"సూర్యున్నే బొట్టుగ బెట్టినవూ బల్లాన్నే చేతిల బట్టినవు
మహమారీ తలలే నరికినవూ పెద్దమ్మా
పులిపై సవ్వారే జేసినవూ ఓయమ్మా
అందుకె నీకు బోనాలెత్తుతమూ"
తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఆషాఢ బోనాల మాసమిది. గోల్కొండ జగదంబిక బోనాలు (జూలై 11)తో మొదలై లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు (ఆగస్టు 1) వరకూ బోనాల జాతర అనేక విశేషాలు చోటు చేసుకుంటాయి. అమ్మా బైలెల్లినాదో అంటూ సాగే ఆడపడుచుల బోనాల సమర్పణ, పోత రాజుల విన్యాసాలతో బోనాల యాత్రలు శోభస్కరంగా జరుగుతాయి. అయితే ఈ వానకాలంలో ఎప్పుడూ వచ్చే మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పాటుగా కరోనా మహమ్మారితోనూ ప్రమాదం పొంచివుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు విధించే నిబంధనలతో పాటుగా ఎవరికి వారు స్వీయక్రమశిక్షణ పాటించాలి. పౌరుల నుంచి పూర్తి సహకారం లేకపోతే... ప్రభుత్వాలు, వైద్యులు పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ విషయాన్ని గుర్తెరిగి... నిబంధనల మేరకే ఉత్సవాల్లో పాల్గొందాం. ఆషాఢ ప్రారంభంలోనే (జూలై 12) రథారూఢుడై దర్శనమిచ్చే పూరీ జగన్నాథుడు భక్తకోటి మొరలు ఆలకించాలని కోరుకుందాం. దక్షిణాయన వేళలో తొలి ఏకాదశి ప్రధాన పర్వం. అటుపైన గురు పూర్ణిమ (జూలై 24) వస్తుంది. గురువును దైవంగా పూజించే సంప్రదాయం మనది. గురుపరంపరను స్మరిస్తూ, వారి ప్రబోధాలను నెమరు వేసుకునేందుకు తగిన తరుణం గురు పూర్ణిమ. పీఠాధితులు చాతుర్మాస్య దీక్షలను చేపట్టే సమయం ఇది. వారి దీక్షలు లోకమాత కృపతో ప్రశాంతంగా సాగాలని, లోకశ్రేయస్సుకు దోహద పడాలని కోరుకుందాం. ఇది భక్తిపత్రిక జన్మదిన సంచిక. ఈ ఏడాది ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడో ఏట అడుగుపెడుతోంది. భక్తిపత్రిక పట్ల మీ ఆదరాభిమానాలు ఇలాగే ఇకముందు కూడా కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నాం.

➠ కంచికామకోటి పూర్వపీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతీ మహాస్వామి 1935 జూలై 18న జన్మించారు. శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారసునిగా 1970 నుంచి ప్రారంభించి జీవిత కాలంలో 14 సార్లు విజయయాత్రలు చేపట్టారు. ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ గావించారు. కుంభాభిషేకాలు జరిపించారు. ఆదిశంకరాచార్యులు సంచరించిన ప్రదేశాలను గురించి జయేంద్రులు అపూర్వ పరిశోధనలు చేశారు. కంచిపీఠానికి ఎనలేని జనాదరణ తెచ్చిపెట్టారు. 2018 ఫిబ్రవరి 28న సిద్ధిపొందారు.  

➠ తిరుమల తిరుపతి స్వామికి నిత్య కల్యాణం పచ్చతోరణం. ఏడాది పొడవునా ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం, వేడుక తిరుమల కొండపై నిర్వహిస్తూనే ఉంటారు. శ్రీవారి సన్నిథిలో ఆషాఢమాసంలో జరిగే ముఖ్యకార్యక్రమం ఆణివర ఆస్థానం. వార్షిక ఆదాయ వ్యయాల నివేదిక, పుష్పపల్లకీ సేవ ప్రధానంగా నిర్వహించే ఆణివర ఆస్థానం దక్షిణాయనం ప్రారంభదినం నాటి విశేష కార్యక్రమం.

➠ ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమి అని వ్యవహరిస్తారు. అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్న గిరిపున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు. పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు. ఈసారి గిరిపున్నమి నాడే చంద్రగ్రహణం వస్తున్న కారణంగా మధ్యాహ్నం వరకే అప్పన్న దర్శనం ఉంటుంది.

➠ వికాసమే జీవనం సంకోచమే మరణం. మనపై మనకు విశ్వాసం, భగవంతుడిపై విశ్వాసం అనేవి పరిపూర్ణ వికాస మంత్రాలు. ముప్పై మూడు కోట్ల పౌరాణిక దేవతలపైన మీకు నమ్మకం ఉన్నా... మీపై మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే నిష్కృతి ఉండదు అని చాటిన నిత్యచైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద.

➠ యతులకు అత్యంత ప్రధానమైనది గురుపూర్ణిమ. ఆరోజున ఆచార్యపీఠాలన్నీగురు ఆరాధనా కార్యక్రమాన్నినిర్వహించాలని నియమం. అదేరోజున చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. నాలుగు నెలలపాటు కఠోర దీక్షానియమాలతో సంన్యాసాశ్రమంలోని వారంతా ఈ వ్రతాన్ని పాటిస్తారు. 

➠ పాలకడలిపై శేషతల్పం మీద శ్రీమహావిష్ణువు శయనించేకాలమే చాతుర్మాస్యం. తొలి ఏకాదశి (జూలై 20) నుంచి ఉత్థాన ఏకాదశి (నవంబర్ 15) వరకు మధ్యనున్న కాలమంతా పుణ్యకాలమని పెద్దలు చెబుతారు. ఆ సమయంలో చేసిన వ్రతాలు, దానాలు అధిక శుభఫలితాలను ప్రసాదిస్తాయి. అటువంటి పుణ్యకాలానికి ప్రారంభదినమైన తొలి ఏకాదశి  విశిష్టతలు....

Recent Comments