దీపంలో దైవాన్ని చూడడం మన సంస్కృతి. అందుకోసమే కార్తిక దీపారాధన సంప్రదాయం ఏర్పడింది. కార్తికమాసంలో ఇరుసంధ్యలలోనూ ప్రతి ఇల్లూ దీపతోరణమై వెలుగుతుంది. గడపల వద్ద, తులసికోటల వద్ద దీపారాధనలు చేయడం, దీపదానాలు చేయడం కార్తికంలో కర్తవ్యాలుగా ఆస్తికులు భావిస్తుంటారు. ఆలయాలన్నీ దీపారాధన చేసే భక్తులతోనూ, పురాణ ప్రవచనాలతోనూ కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. కార్తికంలో కనిపించే ఈ ఆధ్యాత్మిక వైభవమంతా భక్తి టీవీ కోటిదీపోత్సవంలో ఒక్కచోటే దర్శనమిస్తుంది. దీపవైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసి... మన సనాతన సంప్రదాయాన్ని సమున్నతంగా నిలబెట్టడమే ధ్యేయంగా 2012 నుంచి దీపోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఇన్నేళ్లుగా ఎన్ని ఆటంకాలొచ్చినా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడ్డాం. నిరంతరాయంగా కోటిదీపోత్సవాలను నిర్వహిస్తూనే ఉన్నాం. భక్తిటీవీ నిర్వహిస్తున్న ఈ దివ్యదీపయజ్ఞం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశవిదేశాలనుంచి ఎందరెందరో ప్రముఖులు ఈ వేదికకు విచ్చేశారు.
భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ ఈ సంవత్సరంలో కోటిదీపోత్సవంలో పాల్గొనడంతో కార్యక్రమానికి కొత్త గౌరవాన్ని సంపాదించి పెట్టింది. రాబోయే సంవత్సరాల్లో భక్తిటీవీ ఈ ఉత్సవాన్ని ఇంతే నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహించే ఉత్సాహాన్ని కలిగించింది. దీపసంప్రదాయం సర్వత్ర వ్యాపించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. మీ ప్రోత్సాహం సదా మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. కార్తికం ముగిసి, మార్గశిర మాసం ప్రవేశిస్తోంది. ముక్కోటి ఏకాదశి (డిసెంబర్ 23) సందర్భంగా వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనభాగ్యం కలుగుతుంది. అదేరోజున గీతాజయంతి సందర్భంగా గీతా పారాయణ యజ్ఞాలు జరుగుతాయి. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. మాసాలలో 'మార్గశీర్షాన్ని నేనే' ప్రకటించుకున్న శ్రీకృష్ణదేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
➠ విష్ణుభక్తులకు ధనుర్మాసం పవిత్రమైనది. ఆండాళ్ పాశురాలతో దేవదేవుణ్ణి మేలుకొల్పుతారు. ఈ నెల్లాళ్లూ తెల్లవారకముందే ఇళ్ల ముంగిళ్లలో అందమైన ముగ్గులు దర్శనమిస్తాయి. సూర్యోదయానికి పూర్వమే వైష్ణవులు పూజపూర్తి చేసి బాలభోగాన్ని సమర్పిస్తారు. నియమాలతో కూడిన వివిధ నైవేద్యాలు స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ధనుర్మాస వ్రతనిష్ఠతో విష్ణులోకప్రాప్తి కలుగుతుంది.
➠ తెలుగు ప్రజలకు కార్తికం అనగానే భక్తిటివి కోటి దీపోత్సవం స్ఫురణకు వస్తుంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసే కోటి దీపోత్సవ ప్రాంగణం... ఉత్సవం జరిగినన్ని రోజులూ సంధ్యవేళ ఓ కాంతివనంలా గోచరిస్తుంది. నవంబర్ 14 నుంచి 27వరకు నిర్వహించిన ఈ ఏడాది కోటిదీపోత్సవంలో వేలాదిమంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కోటిదీపాలలో తమవంతు దీపాలను వారే స్వయంగా వెలిగించి, దర్శించి, నమస్కరించి తన్మయులయ్యారు. టీవీ మాధ్యమంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షించి, ఆనందించి, ఆశీర్వదించారు.
➠ మోపిదేవి అతి ప్రాచీనమైన నాగక్షేత్రం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణా నదీతీర క్షేత్రాలను వివరించే సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని మూడురోజుల పాటు మోపిదేవిలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. పంచమినాడు స్వామిని పెళ్లికొడుకుగా అలంకరిస్తారు. షష్ఠినాడు దివ్యకల్యాణోత్సవం జరుగుతుంది.
➠ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఆనాడు విష్ణుఆలయాలన్నీ కిటకిటలాడతాయి. తెల్లవారుజామునుంచే ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని, ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వ వైశిష్ఠ్యం.
➠ అయ్యప్ప స్వామి శబరిమల క్షేత్రంలో కొలువుదీరి నమ్మిన భక్తుల పాలిట కల్పతరువై విరాజిల్లుతున్నాడు. శబరిమల అత్యంత పవిత్రమైన, పుణ్యప్రదమైన క్షేత్రం. అయ్యప్ప ఆలయానికి ముందున్న పద్దెనిమిది మెట్లను అధిరోహించే అర్హత సాధించడం కోసం భక్తులు నలభై ఒక్కరోజుల పాటు అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. దీనినే మండలదీక్ష అని పిలుస్తారు.
➠ భక్తిటీవీ కోటిదీపోత్సవ ప్రతిష్ట ఇనుమడించింది. భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ తొలిసారిగా కోటిదీపోత్సవంలో పాల్గొన్నారు. వేదికపై కొలువుతీరిన భద్రాద్రి కల్యాణమూర్తులను సేవించారు. భక్తులతో కలిసి గోవిందనామాలు చెబుతూ ఆనందించారు. ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. కార్తిక దీప వైభవాన్ని ఉదాత్తమైన శైలిలో విశ్లేషిస్తూ.... సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మగా, ఘనమైన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే సదుద్దేశ్యంతో చేపట్టిన కోటిదీపోత్సవాన్ని ప్రశంసించారు. రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ అధినేత శ్రీతుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులతో కలిసి తొలి కార్తిక దీపాన్ని వెలిగించారు.