లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

ఏడాదిలో శ్రావణం లాంటి సందడిమాసం మరొకటి లేదు. ఒకపక్క ఎటుచూసినా సమృద్ధిగా వర్షాలు పడుతుంటాయి. ఈ మాసమంతా పండుగ వాతావరణమే నెలకొంటుంది. మహిళలు వ్రతాలతో శ్రావణ మాసానికి కొత్త వన్నెలద్దుతారు. ఇంటింటా పేరంటాలతో... ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మా వాయినం అంటూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పసితనం నుంచి అలవాటు చేసే మన సంప్రదాయాలకు పట్టుగొమ్మ శ్రావణమాసమే. ఈ మాసంలోనే సర్వశుభాలనూ ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 16) వస్తుంది. ఆనాడు మహిళలందరూ వరలక్ష్మిని పూజించి, తోటి ముత్తయిదువలకు శనగల వాయినం, పండు పువ్వులతో తాంబూలాలు అందిస్తుంటారు. చిత్తడి చినుకుల మధ్య పసుపు పారాణి పాదాలతో నడయాడే లక్ష్మీస్వరూపాలుగా మహిళామణులు గోచరిస్తారు.

సోదరీ సోదరుల మధ్య అనురాగాన్ని పెంపొందించే రాఖీ పండుగ కూడా ఈ మాసంలోనే (19) వస్తుంది. ఆడపడుచులు తమ అన్నలకు, తమ్ముళ్లకు రక్షలు కడతారు. అన్నివేళలా తమకు తోడుగా నిలబడతామని సోదరుల నుంచి వాగ్దానం అందుకుంటారు. ఇక నీలిమేఘాల రాకతోనే నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు అవతరించిన జన్మాష్టమి కూడా శ్రావణమాసం బహుళపక్షంలోనే (ఆగస్టు 26) వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ. భక్తులతో ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహిస్తారు. పిల్లలందరూ ఆడామగా తేడాలేకుండా బాలకృష్ణులుగా మారిపోతారు. ఉట్టికొట్టే వేడుకలతో... శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు వండి భక్తులకు పంచడంలో భక్తులందరూ సందడిగా గడుపుతుంటారు. ధర్మరక్షణకు అవతరించిన శ్రీకృష్ణదేవుడు మనల్ని దుష్టశక్తుల బారినుంచి కాపాడాలని కోరుకుందాం. చల్లని తల్లి అయిన మహాలక్ష్మి సిరిసంపదలు అనుగ్రహించాలని వేడుకుందాం.

➠ యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత... అని భగవానుడు స్వయంగా గీతలో చెప్పాడు. ఆయన అవతరణం ఎప్పుడు ఎన్నిసార్లు జరిగినా ధర్మరక్షణ కోసమే. అయితే ఈ అవతారాల సంఖ్యలో భిన్నాభిప్రాయాలున్నాయి. పది అవతారాలలో చివరి అవతారమే కల్కి అవతారం.

➠ జన్మాష్టమి వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతాయి. రాసలీలా నృత్యాలతో, ఉట్లోత్సవాలతో, ప్రత్యేక పూజలతో జన్మాష్టమి వేడుకలు ప్రతి క్షేత్రంలోనూ గోకులాన్ని తలపిస్తాయి.

➠ రాఘవేంద్ర యతీంద్రులు కారణజన్ములు. మధ్వ పరంపర మణిహారంలో మేటి మణి. అజ్ఞానాన్ని నశింపజేసి సత్యధర్మాలను మానవులలో పెంపొందించేందుకు కృషి చేశారు. మంత్రాలయ మహాక్షేత్రం దర్శించినవారికి ఆయన ఆప్యాయ స్పర్శతో ఊరట చెందిన భావన కలుగుతుంది.

➠ కర్కాటక సంక్రమణంలో వచ్చే అమావాస్యను తమిళులు ఆది అమావాస్య అంటారు. ఆ అమావాస్య తరువాత వచ్చే మంగళవారంనాడు జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరంలో రామనాథ స్వామి, పర్వత వర్థినీ అమ్మవార్లకు తిరుకల్యాణ మహోత్సవం (ఆగస్టు 9న) నిర్వహిస్తారు. ఈ ఉత్సవం పదిహేడురోజులు కొనసాగుతుంది.

➠ శ్రావణ శుభవేళ లక్ష్మీదర్శనం శుభప్రదం. మనదేశంలో కేవలం లక్ష్మీదేవికి ప్రత్యేకించిన ఆలయాలు తక్కువగానే ఉంటాయి. వాటిలో తిరుచానూరు పద్మావతీ ఆలయం, కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయం వంటి ఆలయాలు పురాణ ప్రసిద్ధి పొందాయి. అవి మాత్రమే కాకుండా మహిమాన్విత లక్ష్మీ ఆలయాలు మరెన్నో ఉన్నాయి.

➠ ప్రతివారికీ లక్ష్మీకటాక్షం కావాలి. ఆమె చల్లని చూపులు మనపై ప్రసరించాలి. ఎవ్వరూ కాదనలేనిది, తమకు అక్కరలేదు అనుకోలేనిది లక్ష్మి. శ్రావణమాసాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైన మాసంగా చెబుతారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎడతెగని ధారగా ప్రసరించాలని కోరుకుంటూ ఈ శ్రావణంలో లక్ష్మిని ఆరాధిస్తారు.

Recent Comments