NOTE : ఇది కేవలం ఆన్లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
జగన్నాథ రథచక్రాలు ప్రగతికి, చైతన్యానికి సంకేతాలు. సార్థక నామధేయుడైన జగన్నాథస్వామి రథోత్సవం ఈనెల 16న అత్యంత వైభవంగా జరగనుంది. ప్రతి ఆషాఢం ప్రారంభంలో జనసంద్రంగా సాగే పూరీ జగన్నాథ రథోత్సవం దేశానికే పర్వదినం. ఈ ఉత్సవంలో దర్శనమిచ్చే జగన్నాథుడు భక్తకోటి మొరలు ఆలకించాలని కోరుకుందాం.
అందరినీ చల్లగా చూసే అమ్మతల్లులకు బోనమెత్తే శుభతరుణం ఆషాఢం. తెలంగాణ ఆడపడుచులు, తల్లులు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామదేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. బోనాల జాతర ప్రాభవమంతా భాగ్యనగరంలోనే కొలువు తీరుతుంది. జూలై 16న గోల్కొండ జగదంబిక బోనాలతో మొదలుపెట్టి వచ్చేమాసంలో సింహవాహిని బోనాల వరకు ప్రతి ఆదివారం భాగ్యనగర వీధులు బోనమెత్తే ఆడపడుచులతో, పోతురాజుల సందళ్లతో కళకళలాడుతాయి. బోనాలు స్వీకరించే అమ్మతల్లులు అందరినీ కాపాడాలని కోరుకుందాం.
ధ్యానం, పూజ, మంత్రం, మోక్షాలన్నింటికీ మూలం గురువే. అందుకే ‘గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః’ అంటూ శిరసు వంచుతాం. జూలై 29న గురుపూర్ణిమ మహోత్సవం వస్తున్నది. మనం ఈనాడు ఇలా నాగరికంగా, మానవతా విలువలను కాపాడుకుంటూ ఉన్నతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం యుగాలుగా మానవజాతిని సంస్కరించిన గురువులే. ఆధ్యాత్మికంగా, సామాజికంగా మానవాళిని పలురంగాల్లో సావధానంగా నడిపించిన మహనీయులెందరో ఉన్నారు. భక్తిప్రపత్తులతో వారిని, వారి సద్బోధనలను ఈ సందర్భంగా సంస్మరించుకుందాం. వినమ్రంగా గురువందనం చేసుకుందాం.
భక్తిపత్రిక మీ అందరి ఆశీస్సులతో, ఆదరాభిమానాలతో పదకొండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, పన్నెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సంతోష వేళ మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతాభివందనాలు.
➠ త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జగత్తే తనకు గురువు అని ప్రకటించాడు. ప్రకృతిలో 24 మంది గురువులున్నారని తెలియజేశాడు. గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు జగద్గురువు. వేదవిజ్ఞానాన్ని జగత్తుకి పంచిన వ్యాసుని పుట్టినరోజు గురుపౌర్ణమి. భారతీయ వేదాంతాన్ని శిఖరాయమాన స్థాయికి తీసుకువెళ్లిన ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు నిత్యస్మరణీయులు.
➠ ఆషాఢంలోని ప్రతి ఆదివారమూ పండుగరోజే. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో మొదటి ఆదివారం గోల్కొండ బోనాలు, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి లష్కర్ బోనాలు, మూడో ఆదివారం చిలకలగూడ పోచమ్మ, ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా మాతేశ్వరి ఆలయం, నాలుగో ఆదివారం షా ఆలీ బండలో అక్కన్న మాదన్న ఆలయంలో బోనాలు జరుగుతాయి.
➠ ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు వైకుంఠంలో శేషతల్పంపై శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి నాలుగునెలల పాటు అంటే కార్తిక శుద్ధ ఏకాదశి వరకు శ్రీహరికి యోగనిద్రాకాలమే. సజ్జనులు, సాధుసంతులు సక్రమంగా తపస్సులు చేస్తున్నారో లేదోనని కళ్లు విప్పి చూస్తూ... శ్రీహరి తన యోగనిద్రా స్థితిని ఈ నాలుగునెలల కాలంలో కొనసాగిస్తాడు.
➠ పండరీపురం దక్షిణ ద్వారకగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణపరమాత్మ పాండురంగస్వామిగా కొలువుదీరిన దివ్యక్షేత్రం. మహారాష్ట్రులతోపాటూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని ప్రజలకు పాండురంగస్వామి ఆరాధ్య దైవం. తొలిఏకాదశి సమయంలో పండరీపురంలో పెద్దఎత్తున వార్కరీ ఉత్సవాలు జరుగుతాయి.
➠ ఆషాఢమాసం రెండోరోజు. ఎటుచూసినా భక్తజన సందోహం. గర్భాలయం నుంచి తరలివచ్చే మూలవిరాట్టులు. రథాలపై కొలువుదీర్చే అద్భుత ఘట్టం. మూడు కిలోమీటర్ల మార్గం. ఇసుకేస్తే రాలనంత భక్తజనం. ఒకదాని వెంట ఒకటి వడివడిగా కదిలే రథాలు. భక్తుల జయజయధ్వానాలు. అరమోడ్పు కళ్ల దేవుడిని చూడగానే మహదానందం. మోక్షపురి పూరిలో జరిగే ప్రతీ ఏటా జరిగే క్రతువు ఇది.
➠ సత్యధర్మాలు గురుస్వరూపాలు. అవి పాటించని గురువు ఎప్పటికీ వందనీయులు కాలేరు. గురుపదం బ్రహ్మానందకారకం. గురువు ఆశ్రయం సర్వసౌఖ్యప్రదం. తత్త్వ మసి మున్నగు మహావాక్యాలకు సద్గురువే లక్ష్యం. జ్ఞానం ఒక రూపాన్ని ధరిస్తే ఆ రూపమే గురువు. దానికి అందరూ నమస్కరింపవలసిందే. గురువును త్రికరణ శుద్ధిగా నమ్మిన శిష్యునికి గురువు అనుగ్రహం కలిగే తీరుతుంది.
➠ కలియుగ విభుడు వేంకటేశ్వరుడు. భారతదేశంలో అత్యంత సంపన్న ఆలయాలలో తిరుమల తిరుపతి రెండోస్థానంలో ఉంది. అత్యధిక వార్షిక ఆదాయం, భక్తుల విరాళాలు కలిగిన ఆలయమది. ఏటా సుమారు 4,800 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కలిగిన తిరుమల ఆలయంలో... వార్షిక ఆదాయ వ్యయాలను స్వామికి దక్షిణాయనం ప్రారంభంలో ఆణివార ఆస్థానం పేరుతో నివేదిస్తారు.
➠ నేటి యువతకు ఆధ్యాత్మికత ఒక గొప్ప దిక్సూచి. అంతరంగాన్ని తెలుసుకోవడానికి... ఒత్తిడిని జయించడానికి... సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి... చేసే మానసిక వ్యాయామమే ఆధ్యాత్మికత. ప్రతి యువకునిలోనూ అనంతమైన దివ్యశక్తి దాగి ఉంటుంది. ఆ అంతర్గత శక్తిని మేల్కొలిపి, నిర్భయంగా సమాజసేవకు అంకితం కావడమే నిజమైన ఆధ్యాత్మికత అని స్వామి వివేకానంద ప్రబోధించారు.