గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం

   సముద్రాన్ని పిల్లకాలవలా దాటినవాడు, రాక్షసులను దోమలవలె నలిపేసినవాడు, రామాయణమనే మహామాలలో రత్నంవలె ప్రకాశించే వాడైన హనుమంతునికి వందనం. చూసి రమ్మంటే కాల్చివచ్చే దక్షతగల కార్యశీలి హనుమంతుడు. అమిత శక్తిసంపన్నుడు, గొప్ప మాటకారి. చిరంజీవిగా, విశిష్టదైవంగా దివ్యకీర్తిని పొందాడు. హనుమంతుని శరణువేడితే అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. అందుకే ఆయన అందరికీ ప్రియమైన దేవుడు. భక్తులకు హనుమజ్జయంతి (మే 14) గొప్ప పర్వదినం. సిందూర సేవలు, వడమాలల సమర్పణలతో హనుమంతుడు సంతృప్తి చెంది, భక్తులను అనుగ్రహిస్తాడు. ఈమాసంలోనే 4న నృసింహజయంతి వస్తోంది. నృసింహుడు ఉగ్రమూర్తి అయినా పరమ కరుణామయుడు. ఆయనను సేవిస్తే శీఘ్రంగా వరమిస్తాడని, నెరవేరని కోరికలంటూ ఏమీ ఉండవని ప్రతీతి.

   ఈ నెలలోనే తెలుగునాట అన్నవరం, ద్వారకా తిరుమల వంటి క్షేత్రాల్లో కల్యాణాలు జరుగుతాయి. అన్నవరం సత్యదేవుడు తెలుగువారి ఇలవేలుపు. భక్తసులభుడు. చిన్నపాటి వ్రతంతోనే కోరిన కోరికలన్నీ కురిపిస్తాడు. చిన్న తిరుపతిగా పేరెన్నిక గన్న దివ్యక్షేత్రం ద్వారకా తిరుమల. ఏటా రెండుసార్లు అక్కడ వార్షిక కల్యాణాలు జరుగుతాయి. కరుణ, త్యాగం కలగలిసి మూర్తీభవించిన రూపం బుద్ధుడు. ఆసియా ఖండపు వెలుగుదీపంగా విఖ్యాతి పొందాడు. మే 5న బుద్ధపూర్ణిమ సందర్భంగా బుద్ధం శరణం గచ్ఛామి అందాం. మన పవిత్రమాసాల్లో ఒకటైన వైశాఖమంటేనే దివ్యమైన పండుగల మాసం. అనేక జాతరలు, ఉత్సవాలు ఈ నెలలోనే చోటు చేసుకోబోతున్నాయి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.

➠ భక్తులందరూ చిన్నతిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమల గర్భాలయంలో ఇద్దరు వేంకటేశ్వర మూర్తులు దర్శనమిస్తారు. అందుకే అక్కడ ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ తిరు కల్యాణోత్సవాల సందర్భంగా వివిధ అలంకారాలు, వాహన సేవలుంటాయి.

➠ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ జగమెరిగిన గురువు. ఆయన సందేశాల్లో లోతైన తాత్త్విక దృష్టితొంగి చూస్తుంటుంది. యోగసూత్రాలను, జీవనకళను బోధిస్తారు. అంతేకాకుండా శాంతి సామరస్యాల కోసం, దేశాలమధ్య మైత్రికోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ దేశవిదేశాల్లో ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

➠ వివాహం, నూతన గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం.... ఇలా ఏ శుభకార్యమైనా సరే సత్యనారాయణ వ్రతం చేయడం తెలుగువారి సంప్రదాయం. వ్రతం చేసినవారికి అంతా శుభమే జరుగుతుందని నమ్మకం. ఆ స్వామి వెలసిన మహిమాన్విత క్షేత్రం అన్నవరంలో ప్రతి వైశాఖమాసంలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. 

➠ దత్తావధూత శ్రీగణపతి సచ్చిదానంద స్వామి. 1942లో మే 26న జన్మించారు. గత ఫిబ్రవరి నెలలోనే స్వామీజీ సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవాలు జరిగాయి. చాంద్రమాన తిథుల ప్రకారం మే 31న ఆయన జన్మదినం వస్తోంది. ఈ సందర్భంగా మైసూరులోని అవధూత దత్తపీఠంలో అనేక క్రతువులు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

➠ వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతిని తెలుగువారు వైభవంగా నిర్వహిస్తారు. సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణలు చేస్తారు. స్వామికి సిందూర లేపనాలు, తమలపాకులతో పూజలు, వడమాల సమర్పణలు ఉంటాయి. హనుమజ్జయంతినాడు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. హనుమంతుని గుణగానం చేసినవారిలో భక్తిశ్రద్ధలు, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి.

➠ గంగ పుట్టిన రోజే దశపాపహర దశమి. దీనినే దశహర అని కూడా పిలుస్తారు. మనలోని సకల కల్మషాలనూ గంగ కడిగివేయగలదని చెబుతారు. అలా గంగ కడిగివేసే పదిరకాలైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉద్దేశించినదే గంగాదశమి. పండుగలకు పెట్టిన పేర్లలో దాగి ఉండే వ్యాకరణ రూపమైన అర్థాన్ని సజావుగా తెలుసుకుంటే మన కర్తవ్యం ఏమిటో చక్కగా బోధపడుతుంది.

Recent Comments