జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః
ముక్తాఃతా శుభదా భవంతు భవతామ్ శ్రీరామ వైవాహికాః

రాముని పేరు చెబితే మానవాళి పులకించి పోతుంది. మనిషిగా పుట్టి, చక్రవర్తి కుమారునిగా పెరిగి... కష్టసుఖాలను చవిచూసినవాడు. సాక్షాత్తూ ధర్మమే రామునిగా పోతపోసుకుని, యుగాలుగా మానవజాతికి ఆదర్శంగా నిలిచాడు. మనకు ఆరాధ్య దైవమయ్యాడు. సీతారామ కల్యాణం (ఏప్రిల్ 6) తెలుగువారికి మహోత్సవం. పచ్చని తాటాకు పందిళ్లు, వడపప్పు ప్రసాదాలు, చెరకు పానకాలు రామనవమి ఆనవాళ్లు. ఈ శుభవేళ ప్రతి లోగిలీ కల్యాణ మంటపం అవుతుంది. భద్రాచలం వంటి ప్రసిద్ధ శ్రీరామ క్షేత్రాలలో జరిగే సీతారాముల పెండ్లిని కనివినీ ఆనందిస్తారు. ఈ వసంతోదయ మంగళవేళ సీతారాముల ముత్యాల తలంబ్రాలు దీవెనలుగా మనందరిపై వర్ణింప చేయాలని ప్రార్థిస్తున్నాను.

చైత్రమాసంలోనే పున్నమినాడు ఉత్తరాదివారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. అంతకుముందు రోజు రాత్రిపూట (ఏప్రిల్ 11) ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం జరుగుతుంది. చైత్రం పూర్తవుతూనే వైశాఖం ప్రారంభమవుతుంది. వైశాఖంలోని మూడోరోజున (ఏప్రిల్ 30) అక్షయ తృతీయ పర్వదినం వస్తోంది. లక్ష్మీ అనుగ్రహం కోసం, పుణ్యం సంపాదించుకోవాలనుకునే వారికి ప్రతి ఏడాది వచ్చే అక్షయ తృతీయ ఒక బంగారు అవకాశం. ఆనాడు చేసే పుణ్యపాపాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయంటారు. ఆనాడు యధాశక్తిగా పుణ్యకార్యాలను ఆచరిద్దాం. అక్షయ తృతీయ రోజునే సింహాచలంలో అప్పున్న చందనోత్సవం తెలుగునాట చెప్పుకోదగిన ఉత్సవం. అలాగే ఈ మాసంలో అనేక క్షేత్రాల్లో కల్యాణోత్సవాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఆ దేవతలందరూ తమ అనుగ్రహాన్ని మనకు అందించాలని కోరుకుందాం.

➠ శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు. ఆయన లోకరక్షకుడై... నాలుగు చేతులతో శంఖు చక్రాలను, బాణకోదండాలను దాల్చి... సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభువుగా వెలిసిన దివ్యక్షేత్రం భద్రాచలం. తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరి. వేదాలలో కనిపించే 'భద్ర' బీజాక్షరాలకు సాకారమైన క్షేత్రం. ప్రతి శ్రీరామనవమి నాడు అక్కడ జరిగే సీతారామ కల్యాణోత్సవం తెలుగువారందరికీ ప్రీతిపాత్రం.

➠ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమే.

➠ మనోవేగ వాయువేగములవంటి వేగముగలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వానరజాతిలో ముఖ్యుడు, శ్రీరామదూత హనుమత్ విజయోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి.

➠ త్రికరణ శుద్ధిగా చేసే ఏ చిన్న పనైనా సరే... అది భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతుందని చెప్పటానికి ప్రతీకగా నిలిచే పండుగ అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తృతీయకు అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజున చేసే పుణ్యం రవ్వంతైనా సరే అది కొండంత ఫలితాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే అక్షయ తృతీయ అంతులేని ఆదరణ పొందింది.

➠ చందనోత్సవం, చందన యాత్ర పేర్లు వింటేనే అప్పన్న భక్తులకు అణువణువూ పులకరిస్తుంది. యుగయుగాలుగా దేవుడున్నాడని నిరూపించే దివ్య మనోహర పుణ్యక్షేత్రం సింహాచలం. ఆ స్వామి చల్లగా ఉంటేనే లోకాలన్నీ అంతకంటే చల్లగా వర్ధిల్లుతాయి. అందుకే ఏటేటా చందనోత్సవం. అందుకే ఆ స్వామి కోసం, ఆ చందన ప్రసాదం కోసం లక్షలాది భక్తులు బారులు తీరి వేచి ఉంటారు.

➠ భగవాన్ సత్యసాయిది ప్రేమావతారం. ఆత్మతత్త్వాన్ని తెలుసుకున్న మానవుడు కర్మమార్గాన్ని అనుసరిస్తాడని, అపకారికి సైతం ఉపకారిగా మారతాడన్నారు. ప్రయత్నపూర్వకంగా సందేహాలను తొలగించుకుని కోరికల ఆవరణను దాటగలిగితే మానవుడు చూస్తున్నదంతా భగవత్ తత్త్వమే అని అర్ధం చేసుకోగలడన్నారు. భగవత్ భావం చేత సర్వమూ సాధించవచ్చనేదే శ్రీసత్యసాయి సందేశం.

Recent Comments