కొత్త ఏడాది ప్రవేశించబోతోంది. ఈసారి సంక్రాంతితో పాటే ముక్కోటి ఏకాదశి (జనవరి 13) కూడా వస్తోంది. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం మహోత్సాహంగా జరుగుతుంది. ఆ మరునాటి నుంచే వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలు పలకరిస్తాయి. తెలుగువారికి సంక్రాంతి పెద్దపండుగ. ఏరువాక నుంచి సంక్రాంతి దాకా ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించిన రైతుల లోగిళ్లు ధాన్యలక్ష్మితో కళకళలాడుతాయి. ముంగిట ముగ్గులతో, గొబ్బెమ్మలతో, హరిదాసులు, గంగిరెద్దుల సందళ్లతో సంక్రాంతి కళ పల్లెకు వెలుగు తెస్తుంది. సంక్రాంతి పండుగతో (జనవరి 15) ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే గతించిన పెద్దల్ని పేరుపేరునా స్మరించుకుని తర్పణలు విడుస్తారు. వారిపేరిట దానధర్మాలు చేస్తారు. ఏడాది పొడవునా తమతో శ్రమ పంచుకున్న పశుసంతతిని రైతులు కృతజ్ఞతాపూర్వకంగా అలంకరించి మంచి దాణాలను అందించి సేద తీరుస్తారు. పిల్లకు భోగిపళ్లు, ఆడపిల్లకు బొమ్మల నోములు, ఇంటింటా పేరంటాలు సంక్రాంతి శోభకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. రకరకాల జానపద కళాకారులు తమ విద్యలను ప్రదర్శించి, పండుగ బహుమానాలు అందుకుంటారు.
మకర సంక్రమణం రోజున శబరిమల మకరజ్యోతి దర్శనం కనువిందు చేస్తుంది. భారత యువతకు కర్తవ్యబోధ చేసి, వారిని మేల్కొల్పిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏటా జనవరి 12న జాతీయ యువజనోత్సవం జరుగుతుంది. ధైర్యమే జీవనము, పిరికితనమే మరణమన్న ఆ మహనీయునికి అంజలి ఘటిద్దాం. ఈ కొత్తఏడాదిలో పన్నెండురాశుల వారికీ వర్తించే విధంగా రాశిఫలాలను, కొత్త ఏడాదిలో దేశీయ, వాతావరణ పరిస్థితులను గురించి పంచాంగ కర్తలు అందించే ఫలితాలను ఈ సంచికలో అందిస్తున్నాం. ఈ కొత్త ఏడాదిలో కరోనా మహమ్మారి మనల్ని పూర్తిగా వదిలిపోవాలని ముక్కోటి దేవతలను వేడుకుందాం. భక్తి పత్రిక పాఠకులకు, ప్రకటన కర్తలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
➠ అచంచలమైన భక్తికి సంగీత, సాహిత్యాలను ఆలంబనగా చేసుకున్న మహనీయుడు త్యాగరాజు. ఆయన కృతులు పాడకుండా కర్ణాటక సంగీత కచేరీ చేయడం దాదాపు అసాధ్యం. కర్ణాటక సంగీతంపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు.
➠ దేవుడు నీ ప్రతిబింబం. ‘దేవుడు మానవుణ్ణి తన పోలికలతో సృష్టించాడు’ అనే మాట తప్పు. మానవుడే దేవుణ్ణి తన పోలికలతో సృష్టించుకున్నాడు అనడం ఒప్పు. విశ్వమంతటా మనం మనకు ప్రతిరూపాలుగా దేవుళ్లను సృష్టించుకుంటున్నాం అన్నారు స్వామి వివేకానంద. ఆయన చేసిన అద్వైత వేదాంత ప్రబోధకమైన ఈ ప్రసంగం చదివితే యువజనుల్లో ఆయన రగిలించిన స్ఫూర్తి ఎలాంటిదో అర్ధమవుతుంది.
➠ శ్రీపురం నారాయణి క్షేత్రం దేవాలయాల నిర్మాణ చరిత్రలో స్వర్ణశకానికి నాంది పలికింది. జీర్ణదేవాలయ సముద్ధరణ, దీనజనోద్ధరణలతో శ్రీనారాయణి పీఠం సేవామార్గాన్ని విస్తృతస్థాయిలో చేపట్టింది. శ్రీపురం స్వర్ణమహాలక్ష్మి ఆలయం, శ్రీనారాయణి పీఠం ప్రపంచ దేశాల ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
➠ హరిహర సుతుని ఆవాసం శబరిమల. శబరిమల క్షేత్రంలో కాలుమోపినంతనే జన్మ తరిస్తుంది. నయనానందకర ప్రకృతి దృశ్యాలతో అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతి మన సొంతమవుతుంది. కేరళ రాష్ట్రంలోని ‘పతనం తిట్ట’ జిల్లాలో కొట్టాయం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో పంపా నదీతీరంలో శబరిమల క్షేత్రముంది. శబరిమల క్షేత్ర దర్శనయాత్ర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.
➠ దశమికి ఒకటి కలపగా పూర్తయ్యే తిథిని ఏకాదశిగా మన పూర్వీకులు పేర్కొన్నారు. మూడు+కోట్లు అనే రెండు శబ్దాల చేత ముక్కోటి శబ్దం ఏర్పడుతోంది. ఈ ద్విగు సమాసంలో ఏకవచనం కూడా వచ్చింది. ఇంతకీ మూడుకోట్లు ఎవరన్నది ప్రశ్న. మూడుకోట్ల ఏకాదశులు కలిస్తే ఎంత పవిత్రతో ఆ ఒక్కరోజూ అంత పవిత్రత చేకూరుతుంది. కనుక మూడుకోట్ల దేవతలతో కూడిన ఏకాదశి అని, మూడుకోట్ల ఏకాదశీ పర్వదినాల సమాహారమనీ రెండు అర్థాల్లోనూ ముక్కోటి ఏకాదశిని గురించి చెప్పుకోవాలి.
➠ పండుగలు మన సంస్కృతీ చిహ్నాలు. సంప్రదాయ వైభవాలు. పర్వం అనే శబ్దం నుంచి పబ్బం పండగ అనే రూపాలు వచ్చాయి. సాంఘిక సంక్షేమం కోసం విశేష సందర్భాలలో జానపద విశేషాలు, సంప్రదాయాల కలబోతగా ఆచరించే సంక్లిష్టమైన అంశమే పండుగలంటారు పరిశోధకులు. మనుష్యుల్లో సహజమైన చైతన్యాన్ని తెచ్చేది పండుగ. అలాంటి పండుగల్లో సంక్రాంతికి అగ్రతాంబూలమిస్తాం. అందుకే ఇది పెనుపండుగ.