NOTE : ఇది కేవలం ఆన్లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
గ్రీష్మతాపం ఇంకా చల్లారలేదు. ఈసారి అధిక జ్యేష్టం కూడా తోడుకావడంతో వేసంగి సుదీర్ఘంగా నడిచినట్లుగా అనిపిస్తోంది. భూమాత తొలకరి కోసం అర్రులు చాస్తోంది. నైరుతి ఋతుపవనాలు పలకరించే సమయంలోనే రైతన్నలు నాగలి పట్టి భూమిని దున్నడానికి సిద్ధపడతారు. జూన్ 29, ఏరువాక పున్నమినాడు పశువులను పూజించి, ముక్కారు పంటలు పండాలని నేలతల్లిని ప్రార్ధిస్తారు. కృషీవలుల ఆశలు తీరాలని అందరమూ కోరుకుందాం. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగదినోత్సవం, ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన మహత్తర శాస్త్రం యోగ, ఆధునిక జీవనవిధానంలో అనేక ఒత్తిడుల మధ్య నిరంతరం నలిగిపోయే మానవులు యోగజీవనాన్ని అలవరుచుకుంటే అనేక శారీరక, మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. యోగశాస్త్రంలో ప్రాణాయామం, ఆసనాలతో పాటు ఇంకా అనేక విధానాలున్నాయి. వాటిలో మనసుకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకుని, ప్రతి ఒక్కరం యోగఫలాలను అందుకుందాం.
తెలుగు వారికి పుష్కరకాలం ఎంతో పవిత్రం. ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 13 వరకు యమునా నదికి పుష్కరాలు రానున్నాయి. కొందరు ప్రయాగ వంటి యమునా పరీవాహక క్షేత్రాలకు వెళ్లి పితృదేవతలకు పిండప్రదానాలు అర్పిస్తారు. సాధ్యం కానివారు యమునా నదీ వైభవాన్ని తలుచుకుని మనసారా నమస్కరిస్తారు. ఆ సదీమతల్లి మనందరినీ చల్లగా చూడాలని ప్రార్ధిద్దాం. జూన్ మాసంలోనే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. స్కూళ్లు తెరుస్తారు. విద్యార్థినీ విద్యార్థులందరూ కొత్త ఉత్సాహంతో విద్యాలయాలకు వెళ్లడానికి సిద్ధమవుతారు. పిల్లలంతా చదువుల్లో రాణించాలని ఆ సరస్వతీ మాతను వేడుకుంటున్నాను.
➠ సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సమస్త వృక్ష, జీవరాశిని భగవంతుని అంశంగా పూజించడం అనాదిగా కొనసాగుతోంది. ప్రాణశక్తిగా ప్రవహించే జీవత్వానికి దైవ స్పర్శ ప్రధాన అంశం. ఆ ప్రాణశక్తి చెట్లు, మొక్కల ద్వారా లభిస్తుందని నమ్ముతారు. అందుకే భారతీయులు అనాదిగా వృక్షాలను పూజిస్తారు.
➠ జగత్తు ఆకాశం వంటిదే అని ప్రబోధిస్తున్న క్షేత్రం చిదంబరం. ఇక్కడ నాట్యభంగిమలో ఉన్న శివుడు నటరాజ స్వామిగా కొలువుదీరాడు. శ్రీశైలంలో శిఖర దర్శనం, కాశీలో మరణం ఏ విధంగా పునర్జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాయో, అట్లే చిదంబరం దర్శనమాత్రాన్నే ముక్తిని కలిగించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
➠ ఏడాదిలో కొన్నిరోజులు.. కేరళంలోని ఓ అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావారణం వెల్లివిరుస్తుంది. ప్రకృతినే పరమేశ్వరుడిగా ఆరాధించే క్షేత్రమది. చెట్లు చేమలే ఆలయ ప్రాకారాలుగా అలరారే కేరళం కైలాసమది. వీచే గాలులే వేదమంత్రాలుగా ప్రతిధ్వనించే మహాదేవుని నిలయమది. తొలకరి చినుకులే అభిషేకధారలయ్యే దక్షిణకాశీ అది. రండి మనమూ వెళదాం కొట్టియీర్కు.
➠ వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే ప్రారంభమవుతుంది. అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి.
➠ భారతీయ విజ్ఞానాన్ని దర్శనవేత్తలు పరిపుష్టం చేశారు. షడ్దర్శన కారులలో యోగదర్శనాన్ని అందించిన పతంజలి ప్రాతస్మరణీయుడు. యోగంతో మనసుకు, వ్యాకరణంతో వాక్కుకు, వైద్యంతో శరీరానికి దోషాలను పోగొట్టే మునిశ్రేష్ఠునిగా పతంజలి ప్రార్థనా శ్లోకం వర్ణిస్తోంది. ప్రపంచానికి భారతీయులు అందించిన సర్వశ్రేష్ఠ విజ్ఞానం యోగదర్శనం అని ఆధునిక సమాజం ముక్తకంఠంతో చెబుతోంది.
➠ పన్నెండేళ్లకు ఒకసారి పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి. ఆ కోవలో ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఉత్తరాది వారికి కుంభమేళా వలె తెలుగువారికి పుష్కర సమయం అతి పవిత్రం. ముఖ్యంగా పుష్కరాల్లో నదీతీరంలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. వారిపేరు మీద దానధర్మాలు చేస్తారు.
➠ వేసవి సెలవులు ముగిసి కొత్త విద్యా సంవత్సరం మొదలవబోతోంది. నాడు-నేడు ‘విద్య' ఎలా పరిఢవిల్లుతోందో ఒకసారి మననం చేసుకోవాల్సిన సందర్భమిది. అనాదిగా మన దేశం విద్యలకు పుట్టినిల్లు. ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాచీన కాలంలోనే తన విజ్ఞాన జ్యోతులను విశ్వమంతటికీ ప్రసరింపజేసిన ఖ్యాతి దేశానికి ఉంది.