NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.

ఓం సర్వే భవన్తు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాక్ భవేత్

లోకంలో అందరూ సంతోషంగా ఉందురు గాక. అందరూ ఆరోగ్యవంతులై ఉందురు గాక. అందరూ శుభాలనే పొందెదరు గాక. ఏ ఒక్కరికీ దుఃఖం కలగకుండు గాక... అనే శాంతిమంత్రంతో శ్రీపరాభవ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూల పరిమళాలతో వృక్షజాతి ఉగాదిని ఆహ్వానించడానికి సంసిద్ధంగా ఉంది. కొమ్మకొమ్మకీ మామిడి తోరణాలు, కోయిల పాటలు వసంతానికి పచ్చని గుర్తులై మనకు శుభం పలుకుతున్నాయి. ఉగాది పడుచుల ప్రసాదం కోసం మామిడి పూతలు, వేపపూతలు సిద్ధంగా ఉన్నాయి. అన్ని రుచులనూ సమానంగా ఆస్వాదించాలనీ, అన్ని అనుభవాలు కలిస్తేనే సంపూర్ణ జీవితమనే తాత్త్విక సందేశాన్ని ఉగాది మానవాళికి అందిస్తోంది. ఉత్కంఠ గొలిపే సంవత్సర ఫలితాలను, కందాయ ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఉగాది నాటి ముఖ్య వేడుక. 

శ్రీసీతారాముల పేర్లు చెబితే భరతావని పులకించి పోతుంది. తెలుగుజాతి పరవశంతో మా రామయ్య, మా సీతమ్మ అని గుండెలు నింపుకుంటారు. రామావతార లక్ష్యలక్షణాలలో మానవతే ఇమిడి ఉంది. రాముడిలో దైవత్వాలు అణువంత ఉన్నా అవతార పరమార్థం నెరవేరదు. దుష్టశిక్షణకు పరిపూర్ణ మానవుడు మాత్రమే అర్హుడు. ఈకాలంలో సైతం రాముని ఆదర్శవర్తనాన్ని మానవాళి శిరసున ధరించింది. తెలుగునాట ఏటా ఎందరో దేవుళ్లకి పెళ్లిళ్లు చేస్తారు. అయినా సీతారాముల కల్యాణం ప్రత్యేకం. ఆలయాలలో, ఊరూవాడలలో, పది ఇళ్లు ఉన్న పల్లెల్లో సైతం రాములోరి పెళ్లి పందిళ్లు వెలుస్తాయి. వడపప్పు పానకాలు మేళతాళాలతో సీతారాముల కల్యాణ శోభ వెలిగిపోతుంది. ఈనెల 27న నవమినాడు భద్రాద్రిలోనూ, ఏప్రిల్ 1న పున్నమిపూట ఒంటిమిట్టలోనూ శ్రీరామ కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఆ కల్యాణ దంపతులు మనల్ని నిందుగా దీవించాలని మనసారా కోరుకుందాం.

➠ హోలీ రంగుల పండుగ. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను దేశమంతటా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. ఈ పండుగను ఫాల్గుణమాసం పౌర్ణమి నుంచి, ఫాల్గుణ బహుళ పంచమి నాటి రంగ పంచమి ఉత్సవం దాకా జరుపుతుంటారు.

➠ అయోధ్య.. ఈ పేరు చెప్పగానే ఇప్పుడు ఎవరికైనా నల్లటి బాలరాముడే మదిలో గుర్తుకువస్తాడు. కొత్త కోవెల రూపుదిద్దుకుని అప్పుడే రెండేళ్లు దాటింది. కోట్లాది భక్తులకు దర్శనభాగ్యమూ లభిస్తోంది. అయినప్పటికీ.. రామాయణం ఎన్నిమార్లు విన్నా ఎలాగైతే నిత్యనూతనంగా అనిపిస్తుందో.. అయోధ్యా రాముని విశేషాలు కూడా అంతే. శ్రీరామనవమివేళ ఆ రామచంద్రుని వైభవంతో పులకించండి.

➠ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్ర పౌర్ణమికి ముందు రాత్రి పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట కోదండరామయ్య వైభవం, కల్యాణాన్ని వీక్షించడం భక్తుల పూర్వజన్మ సుకృతమే.

➠ భద్రాచల శ్రీరామచంద్రస్వామికి జరిగే ఉత్సవాలలో విశేష విఖ్యాతి పొందిన ఉత్సవం శ్రీరామనవమి. భద్రాద్రిలో సీతారాములు కల్యాణాన్ని ఎవరు వీక్షిస్తారో వారికి అశ్వమేధయాగఫలితం లభిస్తుందని బ్రహ్మపురాణం చెబుతోంది. అందుకే భద్రాచలంలో జరిగే సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని ఆధారంగా చేసుకుని, తెలుగునేలపై ఉన్న అన్ని శ్రీరామాలయాల్లో కల్యాణోత్సవాలు జరుగుతుంటాయి.

➠ ధర్మ మార్గంలో నడుచుకోవటమే మానవజాతికి శ్రేయస్కరం. ధర్మం ఎలా ఉంటుందో ఆచరించి చూపించటానికే శ్రీరాముడు అవతరించాడు. జీవితంలోని అన్ని కోణాలనూ ధర్మంతో తడిమి చూపించాడు. ధర్మమే మానవుల ప్రవర్తనలో సుగుణ సంపదగా వ్యక్తమవుతుంది. 'రామో విగ్రహవాన్ ధర్మః' అన్నట్లు... ధర్మమే శ్రీరాముడై లోకంలో అవతరించింది.

➠ పూర్వం బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజే ప్రారంభించినట్లు పురాణాలు చెప్తూ వున్నాయి. చాంద్రమానం పాటించే తెలుగు వారికి ఉగాది నూతన సంవత్సర ప్రారంభ దినం. ఉగాది అంటూనే గుర్తుకు వచ్చేది - ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. దీనిని స్వీకరించాలనడంలో జీవితానికి సంబంధించిన సత్యాలు, అనేక ఆరోగ్య విషయాలు దాగి ఉన్నాయి.

Recent Comments