NOTE : ఇది కేవలం ఆన్లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
పండుగలకు నెలవు శ్రావణం. ఈ నెలలోనే 'సౌభాగ్యలక్ష్మీ రావమ్మా... మంగళగౌరికి వందనమనరే' అంటూ... స్త్రీలు పేరంటాలు నిర్వహించుకుంటారు. వానలు హెచ్చుగా కురిసే శ్రావణ వాతావరణంలో అనారోగ్యాలు తలెత్తకుండా కాళ్లకు పసుపు రాసుకుంటారు. శనగలు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. శ్రావణంలోనే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 21న తప్పక పాటిస్తారు. వరాల తల్లి అయిన లక్ష్మీదేవి మీ ఇంట అష్టైశ్వర్యాలను కురిపించాలని కోరుకుంటున్నాం. మన ఆడపడుచులు వరలక్ష్మీ వ్రత విధానాన్ని ఎవరికి వారే ఇంటిలో నిర్వహించుకునే విధంగా రూపొందించి, భక్తిపత్రికతోపాటు అందిస్తున్నాం. అందుకోండి.
శ్రావణ మాసం ప్రారంభంలో తెలుగువారి ఆరాధ్యదైవం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావోత్సవాలు ఆగస్టు 14న నిర్వహిస్తారు. అన్నవరంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న సత్యనారాయణస్వామి ఆలయాల్లో ఆనాడు మహావైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. సామూహిక వ్రతాలు చేస్తారు. శ్రీసత్యదేవుడు మనందరికీ కోరిన వరాలు అనుగ్రహించాలని వేడుకుందాం.
అమ్మలగన్న అమ్మగా ప్రజలను కాపాడే ఆదిపరాశక్తికి చేసే జాతర తెలంగాణ బోనాలు. ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాల పర్వాలు భాగ్యనగరాన్ని భక్తిసాగరంలో ఓలలాడిస్తాయి. ఆగస్టు 10న తేదీనాటికి బోనాలు సమాప్తమవుతాయి. డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల కాళ్ల గజ్జెల ఘల్లుఘల్లు శబ్దాల నడుమ తెలంగాణ ఆడపడుచులు సమర్పించే బోనాలు జగతికి ఆరోగ్య సౌభాగ్యాలు అందించాలని కోరుకుందాం. మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ఆగస్టు 30న జరుగుతాయి. ఆ గురురాయల కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలి. అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ములతో అనుబంధాలు పంచుకునే తీయని వేడుక రాఖీ. హిందువులందరూ ఎంతో ఆనందంగా నిర్వహించుకునే రాఖీ వేడుక సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
➠ తెలుగునాట మహిళలు ప్రతి సంవత్సరం తప్పకుండా వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఆ రకంగా వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 'వర' అంటే శ్రేష్ఠమైనది అని అర్థం. వరలక్ష్మి అంటే శ్రేష్ఠమైన వరాలనిచ్చే చల్లని తల్లి. వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన మహిళలు పేరంటాళ్లకు వాయనం ఇస్తూ 'కోరితి వరం' అంటారు. వాయనం అందుకుంటున్న వారు 'ఇస్తిని వరం' అంటారు. ఆ తరువాత పూజ చేసుకున్నవారు 'ఇస్తినమ్మ వాయనం' అంటారు. వాయనాన్ని అందుకుని ముత్తయిదువ 'పుచ్చుకొంటినమ్మ వాయనం' అనాలి. ముత్తయిదువ రూపంలోనే లక్ష్మీదేవి మనపై వరాలను కురిపిస్తుందని నమ్ముతారు.
➠ తరిగొండ వెంగమాంబ తెలుగింటి భారతి. తన పతి వేంకటపతిగా తన కృతి భవనిష్కృతిగా కృష్ణరాగమున శ్రుతిగా వెలిగినది వెంగమాంబ. తిరుమల శ్రీనివాసునికి రాత్రిసమయంలో చిట్టచివరి సేవగా హారతినిస్తారు. దానికి తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అని పేరు. కవయిత్రిగా, యోగినిగా వేంకటేశుని భక్తులలో వెంగమాంబకు విశిష్టస్థానం ఉంది.
➠ రాఘవేంద్రస్వామిని శ్రీ రాయలు అని కూడా అంటారు. బృందావనం నుంచే సజీవుడిగా భక్తుల మొర ఆలకిస్తాడు. మధ్వ సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు జరుగుతుంటాయి. సత్యధర్మరతుడు అన్నది స్వామి కనపరచిన ప్రతి లీలలోనూ దర్శనమిస్తుంది. కలియుగ కల్పవృక్షంగా భక్తులు ఆ స్వామిని నిత్యం అందుకే ఆరాధిస్తుంటారు.
➠ అనుబంధాలను బలోపేతం చేసి, అనురాగాలను వర్ధిల్లచేసే అపురూప పర్వం రక్షాబంధనం. చారిత్రక కాలంలోనూ రాజ్యాలమధ్య శాంతి సమరస భావనలను పెంపొందించింది రాఖీ. సోదరీ సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను కలబోసుకునే పండుగగా రక్షాబంధనం భారతీయ కుటుంబ వ్యవస్థను పదిలంగా కాపాడుతోంది. ఒకప్పుడు ఉత్తరాది సంస్కృతిలో మిళితమైన పండుగ రక్షాబంధన్. ఇప్పుడు రాఖీ వేడుకకు ఎల్లలు లేవు.
➠ సత్యం పలకాలి. ప్రియంగా పలకాలి. కష్టం కలిగించేదైతే సత్యాన్ని మానివేయాలి కానీ, చెప్పకూడదు. అలాగే ఇతరులకు మనపై ఇష్టం పుట్టించేందుకు అసత్యాన్ని ఎప్పుడూ చెప్పకూడదు. సత్యంలోనే దైవం ఉంటాడని చెబుతోంది మన సనాతన ధర్మం. అటువంటి సత్యమే మూర్తిరూపాన్ని ధరించి అన్నవరంలో కొలువై ఉన్నాడు.
➠ ఆయన చీటీ రాస్తే దాని ప్రకారం పని అవ్వాల్సిందే. ఆయన నోటినుంచి ఒక మాట వస్తే యథాప్రకారం జరిగి తీరవలసిందే. సమాధి చెందినా భక్తుల కోరికలు తీరుస్తూనే ఉంటానన్న మాట నిలబెట్టుకొన్న ఆయనే... అతి సాధారణ జీవితం గడిపిన చీటీల స్వామి లేదా గొలగమూడి వెంకయ్య స్వామి.