NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.

సూర్యదేవుడు మకరరాశిలో ప్రవేశించే శుభఘడియలలో మనం సంక్రాంతి పండుగను మూడురోజులపాటు జరుపుకుంటాం. ఈ మకర సంక్రమణం (జనవరి 15) నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కొత్త ధాన్యాలు ఇళ్లకు చేరే తరుణం ఇది. ఏరువాక నుంచి ఎండావానా పగలూరేయీ లేకుండా యజమానికి దీటుగా శ్రమించిన ఎడ్ల జతలకు ఇది విశ్రాంతికాలం. ఆడపడుచులు పుట్టింటికి పిల్లాజెల్లాతో తరలివచ్చి సంక్రాంతి శోభకు మెరుగులద్దుతారు. తల్లులు పిల్లలకు భోగిపళ్లు పోసి పేరంటాలు చేస్తారు. బొమ్మల కొలువులు పెడతారు. కొత్తగడ్డి చలిమంటతో చలికాగడం సంక్రాంతి పొద్దులో ఒక వెచ్చని అనుభూతి. భోగి, సంక్రాంతి, కనుము ఈ మూడింటినీ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. విందు వినోదాలకిది అనువైన తరుణం. ఈ మకర సంక్రాంతి మరో విశిష్టత మకరజ్యోతి దర్శనం. 'హరిహర సుతనే శరణమయ్యప్ప' అంటూ శరణుఘోషతో కొండలు కోసలు మార్మోగుతాయి. 

సరస్వతీదేవి ఆవిర్భవించిన వసంతపంచమి (జనవరి 23) అక్షరం పుట్టినరోజు. ఈ శుభవేళ విద్యార్ధినీ విద్యార్థులందరూ చదువుల తల్లి అనుగ్రహానికి పాత్రులై విద్యల్లో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. సూర్యభగవానుని ఆరాధించుకునే రథసప్తమి (జనవరి 25) కూడా ఈ నెలలోనే వస్తోంది. మానవాళికి మహోపకారం చేస్తున్న సూర్యునికి అంజలి ఘటిస్తారు. సూర్యభగవానుడు ఋతుధర్మాలను కాపాడుతూ అందరికీ సుఖశాంతులు ప్రసాదించాలి. ఈ మాఘమాసంలోనే రెండేళ్లకోసారి పౌర్ణమినాడు గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర నిర్వహిస్తారు. ఇంకా ఈనెలలో అనేక దేవాలయాల్లో ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. ఉత్సవాలు జరిపించుకునే దేవీదేవతలందరూ మనల్ని చల్లగా చూడాలని ప్రార్ధిద్దాం. ఆంగ్లనూతన సంవత్సర ప్రారంభ శుభవేళ, సంక్రాంతి సర్వాస పాఠకులకు, ప్రకటనకర్తలకు, రచయితలకు శుభాకాంక్షలు.

➠ 2026వ సంవత్సరంలో వ్యాపార రంగం అద్భుతంగా ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలు, క్రీడారంగం మెరుగైన ఫలితాలు నమోదు చేస్తాయి. వాటితోపాటు పరాభవ నామ సంవత్సరంలో పేరుకు తగ్గట్లుగా విషాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. వ్యతిరేక ఫలితాలున్నా ధర్మాచరణ చేసేవారికి దైవకృపవల్ల శాంతి - ఆనందాలు లభ్యమవుతాయి.

➠ సూర్య చంద్ర గమనాలు, రాశుల కదలికల ఆధారంగానే మనం పండుగలు జరుపుకుంటాం. అటువంటి వాటిలో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రాంతిగా వ్యవహరిస్తారు. సంక్రాంతిని మనం మూడురోజులపాటు నిర్వహించుకుంటాం. అచ్చతెనుగు సరదాలకు ఆటపట్టు... సంస్కృతీ సంప్రదాయాలకు ఆయువుపట్టు సంక్రాంతి పండుగ.

➠ ఆత్మీయ అనుబంధాల పల్లెలోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ శోభ కనుమ పండుగనాడు కానవస్తుంది. రైతుతో పాటు ఆరుగాలం శ్రమించే బసవన్నలకు అలంకరణలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మానవ మనుగడకు సహకరించే పశుపక్ష్యాదులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తర పర్వం కనుమ.

➠ మాఘ శుద్ధ పంచమి 'వసంత పంచమి'గా ప్రసిద్ధి చెందింది. మామూలుగా చైత్ర - వైశాఖమాసాల్లోనే వసంత ఋతువు వస్తుంది. కానీ 'మాఖాద్యా పంచవసంతః' అనే ఉక్తి ఉంది. దానిప్రకారం మాఘమాసంతోనే వసంతం మొదలవుతుంది. అటువంటి మాఘమాసంలో వచ్చే ఈ పంచమిని 'మదన పంచమి'గా, 'సరస్వతీ జయంతి'గా జరుపుకుంటారు.

➠ మాఘ శుద్ధ సప్తమి తిథి సూర్యజయంతి. అఘము అంటే పాపం. మాఘం అంటే పాపాలను నశింపచేసే శక్తి కలది. మాఘమాసం సూర్యుని మాసం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత వచ్చే రథసప్తమి పవిత్రతిథి. సూర్యోపాసనకు అనుకూలమైంది. రథసప్తమినాడు మాఘస్నానం, పొంగలి నివేదనం, అర్ఘ్యం సూర్యసమర్పణంగా చేసినవారికి ఆరోగ్యలాభం చేకూరుతుంది.

➠ పౌరాణిక చరిత్రను పరిశీలించిన విజ్ఞులు, భీష్మాచార్యుడు మాఘశుక్ల సప్తమినుంచి ఏకాదశి నాటికి పంచప్రాణాలైన ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానములను వరుసగా యోగక్రియ ద్వారా త్యజించాడని వివరించారు. ఈ అయిదు తిథుల పుణ్యకాలాన్నే భీష్మపంచకం అంటారు. ఈ అపూర్వకాలాన్ని సనాతన ధర్మపరులు పరమ పవిత్రంగా భావించి అవతార మూలమైన విష్ణుభగవానుని అర్చిస్తారు.

Recent Comments