భక్తిటీవీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. వరుసగా 13వ ఏడాది నిర్వహించిన కోటిదీపోత్సవంలో భారత రాష్ట్రపతి గౌరవనీయ ద్రౌపది ముర్ము స్వయంగా పాల్గొన్నారు. కోటిదీపోత్సవ భక్తులను ఉద్దేశించి, కీలక ప్రసంగం చేశారు. సనాతన ధర్మపరిరక్షణలో భక్తిటీవీ చేస్తున్న ప్రయత్నాలు చరిత్రలో నిలిచిపోతాయని, మునుముందు మరెన్నో విజయాలను భక్తిటీవీ చవిచూడాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా రాజకీయ రంగ ప్రముఖులు కూడా ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంవత్సరం కోటిదీపోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి శ్రీరాజ్ నాథ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటివారు పాల్గొనడం భక్తిటీవీ స్థాయిని సమున్నతంగా నిలబెట్టింది.
ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది కోటిదీపోత్సవానికి జనబాహుళ్యం వెల్లువలా తరలి వచ్చింది. వారణాసి, చిదంబరం, ఉజ్జయిని వంటి సుప్రసిద్ధ క్షేత్రాలనుంచి దేవీదేవతలు విచ్చేశారు. ప్రతినిత్యం దేవతాకల్యాణాలతో, పల్లకీ సేవలతో... కోటిదీపోత్సవ ప్రాంగణమే మహాక్షేత్రమై విరాజిల్లింది. అవధూత దత్తపీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీతో పాటుగా... అనేకమంది స్వామీజీలు ప్రతిరోజూ కోటిదీపోత్సవానికి విచ్చేసి అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులను అందించారు. ప్రతిరోజూ ప్రవచన కర్తలు తమ ప్రవచనామృతాన్ని అందించారు. వారి దీపోత్సవ సందేశాలు జనజాగృతికి ప్రోద్భలం చేసేవిధంగా ఉండడం ఆనందాన్నిచ్చింది. కోటిదీపోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానీరాజనం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మైమరిపింప చేశాయి. వారి ఆనందం చూస్తుంటే మేము పడ్డ శ్రమనంతా మరిచిపోగలిగాం. మళ్లీ నూతనోత్సాహంతో వచ్చే ఏడాది ఉత్సవానికి సన్నద్ధులం కావడానికి మీరిచ్చే ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. భక్తిటీవీ కోటిదీపోత్సవ ప్రత్యేక సంచిక మీచేతిలో ఉంది. చదివి ఆనందించండి.... ఆశీర్వదించండి.
➠ అందరూ ఒక్కచోట కూడి, ఒకేసారి దీపాలను వెలిగించడం వల్ల ఏకత, సమైక్యతా భావనలు కూడా ప్రకాశిస్తాయి. ఈసారి కోటిదీపోత్సవం 17 రోజులపాటు కొనసాగబోతోందని నాకు తెలియచేశారు. సత్యం, ధర్మాన్ని అనుసరించాలనే సంకల్పం. పౌరులందరికీ శుభాలు కలగాలని చెబుతూ సంకల్పదీపం వెలగిద్దాం. - భారత రాష్ట్రపతి మాననీయ ద్రౌపది ముర్ము
➠ దేశ రాజకీయాల్లో రాజ్ నాథ్ సింగ్ అజాత శత్రువుగా పేరుగాంచారు. ప్రస్తుతం భారత రక్షణశాఖ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ తొలిసారి భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేశారు. 2024 భక్తిటీవీ కోటిదీపోత్సవంలో 10వ రోజైన నవంబర్ 18నాడు కోటిదీపోత్సవ వేదిక నుంచి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు.
➠ 2024 కోటిదీపోత్సవం కార్యక్రమాల్లో 8వ రోజున తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి, సతీమణి గీతారెడ్డితో కలిసి పాలుపంచుకున్నారు. కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించి పులకాంకితులయ్యారు. తెలంగాణ రాష్ట్రప్రజలను ఉద్దేశించి, కోటిదీపోత్సవ వేదికనుంచి తమ సందేశాన్ని వినిపించారు.
➠ సనాతన ధర్మపరులకు కార్తికం అతిపవిత్రం. శివుడికి, విష్ణువుకు అత్యంత ప్రియమైన కార్తికంలో దీపారాధన అత్యంత ప్రభావవంతం అని పెద్దలు చెబుతారు. ఈ కార్యక్రమాన్ని భక్తిటీవీ వారు ఎంతో భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. కోటిదీపోత్సవంలో పెద్దసంఖ్యలో భాగస్వాములవుతున్న మీ అందరికీ అభినందనలు. - జి. కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
➠ కోటిదీపోత్సవం భగవంతుని అనుగ్రహమే. కార్తికం మనకు పవిత్రకార్యం. పూర్వం ఈ మాసంలోనే అశ్వమేధం వంటి యజ్ఞాలు చేసేవారని చెబుతారు. నేడు భక్తిటీవీ వారు కోటిదీపోత్సవం అనే పేరుతో బృహత్ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కోటిదీపోత్సవం రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాగే నిరాఘాటకంగా కొనసాగాలి. - జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ గవర్నర్
➠ కోటిదీపోత్సవం పాల్గొనడం గొప్ప సదవకాశం. పరమాత్మ కల్యాణ గుణసంపన్నుడు. ఆయనను ఆరాధించడం ద్వారా మనలో ద్వేషం, క్రోధం వంటి వాటిని పోగొట్టుకోవచ్చు. ఇటువంటి ఉత్సవాలు మనకు మన గురించి కూడా ఆలోచించుకోవడానికి అవకాశమిస్తాయి. ఈ ఉత్సవాలను గమనించి మనలో భక్తిశ్రద్ధలను పెంపొందించుకోవాలి. - అలోక్ కుమార్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు