చలిని పూర్తిగా వదిలించి... చిరుఎండలు కాసే తరుణం మాఘమాసం. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 27 వరకు మాఘమాసం. ఇది ప్రధానంగా కల్యాణాల మాసం. శివుడు, విష్ణువు, శక్తి అనే భేదం లేకుండా అనేక దేవాలయాల్లో జాతరలు, కల్యాణాలు, ఇంకా అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది మన సంస్కృతిలోని ఏకత్వ భావనకు అద్దం పడుతోంది. ఈ మాఘమాసంలోనే సరస్వతీ ఆరాధన, సూర్యారాధన కూడా విశేషంగా జరుగుతాయి. చదువుల తల్లి సరస్వతీదేవిని ఫిబ్రవరి 2న వసంతపంచమి పేరిట పూజిస్తారు. అనాడు సరస్వతీ ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తుంటారు. ఇక ఫిబ్రవరి 4న రథసప్తమి. సర్వసాక్షి అయిన సూర్య భగవానుడి శికరంగా జిల్లేడు ఆకులు, రేగుపళ్లు శిరస్సుపైన, భుజాలపైన ఉంచుకుని స్నానం చేయమని పెద్దలు చెబుతుంటారు. ఉదయాన్నే చిక్కుడు ఆకుల్లో సూర్యునికి పాయసం నివేదించే పర్వమిదే. రథసప్తమి సందర్భంగా ఏడుకొండలపై శ్రీవారికి రథోత్సవం జరుగుతుంది. ఇంకా అనేక ఆలయాల్లో రథోత్సవాలు నిర్వహిస్తారు.
శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి
...ఈ శ్లోకం శివుడిని సాకారంగా వర్ణిస్తోంది. ఆయన లక్షణాలు అన్నింటిలోనూ శాంతస్థితినే గొప్పదిగా పేర్కొన్నారు. శాంతానికి ప్రతీకగానే ఆయన అనేక ఆయుధాలను ధరించి ఉంటాడు. స్పటికంలా మెరిసిపోతాడు. అటువంటి శివుడిని ఆరాధించుకునే మహాశివరాత్రి మహాపర్వదినం ఫిబ్రవరి 26న వస్తోంది. ఆనాడు దేశంలోని శివక్షేత్రాలన్నీ శివనామంతో మార్మోగుతుంటాయి. అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాలలో శ్రీ శైలం, శ్రీ కాళహస్తి వంటిచోట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జన్మకో శివరాత్రి అని సామెత. బోళాశంకరుడు శివరాత్రి ఉపవాస, జాగరాలతో ప్రసన్నుడవుతాడని విశ్వాసం. చెంబెడు నీళ్లతో అభిషేకం చేస్తే... మురిసిపోయి వరాలు కురిపిస్తాడని పెద్దలు చెబుతారు.
➠ కార్తికం, మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో సముద్రస్నానం, నదీస్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తికంలో దీపవ్రతాలు చేసినట్లే, మాఘంలో స్నానవ్రతం చేయడం పురాణ ప్రసిద్ధంగా కనిపిస్తోంది. మాఘపౌర్ణమిని మనవారు మహామాఘి (ఫిబ్రవరి 12) అంటారు.
➠ మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఇచ్ఛామరణ శక్తిని వరంగా పొందిన భీష్మాచార్యుడు... ఉత్తరాయణ పుణ్యకాలంలోని మాఘమాసం వరకు 56 రోజులపాటు మరణాన్ని వాయిదా వేశాడు. ఆ సమయంలో భీష్ముడు చేసిన బోధల్లో ఒకటైన విష్ణుసహస్రనామ స్తోత్రం మనకు నిత్య పారాయణ గ్రంథం.
➠ వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని ఆరాధించాలి. విద్యతో పాటు సర్వశక్తులనూ అందించగలిగిన మహాస్వరూపంగా సరస్వతిని భావించి పూజించాలి. సరస్వతీదేవిని ఆరాధిస్తే జ్ఞానవిజ్ఞానాలు పెరుగుతాయి. వేదవ్యాసుడు, కాళిదాసు వంటి కవులే కాదు.. సాక్షాత్తూ దేవతలే సరస్వతిని ఆరాధించారని మన పురాణాలు చెబుతున్నాయి.
➠ సూర్యుని ఆరాధించడం మనకు అనాదినుంచి వస్తోంది. జీవులకు పోషణకర్త సూర్యుడే... కనుక ఆయనే విష్ణువు. అలాగే శివుని అష్టతనువులలో మొదటిది సూర్యరూపమే. ఆయనకు చెందిన పన్నెండు నామాలను స్మరించి... నమస్కరిస్తే చాలు ఆరోగ్యం, ఐశ్వర్యం వంటివన్నీ సూర్యుడే ప్రసాదించగలడు.
➠ కుంభమేళా అంటే అమృతకలశోత్సవాలు అని అర్థం చెప్పుకోవచ్చు. తెలుగువారికి పుష్కరాల లాంటివే ఉత్తర భారతీయులకు కుంభమేళా ఉత్సవాలు. పుష్కరాలు కేవలం బృహస్పతిని ఆధారం చేసుకుని నిర్ణయిస్తారు. భారతదేశంలో జరిగే అన్ని ఉత్సవాలలోనూ అతిపెద్దది. ప్రస్తుతం మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) వరకు మహాకుంభమేళా జరుగుతోంది.
➠ మహాశివరాత్రికి అభిషేకం చేసే సమయంలో... ముందుగా శివసంకల్పం చదువుతారు. కుడిచేతిని గుండెపై ఉంచుకుని వరుసగా 37 మంత్రాలను పఠిస్తారు. ‘శివసంకల్పమే నా మనస్సుగా రూపుదిద్దుకో! అని అర్థం వచ్చేలా 'తన్మే మనః శివసంకల్పమస్తు' అనే మకుటంతో ఈ మంత్రాలను చెబుతారు. వీటినే 'శివసంకల్పోపనిషత్తుగా పేర్కొంటారు.