అధిక శ్రావణమాసం గడుస్తోంది. చాంద్రమానం ప్రకారం పంచాంగంలో వచ్చే హెచ్చు తగ్గులను సరిచేయడానికి వచ్చిందే అధికమాసం. ప్రతి మూడేళ్లలో ఒకసారి అధికమాసం వస్తూ ఉంటుంది. అధికమాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. ఈ మాసంలో ప్రత్యేకంగా విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అధికమాసం పూర్తవుతూనే ఈనెల 17 నుంచి నిజ శ్రావణమాసం ప్రవేశిస్తుంది. పండుగలకు నెలవు శ్రావణమాసం. వరలక్ష్మీ వ్రతం, గౌరీపూజలతో మొదలుపెట్టి అనేక పండుగలు శ్రావణ మాసంలోనే వస్తుంటాయి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మా... మంగళగౌరికి వందనమనరే అంటూ... స్త్రీలు పేరంటాలు నిర్వహించుకుంటారు. వానలు హెచ్చుగా కురిసే శ్రావణ వాతావరణంలో అనారోగ్యాలు తలెత్తకుండా కాళ్లకు పసుపు రాసుకుంటారు. శనగలు వాయనం ఇస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని (ఆగస్టు 25) మహిళలు తప్పనిసరిగా పాటిస్తారు. ఎవరికి వారే ఇంటిలోనే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి అనువుగా వ్రతవిధానాన్ని ఈ సంచికలో అందిస్తున్నాం.... 

ఆడికృత్తిక (ఆగస్టు 9) సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని తమిళులు ప్రత్యేకంగా ఆరాధిస్తారు. తమిళనాడులోని పళని, తిరుచెందూరు వంటి సుబ్రహ్మణ్య ఆలయాలను తెలుగువారు కూడా తరచుగా దర్శించుకుంటారు. తెలుగునాట ఏ శుభకార్యం నిర్వహించినా సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు. అటువంటి సత్యనారాయణుడు కొలువైన అన్నవరంలో స్వామి వెలిసిన తిథి సందర్భంగా 18న జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అన్నదమ్ములతో అనుబంధాలను పంచుకునే రాఖీపూర్ణిమ (ఆగస్టు 30) సందర్భంగా అక్కచెల్లెళ్లందరికీ శుభాకాంక్షలు.

➠ సుబ్రహ్మణ్యుడు ఆరుముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడయ్యాడు. శూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులను సంహరించేందుకు జన్మించాడు. రాక్షస సంహారం, షణ్ముఖుని వివాహాలు తదితర గాథలతో ముడిపడిన ఆరు ప్రసిద్ధ క్షేత్రాలు తమిళనాట ఉన్నాయి. ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా ఈ క్షేత్రాలన్నింటిలో మహోత్సవాలు జరుగుతాయి.

➠ తమిళనాడులోని తిరువారూరు జిల్లా ఇరుల్ నీక్కి అనే కుగ్రామంలో శ్రీజయేంద్ర సరస్వతీ మహాస్వామి 1935 జూలై 18న జన్మించారు. శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారసునిగా 1954 మార్చి 22న సంన్యాసాశ్రమం స్వీకరించారు. ఆదిశంకరాచార్యులు సంచరించిన ప్రదేశాలను గురించి జయేంద్రులు అపూర్వ పరిశోధనలు చేశారు. కంచిపీఠానికి ఎనలేని జనాదరణ తెచ్చిపెట్టారు. 2018 ఫిబ్రవరి 28న సిద్ధి పొందారు.

➠ కేరళీయులకు ఓణం పెద్దపండుగ. వర్షానికి కారణమైన వరుణ, ఇంద్రులను పూజించడం ఓణం పండుగ అంతరార్ధం. వానకాలంలో ప్రకృతి ప్రసాదించే పూవులతో దేవతారూపాలను చేస్తారు. కొత్తధాన్యంతో అపూపాల వంటి మధుర పదార్ధాలు తయారుచేస్తారు. కొబ్బరికోరునూ నైవేద్యమిస్తారు. వానలో తడుస్తూనే మళయాళీలు రకరకాల ఆటలు ఆడతారు. 

➠ గరుత్మంతుణ్ణి వైష్ణవులు గరుడాళ్వార్ అంటారు. గరుడుడు విష్ణు భక్తి పరాయణుడు, మాతృదాస్య విముక్తికి పాటుపడ్డవానిగా పురాణాలు ఆయనను అభివర్ణించాయి. స్వామికి వాహనంగా నిలిచిన గరుత్మంతుణ్ణి ఆయన జన్మతిథినాడు పూజించడం ఆచారం. 

➠ బంధాల మేళవింపే కుటుంబం. కుటుంబ బంధాల్లోసోదరీ సోదరుల ప్రేమానుబంధం గొప్పది. పండువెన్నెల చల్లదనంలా, పదికాలాలపాటు నిలిచేది ఈ బంధమే. ఈ దేశపు ఆడపడుచు అన్నాతమ్ముళ్ళ సంక్షేమాన్ని ఎల్లప్పుడూ కోరుతూ ఉంటుంది. దైవమిచ్చిన జీవశక్తినంతా చల్లని దీవెనగా మార్చి సోదరుని చేతికి రక్షాబంధనం కడుతుంది సోదరి. 

➠ శ్రావణ భాద్రపదాలు వర్ష రుతువు. ఆహ్లాదకరంగా, ఆమోదయోగ్యంగా సాగే తరుణం. వాగులు, వంకలు జలకళతో నిండిపోతాయి. శ్రావణ మాసంలో సోమ, మంగళవారాల్లో శివునితో కూడిన గౌరిని, శుక్రవారాల్లో నారాయణునితో కూడిన లక్ష్మీదేవిని పూజించాలి. మహిళలందరూ నోముల నెలగా భక్తిశ్రద్ధలతో మసలుకునే శ్రావణమాసంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

Recent Comments