"శ్రీమహాలక్ష్మికి క్షీరాబ్ధి కన్యకకు జయమంగళం
వరములిచ్చే తల్లి వరమహాలక్ష్మికి శుభమంగళం"

శ్రావణ, భాద్రపదాలకు సేతువుగా భక్తిపత్రిక ఆగష్టు సంచిక మీ కరకమలాలను అలంకరించింది. ఏడాదిలో శ్రావణంలాంటి సందడిమాసం మరోటి లేదు. మహిళామణులు భక్తిప్రపత్తులతో ఆచరించే వరలక్ష్మీవ్రతం ఆగస్టు 5వ తేదీన వస్తోంది. వరాల తల్లి అయిన లక్ష్మీదేవి మీ ఇంట ఐశ్వర్యాలను కురిపించాలని కోరుకుంటున్నాం. అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతంగా నిలిచే రాఖీపండుగ (12) సందర్భంగా తోబుట్టువులకు శుభాకాంక్షలు. గీతాబోధ చేసిన జగద్గురువు శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుక 19న విచ్చేస్తోంది. ఉట్టికొట్టే సంబరాలతో, కోలాటాలతో యువతరం ఈ ఉత్సవానికి శోభ తెస్తుంది. ఏ దైవానికి నమస్కరించినా, ఆ నమస్కారాలన్నీ శ్రీకృష్ణునికే చెందుతాయని పెద్దలు చెబుతుంటారు. అటువంటి కృష్ణునికి నమస్కారం.

ఏటేటా ఎన్నెన్ని పూజలు చేసినా తొలిపూజ మాత్రం వినాయకుడికే దక్కుతుంది. అందుకే వినాయక చవితిని మొదటి పండుగగా పిలుస్తారు. ఆదిదేవుడైన విఘ్నేశ్వరుడు మన పూజలు అందుకుని, మనందరికీ విజయాలు సమకూర్చడానికి ఈనెల 31న విచ్చేస్తున్నాడు. ఈమాసం భక్తిపత్రికకు అనుబంధంగా శ్రీవినాయక వ్రతకల్పాన్ని అందుకుని, శాస్త్రోక్తంగా స్వామిని పూజించండి. ప్రకృతి విపత్తులు, సీజనల్ వ్యాధులు, ఇంకా పూర్తిగా తొలగిపోని కరోనాభయం... ముప్పేట దాడి చేస్తున్న తరుణంలో వీటన్నింటినుంచి వినాయకుడు మనల్ని రక్షించాలని కోరుకుందాం. భక్తిటీవీ ఈ ఆగస్టుతో పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు మాపై చూపిస్తున్న అభిమానం ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మా ప్రేక్షకులకు, ప్రకటన కర్తలకు శుభాకాంక్షలు అందిస్తున్నాను.

➠ మంత్రాలయం రాఘవేంద్రుల ఆలయంలో ఏటా శ్రావణమాసంలో ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతాయి. స్వామి అనుగ్రహాన్ని కోరుకునే కళాకారులందరూ ఈ సందర్భంగా మంత్రాలయాన్ని సందర్శిస్తారు. వేలాది భక్తులతో మంత్రాలయం దివ్యశోభను సంతరించుకుంటుంది.

➠ కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితికి గ్రామోత్సవం జరుగుతుంది. మరునాడు బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ ధ్వజారోహణం చేస్తారు. 20వ తేదీన జరిగే తెప్పోత్సవంతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం అవుతాయి.

➠ కర్కాటక సంక్రమణంలో వచ్చే అమావాస్యను తమిళులు ఆది అమావాస్య అంటారు. ఆ అమావాస్య తరువాత వచ్చే మంగళవారంనాడు జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరంలో రామనాథ స్వామి, పర్వత వర్థినీ అమ్మవార్లకు తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.

➠ శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అదే కృష్ణాష్టమి పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలలోనూ నేడు కృష్ణభక్తులున్నారు. వారంతా అవతారమూర్తిగా, లీలామానుష విగ్రహునిగా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలను పాడుకుని పరవశిస్తుంటారు.

➠ వరలక్ష్మీవ్రతానికి తెలుగునాట ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళామణులు ప్రతి సంవత్సరం తప్పకుండా వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన మహిళలు పేరంటాళ్లకు వాయినం ఇస్తూ ‘కోరితి వరం’ అంటారు. వాయినం అందుకుంటున్న వారు ‘ఇస్తిని వరం’ అంటారు. ఆ తరువాత పూజ చేసుకున్నవారు ‘ఇస్తినమ్మ వాయినం’ అంటారు. వాయినాన్ని అందుకుని ముత్తయిదువ ‘పుచ్చుకొంటినమ్మ వాయినం’ అనాలి. ముత్తయిదువ రూపంలోనే లక్ష్మీదేవి మనపై వరాలను కురిపిస్తుందని నమ్ముతారు.

➠ అన్నాచెల్లెళ్ల అనురాగబంధానికి గుర్తు రక్షాబంధనం. పురాణ, చారిత్రక కాలాల నుంచి రాఖీ వర్ధిల్లుతోంది. భారతీయ కుటుంబ వ్యవస్థను పదిలంగా కాపాడుతోంది. రాఖీ వేడుకకు ఎల్లలు లేవు.

Recent Comments