పండుగలకు నెలవు శ్రావణమాసం. వరలక్ష్మీ వ్రతం, గౌరీపూజలతో మొదలుపెట్టి అనేక పండుగలు శ్రావణ మాసంలోనే అరుదెంచుతాయి. 'సౌభాగ్యలక్ష్మీ రావమ్మా.. మంగళగౌరికి వందనమనరే' అంటూ... స్త్రీలు పేరంటాలు నిర్వహించుకుంటారు. వానలు హెచ్చుగా కురిసే శ్రావణ వాతావరణంలో అనారోగ్యాలు తలెత్తకుండా కాళ్లకు పసుపు రాసుకుంటారు. శనగలు వాయినం ఇస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని (ఆగస్టు 8) మహిళలు తప్పనిసరిగా ఆచరిస్తారు. ఎవరకి వారే ఇంటిలోనే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి అనువుగా వ్రతవిధానాన్ని ఈ సంచికలో అందిస్తున్నాం. అన్నదమ్ములతో అనుబంధాలను పంచుకునే రాఖీపూర్ణిమ (ఆగస్టు 9) సందర్భంగా అక్కచెల్లెళ్లందరికీ శుభాకాంక్షలు. మానవజాతికి గీతాసందేశాన్ని అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆయన జన్మించిన కృష్ణాష్టమి (ఆగస్టు 16) నాడు దేశమంతా కృష్ణనామ స్మరణతో, కోలాటాలతో, ఉట్టికొట్టే ఆటలతో కోలాహలంగా ఉంటుంది. పిల్లలకు గోపీ కృష్ణుల వేషాలు వేసి, వారిలో కృష్ణుడిని చూసుకుని పెద్దలు మురిసిపోతారు. వెన్నముద్దలతో, బాలభోగాలతో వేడుకగా సాగే సంప్రదాయం మనకు స్వామి అనుగ్రహాన్ని నిండుగా అందించాలని ఆకాంక్షిద్దాం. 

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే 

ఆదిదేవుడు వినాయకుడు. ఏ శుభకార్యంలో అయినా మన తొలిపూజలందుకునే వేలుపు ఆయనే. ఏడాదిలో ఎన్ని పండుగలున్నా తొలి పండుగగా వినాయక చవితినే (ఆగస్టు 27) పెద్దలు పేర్కొంటారు. పల్లెల నుంచి పట్టణాల దాకా వినాయక చవితి వేళ ఆధ్యాత్మిక శోభ తోరణాలు కడుతుంది. చవితి పందిళ్లలో ఆబాలగోపాలమూ పత్రి, పూలతో... ఉండ్రాళ్లు, గుంజీళ్లతో... బొజ్జ గణపయ్యను ఆరాధించి పునీతులవుతుంటారు. ప్రకృతి ప్రియుడైన వినాయకుడిని మట్టిగణపతిగానే పూజిద్దాం. భారీ విగ్రహాల కోసం... రంగుహంగుల కోసం పోటీలు పడవద్దు. అందరూ ఇంటిలోనే ఆచరించేందుకు వీలుగా వినాయక పూజావిధానాన్ని ఈ సంచికతో పాటు అందిస్తున్నాం. శుభం భూయాత్!

➠ అన్నాచెల్లెళ్ల అనురాగబంధానికి గుర్తు రక్షాబంధనం. అనాదిగా రాఖీ పండుగను జరుపుకుంటున్నాం. పురాణకాలంలోనూ రాజుల కాలంలోనూ రాఖీ కట్టే సంప్రదాయం ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి.

➠ వైకుంఠ వాసుడి అవతారాలలో కృష్ణావతార విశేషమే వేరు. పుట్టుక నుంచి అవతారం చాలించేదాకా తాను దైవమని నిరూపిస్తూనే తెలుసుకోలేని వారికి మాత్రం సాటి మనిషేనన్న భ్రమను కలిగించిన అవతారమిది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఊరూనాడూ కోలాహలంగా మారుతుంది.

➠ చేతిలో వేణువుతో, శిరస్సున నెమలి ఈకతో, వ్యత్యస్త పాదారవిందుడై... గోవుల్ని కాచే నల్లనయ్యగా తెలుగునాట శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. మన ప్రాంతంలో ప్రాచీన కృష్ణాలయాలన్నీ సాధారణంగా ఇలాగే ఉంటాయి. ఈ ఆలయాలన్నింటికీ వందల ఏళ్ల చరిత్ర ఉంది. కృష్ణాష్టమి వేళ మన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి.

➠ మన తొలిపూజలు అందుకునే దైవం గణపతి. అనాది దైవం ఆయన. గణపతి శక్తివల్లనే ఈ ప్రపంచం నడుస్తోందని పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితిని మనం తొలి పండుగగా భావిస్తాం. గణపతి మనకు సమృద్ధిని, సంతోషాన్ని, తృప్తిని అందిస్తాడు. జ్ఞానానికి, బలానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి కారణమవుతాడు. అటువంటి వినాయకుని ఆరాధించి తరిద్దాం.

➠ కాణిపాకం వినాయక స్వామిని సత్యప్రమాణాల దేవుడు అంటాడు. ఒక బావిలో లభించిన ఈ వినాయకుని విగ్రహం పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. వినాయక చవితికి కాణిపాకంలో గ్రామోత్సవం జరుగుతుంది. మరునాటినుంచి అంగరంగవైభోగంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా వాహన సేవలు, కల్యాణోత్సవం, రథోత్సవం నిర్వహిస్తారు.

➠ ప్రకృతిలో సమస్తాన్ని దేవుని ప్రతి రూపంగానే భావిస్తాం మనం. అందుకే చెట్టునూ పూజిస్తాం, పుట్టనూ మొక్కుతాం. కొండను కొలుస్తాం. కోననూ తలుస్తాం. అందుకే మన హిందూదేశం మిగిలిన దేశాలకు తలమానికమైంది. అలా నిర్వహించుకునే పండుగల్లో ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పోలాల అమావాస్య ఒకటి. ఆనాడు మనవారు కందగౌరీ వ్రతం చేస్తారు.

Recent Comments