మా మా ధునోతి మనసోఅపి న గోచరం యత్
భూమాసఖేన పురుషేణ సహానుభూయ
ప్రేమానువిద్ధ హృదయ ప్రియభక్తలభ్యే
రామానుజాంఘ్రికమలే రమతాం మనో మే

వాక్కులు, మనస్సు తెలుసుకోలేని దైవస్వరూపాన్ని ప్రేమచేత తెలుసుకోమని చాటిచెప్పిన శ్రీరామానుజుల పాదకమలాలపై నా మనస్సు నిరంతరం సంచరించు గాక! శ్రీత్రిదండి చినజీయర్ స్వామి దివ్యసంకల్పం నెరవేరింది. 216 అడుగుల ఎత్తున వేయి వసంతాల భగవత్ రామానుజుల మహామూర్తి జీయర్ ఆశ్రమ ప్రాంగణమైన దివ్యసాకేతంలో నెలకొననుంది. ఇది మనందరి అదృష్టం. రామానుజ సమతా స్ఫూర్తి కేంద్రానికి ఈ మాఘమాసంలోనే సమారోహ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా రామానుజుల సమతా సందేశానికి నిలయాలై, దేశం నలుమూలలా ఉండే 108 వైష్ణవ దివ్యదేశాలు సమతామూర్తి చుట్టూ అదేరూపంతో నెలకొన్నాయి. ఆ మూర్తులన్నింటికీ కుంభాభిషేకం నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 5న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రామానుజులు 120 సంవత్సరాలు జీవించినందుకు సంకేతంగా 120 కిలోగ్రాముల బంగారు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి 14వరకూ అనేక కార్యక్రమాలను ప్రాంగణంలో నిర్వహిస్తారు. భక్తిటీవీ ప్రారంభించిన దగ్గరనుంచి మాపై ఎంతో ఆదరాన్ని చూపించే శ్రీచినజీయర్ స్వామి ఈ కార్యక్రమంలో మాకూ భాగం పంచడం ఆనందాన్నిస్తోంది. వారు మాపై ఉంచిన ఈ బాధ్యత ఆచార్యస్వాముల అనుగ్రహంగా భావిస్తున్నాం.  

మన పవిత్ర మాసాల్లో మాఘమాసం (ఫిబ్రవరి 2- మార్చి2) ప్రధానమైనది. సరస్వతీదేవి ఆరాధన చేసే వసంత పంచమి (5వ తేదీ), సూర్యదేవుని ఆరాధనకు ప్రధానమైన రథసప్తమి (8వ తేదీ), ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి భీష్మాచార్యుడు ఇచ్ఛామరణాన్ని పొందిన భీష్మ ఏకాదశి (12వ తేదీ), మహాశివరాత్రి (మార్చి 1) వంటి పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. అనేక ఆలయాల్లో కల్యాణోత్సవాలు, జాతరలు కూడా ఈ మాసంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి.

➠ శైవక్షేత్రాల్లో శ్రీశైలం తలమానికం. ఆది మధ్యాంత రహితుడైన పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా ఇక్కడ మల్లికార్జున మహాలింగ చక్రవర్తి కొలువై ఉన్నాడు. పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండోది ఈ క్షేత్రమే. శ్రీభ్రమరాంబాదేవికి నెలవైన శక్తిపీఠం కూడా ఇదే. కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. సకల వేదాలకూ మూలాధారం. అటు జ్యోతిర్లింగం, ఇటు శక్తి పీఠం ఒకే గిరిశృంగం మీద వెలసిన తావు ఇది. సకల లోకారాధ్యంగా, త్రైలోక్య పూజితంగా భాసిల్లుతోంది.

➠ ఆదివాసీలు ప్రకృతిలో దేవుని చూస్తారు. నిర్దిష్టమైన సమయాల్లో ఒకచోట కూడి ఆరాధనలు చేస్తారు. ఆదివాసీలు చేసే జాతరల్లో అనాదిగా సంప్రదాయాల్లో ఎటువంటి మార్పులూ ఉండవు. వారి భక్తిప్రపత్తుల్లో కూడా ఏ మాత్రం హెచ్చుతగ్గులుండవు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలైన గోండులు జరుపుకునే కేస్లాపూర్ నాగోబా జాతర ఆ కోవకు చెందినది. కళాప్రదర్శనలతో, సంప్రదాయ ఉత్సవాలతో నాగోబా జాతర చూపరులకు కన్నుల పండుగగా ఉంటుంది.

➠ భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటి ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాస్తం చేసిన ధర్మమూర్తి, పూర్ణప్రజ్ఞులు శ్రీమధ్వాచార్యులు. ఆయన ఉడుపిలోని అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుకు భాష్యం చెబుతూ, దేవతలు కురిపించిన పుష్పవృష్టిలో అంతర్ధానమై బదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వ నవమి.

➠ అక్షరాల అధిదేవత, సకల విద్యల రాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతి దేవి జన్మదినమే వసంత పంచమి. మాఘ శుద్ధ పంచమినాడు నిర్వహించుకునే ఈ పర్వదినాన్ని వసంతపంచమి, సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా వ్యవహరిస్తారు. మానవ జాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి. జ్ఞానానంద పరాశక్తిగా, వేదజ్ఞాన మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, విద్యావాహికగా, లౌకిక అలౌకిక విద్యాప్రదాతగా పూజలందుకుంటోంది.

➠ మాఘ శుద్ధ  పౌర్ణమికి రెండేళ్లకోసారి మేడారంలో మహాజాతర నిర్వహిస్తారు. తదుపరి సంవత్సరం చిన్నజాతర జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన సంప్రదాయంలో ఉంటుంది. సమ్మక్క సారలమ్మలను ఒకే గద్దెపైకి తీసుకువచ్చి బంగారం అనేపేరుతో బెల్లంతో తులాభారాలు తూగి సమర్పిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి భక్తులు అన్ని నియమాలూ పాటిస్తూ జాతరలో పాల్గొనాల్సి ఉంటుంది.

➠ భీష్మ ఏకాదశి విశిష్ట పర్వం. రాజ్యాధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న భీష్ముడు ఇచ్ఛా మరణాన్ని వరంగా పొందాడు. వాత్సల్యం, భగవత్ భక్తి మూర్తీభవించిన కరుణామృత సింధువు భీష్ముడు. జగతికి విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని అందించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. అష్టవసువుల్లో ఒకనిగా భీష్ముడు సదాపూజనీయుడు. 

Recent Comments