యదవ్యక్తాత్మలో విష్ణుః కాలరూపో జనార్ధనః
తస్యాంగాని నిబోధత్వం క్రమాన్మేషాదిరాశయః
అవ్యక్తాత్మకుడైన భగవంతుని అసలు స్వరూపం కాలం. అది అనంతం.... అగమ్యగోచరం, కానీ అదే సత్యం. కాలాన్ని అనుసరించే మంచి చెడులుంటాయి. ఒక కాలంలో మంచి అనుకున్నది మరోకాలంలో చెడుగా పరిణమించవచ్చు. ఒకకాలంలో మనం చెద్దదేమో అని విడిచిపెట్టినదే ఇప్పుడు మంచిదై అందరి మన్ననలూ పొందవచ్చు. కాలం అనివార్యంగా తీసుకువచ్చే మార్పులను అంగీకరించడంలో వెనకడుగు వేయకూడదు. 2025 కొత్త సంవత్సరం ప్రవేశం మనలో పురోగామి మార్పులకు పునాది కావాలి.
ఏడాదికాలంలో ! కొన్ని రోజులను పుణ్యకాలాలుగా మన ధార్మికులు పేర్కొంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం అటువంటిదే. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో (జనవరి 14) మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం భౌగోళికంగా కీలకమైనది. ఆ తరుణాన్ని అందరూ గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే, మనలో ధర్మాచరణ పట్ల ఆసక్తి కలిగించే సదాశయంతోనే మనవారు పండుగలను ఏర్పాటు చేశారు. భోగి పండుగ గడపగడపకీ సంక్రాంతి శోభను తీసుకువస్తుంది. కనుమ, ముక్కనుమలతో కలిపి సంక్రాంతి నాలుగురోజుల పండుగ. భోగి, సంక్రాంతులు ధార్మిక కార్యక్రమాలకు, కనుమ పండుగ విందువినోదాలకు పేరుపడ్డాయి. సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. ఈ పండుగ మీ ఇంట ఆనందాల సిరులు కురిపించాలని ఆకాంక్షిస్తున్నాం.
జనవరి 10న వైకుంఠ ఏకాదశి పర్వదినం వస్తోంది. ఆనాడు విష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. 13న ప్రయాగలో కుంభమేళా ప్రారంభమవుతోంది. 14న శబరిమలలో మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఇంకా ఈనెలలో అనేక జాతరలు, పండుగలు చోటుచేసుకోబోతున్నాయి. రాబోయే సంవత్సరం మన దేశానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఎలా ఉండబోతోందో తెలియచేస్తూ పంచాంగకర్తలు రచించిన భవిష్యవాణిని ఈ సంచికలో అందిస్తున్నాం. అలాగే పన్నెండు రాశుల వారికీ సంవత్సర ఫలాలను ప్రఖ్యాత జ్యోతిష పండితులు గుణించి చెప్పిన వాటిని అందిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభసంతోషాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను.
➠ శ్రీరాముని వనవాసంలో పంచవటి ఎంపిక నిర్మాణం కీలకమైనవి. ఆయనను అక్కడ ఉండమని నిర్దేశించినవాడు అగస్త్యుడు. ఇంతకూ పంచవటి ఎక్కడుంది అనే ప్రశ్న చాలాకాలంగా వస్తున్నదే. నాసికా త్రయంబకంలో పంచవటి ఉందని కొందరంటారు. భద్రాచలానికి సమీపంలో ఉందని మనం సంపూర్ణంగా విశ్వసిస్తాం.
➠ శ్రీపురం అనగానే స్వర్ణమహాలక్ష్మి ఆలయం గుర్తుకువస్తుంది. ఆధునిక కాలంలో దక్షిణ భారతదేశంలో రూపుదిద్దుకున్న స్వర్ణాలయం అది. నక్షత్రం ఆకృతిలో అందమైన ప్రకృతి నేపధ్యంలో శ్రీపురం ఆలయాన్ని దర్శించాలని లక్ష్మీభక్తులు ఉవ్విళ్లూరుతారు. ఈ ఆలయాన్ని నిర్మించిన ఏకైకశక్తి పేరు శక్తిసిద్ధ నారాయణీ అమ్మ.
➠ సంక్రాంతి వేడుకల్లో కోనసీమ ప్రత్యేకం ప్రభలతీర్థం. కనుమ పండుగ రోజున జగ్గన్న తోట ప్రభల తీర్థం కోలాహలంగా జరుగుతుంది. ఏకాదశ రుద్రుల సమావేశానికి ప్రతీకగా నిర్వహించే ప్రభల తీర్థంలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు. ఆనందోత్సాహాలను పంచుకుంటారు.
➠ సంక్రాంతి పండుగను పెద్దపండుగ అంటారు. పెద్దలను సంస్మరించుకునే పండుగ కూడా ఇదే. ముఖ్యంగా పితృదేవతలను ఆరాధించాల్సిన ముఖ్యతేదీల్లో సంక్రాంతిని కూడా మనవారు చేర్చారు. అలాగే సంక్రాంతిని జరుపుకునేందుకు కొన్ని విధివిధానాలను సైతం ధర్మశాస్త్రాలు ప్రబోధించాయి.
➠ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరద్వార దర్శనం పెద్ద ఉత్సవం. దక్షిణాభిముఖుడైన స్వామిని ఉత్తరం వైపున నిలిచి సేవిస్తే వెనువెంటనే అనుగ్రహిస్తాడని శాస్త్రం. దర్శించిన వారికే కాకుండా ముందు తరాల వారికి మోక్షాన్ని అనుగ్రహించే ముక్కోటి ఏకాదశి మనకు అనేక కర్తవ్యాలను గుర్తుచేసే మహత్తర పర్వం.
➠ కొత్త ఏడాది సుఖసంతోషాలను పంచబోతోంది. దేశ పురోగతికి రాచబాటలు వేస్తుంది. అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చినా మొత్తంమీద శుభపరిణామాలే ఎక్కువగా చోటు చేసుకుంటాయి.