సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభతరుణం మనకు సంక్రాంతి (జనవరి 14) పండుగ. అప్పటినుంచే దేవతలకు పగటికాలం ప్రారంభమవుతుందని చెబుతారు. దైవానుగ్రహం పుష్కలంగా ఉండే ఈ సమయంలో చేసే పుణ్యకార్యాలన్నీ మనల్ని కాపాడుతాయంటారు. మనల్ని విపత్తుల నుంచి, కరోనా మహమ్మారి నుంచి కాపాడమని దైవాన్ని ప్రార్థిద్దాం. ఈ గడ్డుకాలాన్ని దాటేందుకు దైవీశక్తి తోడు కోరుకుందాం. రాబోయే నెలల్లో మహమ్మారి మరోసారి విజృంభించవచ్చని వస్తున్న వార్తల నేపథ్యంలో భారం దైవం మీద, బాధ్యత మనమీద ఉందని సదా గుర్తుంచుకుందాం. ఏరువాక నుంచి సంక్రాంతి దాకా ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించిన రైతులోగిళ్లు నేడు ధాన్యలక్ష్మితో కళకళలాడతున్నాయి. ఉన్నంతలో సంక్రాంతిని వేడుకగా జరుపుకోకపోతే తెలుగువారికి తనివి తీరదు. కొత్తగడ్డి మంటలతో చలికాగడం సంక్రాంతి కలిగించే వెచ్చని అనుభూతి. ముంగిట ముగ్గులతో, గొబ్బెమ్మలతోనూ హరిదాసులు, గంగిరెద్దుల సందళ్లతోనూ సంక్రాంతి కళ ఏడాదికి సరిపడేంత ఉత్సాహం నింపుతుంది. కోడిపందాలు, ఎడ్లపందాలు, విందు వినోదాలకు ఇది అనువైన తరుణం. అందరి రుచులు, అభిరుచుల్ని నెరవేర్చే పండుగ సంక్రాంతి. పండుగవేళ సరదాల్ని చంపుకోనక్కరలేదు కానీ, మహమ్మారి నేపథ్యంలో వైద్యులు చెప్పే జాగ్రత్తలు తుచ తప్పకుండా పాటిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా ప్రసిద్ధులైన పంచాంగకర్తలు తమ భవిష్యవాణి వినిపించారు. ఆంగ్లనూతన సంవత్సరాది, సంక్రాంతి శుభాకాంక్షలతో....

➠ నక్షత్రాకారంలో ఉండే శ్రీపురం స్వర్ణాలయాన్ని చూడడానికి రెండు కన్నులూ చాలవు. ఈ ఆలయాన్ని నారాయణీ అమ్మ నిర్మించారు. ఆయన కృషి వల్లే పూర్వం తిరుమలైకొడి అనే చిన్న గ్రామం ఇప్పుడు శ్రీపురంగా, స్వర్ణానికి జన్మస్థానమేమో అన్నట్టుగా దర్శనమిస్తోంది. ఆలయాన్ని నిర్మించిన సతీష్ కుమార్ ని నారాయణీ అమ్మగా పిలుస్తారు. శ్రీపురం కేంద్రంగా నారాయణీ అమ్మ అన్నదానం, విద్యాదానం వంటి విశిష్టమైన సేవలందిస్తున్నారు.

➠ కుంభమేళా ఉత్సవం భారతీయ ఆధ్యాత్మిక, శాంతియుత, సహజీవన సౌందర్యానికి ప్రతీక. జలసంపద పట్ల భారతీయుల అనురాగానికి చిహ్నం. ప్రపంచంలోనే గొప్ప ఉత్సవం. ఈనెల 14వ తేదీన ప్రారంభమవుతున్న హరిద్వార్ పూర్ణకుంభమేళా ఉత్సవాలు మే
26వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో కుంభమేళా సంప్రదాయాలు.

➠ సంక్రాంతి వేడుకల్లో కోనసీమ ప్రత్యేకం ప్రభలతీర్థం. కనుమ పండుగ రోజున జగ్గన్న తోట ప్రభల తీర్థం కోలాహలంగా జరుగుతుంది. ఏకాదశ రుద్రుల సమావేశ ప్రతీకగా నిర్వహించే ప్రభల తీర్థం ఏర్పాట్లలోనూ, భక్తులకు ప్రవేశ అనుమతిలోనూ ఈసారి కోవిడ్
నేపథ్యంలో ఆంక్షలుంటాయి.

➠ తెలంగాణాలో జరిగే జాతరలలో ప్రముఖమైన కొమరెల్లి మల్లన్న జాతర కూడా ఇలా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెబుతుంది.సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నాడు మల్లన్న జాతర మొదలవుతుంది.

➠ అయ్యప్ప స్వామి దీక్షలో అత్యంత ముఖ్యమైనది సంక్రాంతినాడు కనిపించే మకరజ్యోతి దర్శనం. ఆనాడు శబరిమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. కోవిడ్ నేపథ్యంలో ఈసారి జ్యోతిదర్శనానికి భక్తుల ప్రవేశంపై ఆంక్షలున్నాయి. తెలుగు భక్తులు స్థానిక ఆలయాల్లోనే దీక్షా విరమణలు చేయబోతున్నారు. 

➠ మకర సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. ధాన్యసిరులు ఇంటికి వచ్చే సంక్రాంతి పండుగను మనవారు ఉత్సాహంగా జరుపుకుంటారు. మకర సంక్రమణం ఖగోళరీత్యా కూడా విశిష్టమైనది. భోగి, కనుమ మధ్యలో సంక్రాంతితో కలిపి ఈ పండుగ మూడురోజుల్లో పాటించాల్సిన సంప్రదాయ విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. 

Recent Comments