కొత్త ఏడాది ప్రవేశిస్తోంది. చేదు జ్ఞాపకాలు మరిచి, తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దుకునేందుకు కొత్త ఏడాది స్ఫూర్తినిస్తుంది. క్యాలెండర్ లో రాబోయే మార్పు మన జీవితాలలో కూడా దివ్యమైన మార్పులకు శ్రీకారం కావాలి. ఈ కొత్త ఏడాదిలో పన్నెండు రాశుల వారికీ వర్తించే విధంగా రాశిఫలాలను, దేశీయ - వాతావరణ పరిస్థితులను గురించి పంచాంగకర్తలు అందించే ఫలితాలను ఈ సంచికలో అందిస్తున్నాం. ఈ నెలలోనే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే మకర సంక్రమణం (జనవరి 15) కూడా వస్తుంది. సంక్రాంతి తెలుగువారికి పెద్దపండుగ. మన శుభకార్యాలన్నీ సంక్రాంతి తరువాతే ప్రారంభమవుతాయి. ఏరువాక నుంచి ఈనాటి వరకు ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించిన రైతుల లోగిళ్లు ధాన్యలక్ష్మితో కళకళలాడుతాయి. ముంగిట ముగ్గులతో, గొబ్బెమ్మలతో, హరిదాసులు, గంగిరెద్దుల సందళ్లతో సంక్రాంతి కళ పల్లెలకు వెలుగు తెస్తుంది. పిల్లలకు భోగిపళ్లు, ఆడపిల్లలకు బొమ్మల కొలువులు - పేరంటాలు, పశువులకు అలంకారాలు సంక్రాంతి శోభకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. జానపద కళాకారులు తమ విద్యలను ప్రదర్శించి, బహుమానాలు అందుకుంటారు.
మకర సంక్రమణం రోజునే శబరిమల మకరజ్యోతి దర్శనమిస్తుంది. జ్యోతిదర్శనానికి ఇరుముడి ధరించి శబరిమల చేరుకున్న భక్తులు 'స్వామియే శరణం అయ్యప్ప' నినాదాలతో హోరెత్తిస్తారు. ఎన్నో ఘర్షణల తరువాత రామజన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తికావచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామమందిరం జనవరి 22న ప్రారంభోత్సవం జరుపుకుంటోంది. భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ శుభవేళలో ఆ శ్రీరాముని అనుగ్రహం మనందరికీ లభించాలని కోరుకుంటున్నాను. భక్తిపత్రిక పాఠకులందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు.
➠ కంచి పరమాచార్య శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి... నిండుగా నూరేళ్లపాటు జాతిని ప్రభావితం చేసిన మహోన్నతులు. దేశమంతటా కాలినడకన విస్తృతంగా పర్యటిస్తూ అనేక బోధలు చేసినవారు. వాటిలో కొన్ని ‘జగద్గురు బోధలు' పేరుతో ప్రచురితమయ్యాయి.
➠ సకల సంపదలకు నిలయమై, తేజోమయకాంతితో అలరారే అయోధ్య వైభవం అనంతం. అటువంటి రాముడు పుట్టిన నేలపై ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావాలని దశాబ్దాలుగా భక్తకోటి ఎదురుచూస్తోంది. ఆ శుభ తరుణం రానే వచ్చింది. ఆ అపూర్వమైన ఘడియల్ని దర్శించే భాగ్యం మనకు కలగనుంది.
➠ స్వామి వివేకానందుల జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. యుక్తవయస్సులోనే భారతీయ కీర్తిపతాకను ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన మహనీయుడు. యువజనులలో స్ఫూర్తి నింపితే వారే దేశానికి వెలుగునిస్తారని నమ్మిన మానవతావాది. నేటికీ యువతరం హృదయాలలో ఆయన వ్యక్తిత్వం మహోన్నతంగా ప్రకాశిస్తూనే ఉంది.
➠ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శబరిమల ఒకటి. ఆ కొండపై కొలువున్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే (మండలపూజ, మకరవిళక్కు, ఓనం వంటి పండుగలు, ప్రతినెలా అయిదు రోజులు) స్వామివారి దర్శనం లభిస్తుంది.
➠ జనవరి 7 నాడు మల్లన్న జాతర... కల్యాణోత్సవం, శకటోత్సవాలతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం అంటే 2024 జనవరి 22 నుంచి మూడునెలలపాటు ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది. బోనాలు, అగ్నిగుండాలు వంటి వేడుకలతో జానపదులు స్వామిని మెప్పిస్తారు.
➠ సూర్య చంద్ర గమనాలు, రాశుల కదలికల ఆధారంగానే మనం పండుగలు జరుపుకుంటాం. అటువంటి వాటిలో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రాంతిగా వ్యవహరిస్తారు. అచ్చతెనుగు సరదాలకు ఆటపట్టు... సంస్కృతీ సంప్రదాయాలకు ఆయువుపట్టు సంక్రాంతి పండుగ.