శ్రీ శోభకృత్ వసంత శోభ చైత్రపూర్ణిమనాటి హనుమత్ విజయోత్సవంతో (ఏప్రిల్ 6) పరిపూర్ణతను సంతరించుకుంటుంది. వైశాఖం ప్రవేశిస్తూనే సింహాద్రి అప్పన్న చందన సేవను వీక్షించే భాగ్యాన్ని కలిగిస్తుంది. అక్షయ తృతీయ (ఏప్రిల్ 23) సందర్భంగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా పూజిస్తారు. బంగారం దేవలోహం. పొదుపుకి, మదుపుకి అనువైన బంగారాన్ని ఆరోజున కొద్దిగానైనా కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ నాడు చేసిన పనులు అక్షయమైన ఫలితాలను అందిస్తాయని విశ్వాసం. వేసవి తాపం క్రమంగా పెరిగే కాలం కాబట్టి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటవుతాయి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం, వేసవిలో దప్పిగొన్నవారికి నీటిని అందించడం కంటే గొప్ప పుణ్యకార్యాలు లేవని పెద్దలు తరచు చెబుతుంటారు. అందరం వీలైనంతలో ఈ వేసవిలో నీటిని పొదుపు చేద్దాం. అవసరం ఉన్నవారి దాహార్తిని తీర్చుదాం. 

వైశాఖం మన పవిత్రమాసాల్లో ఒకటి. అటువంటి వైశాఖాన్నే తమ కార్యక్షేత్రంగా ఎంచుకుని, పరశురాముడు – ఆదిశంకరుడు మొదలుకుని ఆధునిక గురువుల వరకు ఎందరో మహాత్ములు ప్రభవించారు. వారి జయంతుల పుణ్యవేళ వారందరినీ స్మరించుకుందాం. వారందించిన జ్ఞానగంగలో పవిత్రులమవుదాం. గంగానది భారతీయుల ఆత్మ. జీవితంలో ఒక్కసారైనా గంగలో స్నానం చేయాలని, విశ్వనాథుని సేవించాలని మనవారు తాపత్రయ పడుతుంటారు. గంగాజలాన్ని పూజాగదులలో ఉంచి పూజస్తారు. శుభకార్యాలలో పవిత్రత కోసం గంగనీటినే ఉపయోగిస్తారు. అటువంటి గంగానదికి ఏప్రిల్ 22 నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ముక్కోటి దేవతలకు ఆవాస స్థానమైన గంగను మనసారా స్మరించుకుందాం. ఆ దేవతలు మనందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం.

➠ అతడు శివభక్తికి నిధి. అతని నడత శివచైతన్యం. లోక హితాభిలాషయే అతని శివాచారలక్ష్యం. ఆపాదమస్తకం శివుణ్ణేనింపుకున్న మహనీయుడు బసవేశ్వరుడు. ఈశ్వర పరతత్త్వాన్ని ప్రవచించడం కోసమే పుట్టిన ఆదివృషభేంద్రుని అవతారం. సకలసృష్టి శివస్వరూపమేనని నిరూపిస్తూ, ప్రజల హృదయసీమల్లోశివభక్తిని పదిలపరచటం కోసం నేలకు వచ్చిన అపర శివుడు బసవేశ్వరుడు.

➠ బ్రహ్మంగారి పేరుచెబితే కాలజ్ఞాన తత్త్వాలు స్ఫురణకు వస్తాయి. దేశంలో ఎక్కడ ఏ వింత జరిగినట్టు తెలిసినా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏనాడో చెప్పారుగా అదే జరిగింది అనుకోవడం తెలుగునాట పరిపాటిగా మారిపోయింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచనలన్నీ ప్రాథమికంగా కాలజ్ఞానాన్ని తెలుపుతూ, వాటి నడుమ వేదాంత తత్త్వాన్ని చెప్పడం వల్లనే అంతగా ప్రజాదరణ లభించింది. 

➠ ఆకాశంలో ఉండే నీరు భూమిపైకి వస్తున్న సమయంలో ‘అహి’ అనే మేఘానికి తగిలి వర్షధారలుగా కురుస్తుంది. అలా కురిసే ధారలే నదులు అని అధర్వణ వేదం చెబుతోంది. అటువంటి పవిత్రమైన నదుల వరసలో మొదటిది, తలమానికమైనది గంగ. ఆమె మోక్షస్వరూపిణి. గంగాపానం, గంగాస్నానం సకల పాపాల నుంచి విముక్తులను చేస్తుంది. విష్ణులోక ప్రాప్తి కలిగిస్తుంది.

➠ భారతదేశం నేలపై ఎంతోమంది మహానుభావులు జన్మించారు. వారిలో నభూతో నభవిష్యతి అనిపించే ఓ తేజోమూర్తి, దివ్య స్ఫూర్తి, భగవాన్ సత్యసాయిబాబా. ఆధ్యాత్మిక వైభవంలో భారతీయత మహోన్నతమైనదని, ఈ నేల దివ్యప్రేమకు నిలయమని నిరూపించిన మహనీయుడు సత్యసాయి. వారి ఆరాధనోత్సవాల్లో భాగంగా వారి పలుకులను స్మరించుకోవడం అందరి మహద్భాగ్యం.

➠ వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్యుల ఆరాధ్య దేవత. విష్ణువర్ధనుడనే చాళుక్యరాజు ఆగడాలకు ఎదురు తిరగడం కోసం తనను తానే ఆత్మార్పణ చేసుకుంది. ఆ రకంగా యుద్ధప్రమాదాన్ని, కులవినాశనాన్ని తప్పించింది. ఆత్మార్పణకు ముందు ఆమె తన విశ్వరూపాన్ని చూపింది. ఆనాటినుంచి వైశ్యులు ఆమెను కులదైవంగా పూజిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వాసవీ కన్యక ఆలయాలున్నాయి.

➠ వసంత నవరాత్ర ఉత్సవాల తరువాత ఇంద్రకీలాద్రి కనకదుర్గ దేవస్థానం(విజయవాడ)లో వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ లక్షలాది పుష్పాలతో అమ్మకు ప్రత్యేక అర్చనలు, అలంకారాలు జరుగుతాయి. చైత్రపౌర్ణమినాడు దుర్గామల్లేశ్వర స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది.

Recent Comments