పసుపు వినాయకుడు పేరుతో రాసిన ధూళీపాళ మహదేవమణి వివరణ చూద్దాం. 

➠ వినాయకుడు అనే పేరు పలకగానే అంతులేని ఆనందం కలుగుతుంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు అందరికీ వినాయకుడు ఇష్టదైవమే. గణపతి మా దేవుడు. నా గోడు వింటాడు. నాకు ఏ కష్టం రానివ్వడని..ప్రతి భక్తుడూ భావిస్తాడు. భక్తుల మనసుల్లో ఇంతగా సుప్రతిష్టమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి అంటూ డా. కప్పగంతుల రామకృష్ణ రాసిన గణేశం భజే  వివరణలో చూద్దాం. 

➠ ఇంకా శిఖరాయమానం అద్వైతజ్ఞానం అంటూ గరికపాటి నరసింహారావుతో ముఖాముఖి, డా. కడిమిళ్ల వరప్రసాద్ రాసిన అష్టార్చనలు,  డా. కాకునూరి సూర్యనారాయణ మూర్తి రాసిన మహాలయ పక్షం, తలపూరు సతీష్ కుమార్ రాసిన అన్నదాత బాబా వివరణ చూద్దాం. 

➠ ఇంకా మాసఫలం, శ్రీచందనం కాలానికి కళ్లెం వంటివి.. ఈ సంచికతో పాటు వినాయకవ్రతం చిరుపుస్తకం కానుకగా అందిస్తున్నాం. అవిఘ్నమస్తు.

Recent Comments