సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. నేలకు కావలసినవన్నీ సూర్యమండలం నుంచే కిరణ రూపంగా అందుతున్నాయి. సూర్యరశ్మి లేకపోతే జీవజాతులకు మనుగడ లేదు. అందుకే సూర్యుడే శివుడు, నారాయణుడని పురాణాలు పేర్కొంటాయి. జగత్తును చూసే పరమాత్మ కుడికన్ను సూర్యుడంటారు. అటువంటి సూర్యరథ ప్రయాణం రథసప్తమి నాడే (ఫిబ్రవరి 19) ప్రారంభమైందని సంప్రదాయ శాస్త్రవేత్తల భావన. రథసప్తమినాడు సూర్యుణ్ణి ఆరాధిస్తారు. కేవలం ఒకేఒక్క నమస్కారంతో ప్రీతిచెంది సూర్యదేవుడు మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తాడు. ఇక రథసప్తమికి ముందు వసంతపంచమి (ఫిబ్రవరి 16) పర్వదినం వస్తుంది. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా మన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. పలక, బలపం పట్టించి ‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’ అని మునుముందుగా పెద్దలు వారిచేత దిద్దిస్తారు. మన జ్ఞానానికి, మాటపొందికకు, నడవడికకు మూలాధారమైన సరస్వతీ ఆరాధన ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలి. మాఘమాసం పెళ్లిళ్లకు ప్రసిద్ధి పొందింది. కానీ ఈ ఏడాది మౌఢ్యమి రావడంతో ముహూర్తాలకు కొరత ఏర్పడిందని పంచాంగకర్తలు పేర్కొన్నారు. మానవుల కల్యాణాలకు మౌఢ్యమి అడ్డంకి ఉంటుంది కానీ, దేవతలకు కాదు. మాఘస్నానాల వేళ (ఫిబ్రవరి 12- మార్చి 13 మాఘమాసం) కరోనా జాగ్రత్తలు పాటిద్దాం. మహమ్మారిపై పూర్తివిజయాన్ని సాధించేవరకూ ఏ ఒక్కరం నిర్లక్ష్యం వహించవద్దు. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుని సాక్షిగా మనమందరం అప్రమత్తంగా ఉందాం.

➠ ఆదివాసీలు ప్రకృతిలో దేవుని చూస్తారు. వారి భక్తిప్రపత్తుల్లో కూడా ఏ మాత్రం హెచ్చుతగ్గులుండవు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలైన గోండులు జరుపుకునే కేస్లాపూర్ నాగోబా జాతర ఆ కోవకు చెందినది. కళాప్రదర్శనలతో, సంప్రదాయ ఉత్సవాలతో నాగోబా జాతర చూపరులకు కన్నుల పండుగగా ఉంటుంది. 

➠ ప్రాచీన భారతీయ తాత్త్విక చింతనను తోసిరాజని ఒక వినూత్న మానవీయ తత్త్వాన్ని జిడ్డు కృష్ణమూర్తి ఆవిష్కరించాడు. స్వేచ్ఛాచింతనను గౌరవించాడు. ఎప్పుడైతే నీవు ఏదీ కావో అప్పుడే సర్వం నీవౌతావని ప్రబోధించాడు. 

➠ కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలును పెదకంచి అంటారు. ఇక్కడ మున్నేరు నది ప్రవహిస్తోంది. లక్ష్మీతిరుపతమ్మ పేరంటాలు ఇక్కడ పూజలందుకుంటోంది. కృష్ణాజిల్లా వాసులకు తిరుపతమ్మ ఆరాధ్యదైవం. మాఘ పౌర్ణమినాడు నిర్వహించే తిరుపతమ్మ కల్యాణోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతారు.

➠ తిరువనంత పురంలోని అనంతపద్మనాభ స్వామిని తెలియని వారుండరు. ఆ స్వామివారి సోదరి పేరు అట్టుకల్ భగవతీ దేవి. ఆమె పేరుతో నిర్వహించే అట్టుకల్ పొంగలా ఉత్సవం ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. ప్రతి ఏడాది కుంభమాసంలో అట్టుకల్ భగవతీ అమ్మవారికి పాయసం నివేదించే ఉత్సవంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొంటారు.

➠ ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన మహాగురువు మధ్వాచార్యులు. ఉడుపిలోని శ్రీకృష్ణాలయాన్ని నిర్మించారు. దానికి అనుబంధంగా ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. మధ్వాచార్యులు అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూ, పుష్పవృష్టిలో అంతర్ధానమయ్యారు. ఆ రోజే మధ్వ నవమి.

➠ తిరుమలకు తొలిగడప దేవుని కడప. జిల్లాకేంద్రమైన కడప నగరాన్ని కృపావతీ క్షేత్రంగా పురాణాలు అభివర్ణించాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే దేవుని కడప బ్రహ్మోత్సవ, రథోత్సవ విశేషాలు.

Recent Comments