"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"

సెప్టెంబర్ నెల వస్తూనే వినాయక చతుర్ధిని వెంట తీసుకు వస్తోంది. ఈ నెల 2 నుంచి గణపయ్య నవరాత్రి ఉత్సవాలు పల్లెల్ని పట్టణాలను సందడిలో ముంచెత్తుతాయి. భక్తి ప్రపత్తులతో ప్రతి వినాయక విగ్రహానికీ పూజలు జరుగుతాయి. బొజ్జ గణపయ్యకి బోలెడు నివేదనలు సమర్పిస్తారు. భక్తులు ఆరగించి ఆనందిస్తారు. విఘ్నేశ్వరుడు విలక్షణమైన దేవుడు. మనం తలపెట్టే అన్ని కార్యక్రమాలనూ ముందుండి నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాడు. అందుకే ఆయన ఆదిదేవుడు. విఘ్నరాజుని స్మరించకుండా ఎవ్వరూ అడుగు ముందుకు వేయరు. మన పండుగలు కూడా వినాయక చతుర్ధితోనే వరస పెడతాయి. చవితి పండగ, తర్వాత నవరాత్రి పర్వం, అనంతరం శోభాయాత్రతో వినాయక నిమజ్జనం వాడవాడలకీ ఆధ్యాత్మిక శోభని అద్దుతాయి. గణనాథుడు జానపదుల దేవుడు. తలపెట్టిన పనులన్నిటినీ ముందుండి విజయవంతంగా నడిపిస్తాడని గణపయ్య మీద తిరుగులేని నమ్మకం. చవితి పూజలు అందుకోవడానికి వినాయకుడు భూమ్మీదకు రావడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఆయన జనసామాన్యుల దేవుడు. వినాయకుని స్వరూపం విలక్షణమైనది. ఆయన లంబోదరుడు, మరుగుజ్జు అయినా ప్రతికూలతలను అధిగమించి ఆదర్శం అయ్యాడు. కార్యసాధకులకు అవసరమైన లక్షణాలన్నీ గణేశునిలో మూర్తీభవించాయి. గణేశుని ఆకృతిలో ఒక్కో భాగమూ ఒక్కో సందేశాన్ని మనకు అందిస్తుంది.

➠ గతించిన పెద్దల్ని పేరుపేరునా స్మరించుకుంటూ వారికి చేరే తీర్థవిధుల్ని శ్రద్ధగా సమర్పించాల్సిన మహాలయ పక్షాలు ఈ నెలలోనే వస్తున్నాయి.

➠ జానపదులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే నెల్లూరు వెంకటగిరి పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 18న జరగనుంది. ఈ నెల ఆద్యంతం ఆధ్యాత్మిక శోభలను వెలారుస్తోంది. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలతో నీళ్లమీద ఓలలాడించే బతుకమ్మ పండుగ 28న ప్రారంభమవుతుంది. 

➠ దేవీ ఆలయాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు.

➠ కేరళీయులకు ఓణం పెద్దపండుగ. వర్షానికి కారణమైన వరుణ, ఇంద్రులను పూజించడం ఓణం పండుగ అంతరార్ధం. వానకాలంలో ప్రకృతి ప్రసాదించే పూవులతో దేవతారూపాలను చేస్తారు. కొబ్బరికోరునూ నైవేద్యమిస్తారు. వానలో తడుస్తూనే మళయాళీలు రకరకాల ఆటలు ఆడతారు.

➠ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరునిపై భారతీయ టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ రాని విశిష్ట కార్యక్రమం. ఓం నమో వేంకటేశాయ... అపూర్వ దృశ్యకావ్యం ఆగస్టు23వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకూ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు తిరిగి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం 1 గంటకు మీ భక్తి టీవిలో.... తప్పక వీక్షించండి.

➠ వినాయక చవితి సందర్భంగా వినాయక పూజ చిరుపుస్తకాన్ని ఉచితంగా అందుకోండి..!

Recent Comments