"త్రిదళం త్రిగుణాకారం
త్రినేత్రం చ త్రియాయుధమ్
త్రిజన్మపాప సంహారం
ఏకబిల్వం శివార్పణమ్"

వైరుధ్యాల మధ్య సమన్వయాన్ని సమకూర్చే సూత్రమే శివుని అసలు స్వరూపం. బ్రహ్మ, విష్ణువుల మధ్య చెలరేగిన తగాదాను పరిష్కరించడానికి వారి నడుమ, శివుడు అగ్నిలింగంగా ఉద్భవించాడు. అలా లింగోద్భవం జరిగిన పవిత్రమైన తిథి మహాశివరాత్రి. మార్చి 1 శివరాత్రి సందర్భంగా ఉపవాస, జాగరణలతోనూ అభిషేక, అర్చనలతోనూ పరమశివుడు సంతోషిస్తాడు. జన్మకో శివరాత్రికైనా శివపూజలో తరించాలని ప్రతివారూ భావిస్తారు. శివరాత్రినాడు నోరారా నమశ్శివాయ అంటూ ఒక్క బిల్వపత్రాన్నైనా స్వామికి సమర్పించి, అభిషేకించాలని కోరుకుంటారు. ప్రసిద్ధ శైవక్షేత్రాలన్నింటిలోనూ శివరాత్రికి కల్యాణోత్సవ, రథోత్సవాలు నిర్వహిస్తారు. మనచేత విశేష సేవలందుకునే పరమశివుడు మనకు మనోబలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుందాం. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రి నూతన ఆలయానికి మార్చి 28న కుంభాభిషేకం జరగబోతోంది. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుని, భక్తుల దర్శనం కోసం యాదాద్రి అందుబాటులోకి రాబోతోంది. ఫాల్గుణ మాసం సందర్భంగా యాదాద్రితో పాటు అనేక నృసింహ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరగనున్నాయి. మార్చి మాసంలోనే గురురాఘవేంద్ర జయంతి (9), హోళీ పూర్ణిమ (18) వంటి విశిష్ట సందర్భాలూ వస్తున్నాయి. వసంత ఋతువుకు ముందుగడప వంటి ఫాల్గుణ మాసం మనలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకుందాం.

➠ ఫాల్గుణమాసం శుద్ధ విదియ మంత్రాలయ రాఘవేంద్రస్వామి సన్యాసాశ్రమం స్వీకరించిన రోజు. సప్తమి తిథి వారి జయంతి. 1595 మన్మథ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం నాడు స్వామి ఉదయించారు. ఈ రెండు సందర్భాల నేపధ్యంలో ఏటా మంత్రాలయంలో గురువైభవోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మార్చి 9న గురు రాఘవేంద్రస్వామి జయంతి తిథి వస్తోంది.

➠ భారతీయ సంస్కృతి ఒక రంగుల హరివిల్లు. కాలానికి అనుగుణంగా మనలో ఆనందాలు నింపే పండుగలతో శోభిస్తుంది. వసంత రుతువు ప్రారంభంలో వచ్చేహోళీ అయితే చెప్పనే అక్కరలేదు. వయోభేదాలు మరిచి అందరూ వసంతాలాడి మైమరిచే రంగుల పండుగ హోళీ. ఆనందహేల అయిన హోళీ వెనుక సంప్రదాయ విశేషాలెన్నో ఉన్నాయి.

➠ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సారధ్యంలో.... మార్చి 28న ఆలయానికి మహాకుంభ సంప్రోక్షణం నిర్వహిస్తారు. ఆరేళ్లుగా కేవలం బాలాలయంలో మాత్రమే దర్శనమిస్తున్న స్వామిని... ఈ మహాకుంభ సంప్రోక్షణ తరువాత ప్రధానాలయంలోనే దర్శించుకునే అవకాశం కలగనుంది. అలాగే ఫాల్గుణమాసం సందర్భంగా మార్చి 4 నుంచి 14 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా యాదాద్రిలో జరగనున్నాయి. మార్చి 11న లక్ష్మీనృసింహ కల్యాణోత్సవం ఉంటుంది.

➠ పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన వాయులింగేశ్వరుడు కొలువుదీరిన సద్యోముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

➠ శివరాత్రి అంటే జాగారం. శివరాత్రి అంటే ఉపవాసం. ఆరోజు అభిషేకాలలో మహాశివుడు నానుతూ ఉంటాడు. మారేడు దళాలలో మునిగి ఉంటాడు. విబూది రేఖలలో వెలిగిపోతూ ఉంటాడు. అసలే బోళాశంకరుడు, ఆపైన శివరాత్రి. ఈ పర్వదినాన నిష్ఠనియమాలతో ప్రసన్నం చేసుకుంటే మహాశివుడు వరాలు కురిపిస్తాడు.

➠ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని తెలంగాణ ప్రజలు రాజన్నగా పిలుచుకుంటారు. మహాశివరాత్రికి ఆయనకు కోడెమొక్కులు చెల్లించి సంతాన భాగ్యాలు పొందుతారు. మార్చి 21న వేములవాడ రాజన్న స్వామికి, రాజరాజేశ్వరికి కల్యాణం నిర్వహిస్తారు.

Recent Comments