దీపం జ్యోతిః పరంబ్రహ్మ సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

కార్తికంలో దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా, మరొకరు వెలిగించిన దీపాన్ని కాపాడినా మంచిదేనని పండితులు చెబుతారు. కార్తికం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా, శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏకబిల్వం శివార్పణం అంటూ కార్తికంలో ఒక్కమారేడు దళాన్నెనా శివలింగంపై ఉంచితే చాలు. ఓం నమశ్శివాయ చెబుతూ కాసిన్ని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి, భుజించ గలిగితే చాలు. హరోంహర శంకరా అంటూ ఈ నెలరోజుల్లో ఒక్కరోజైనా పుణ్యనదుల్లో మునకవేస్తే చాలు. సమస్త తీర్థాలు, క్షేత్రాలు సేవించిన ఫలం... సాధుసత్పురుషులను దర్శించిన ఫలం అన్నింటినీ మనకు కార్తికమే అందిస్తుంది.

కార్తికంలో ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో కోటిదీపోత్సవాన్ని భక్తిటీవీ ఒక సత్సంప్రదాయంగా నిర్వహిస్తోంది. 2012లో ప్రారంభించిన దీపోత్సవం తెలుగువారికి అభిమాన కార్యక్రమంగా రూపుదాల్చడం మాకు మహాదేవుడు అందించిన వరంగా భావిస్తున్నాం. వివిధ క్షేత్రాలనుంచి ఉత్సవ మూర్తులను వేదికపైకి తీసుకువచ్చి కల్యాణాలు నిర్వహిస్తున్నాం. సత్పురుషుల సన్నిధిలో కోటిదీపాలు ఒకే ప్రాంగణంలో వెలిగేలా చేస్తున్నాం. మహాదేవునికి నృత్య, గీత నీరాజనాలు సమర్పిస్తున్నాం. ఇటువంటి వేడుక న భూతో న భవిష్యతి అన్నంతగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. దీనివెనుక అశేష భక్తజనులు దీవెనలున్నాయి. ఈ ఏడాది కూడా....ఈ సత్సంప్రదాయాన్ని 2024 నవంబర్ 9 నుంచి 25 వరకు... హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి నిర్వహించనున్నాం. భక్తకకోటి అశేషంగా తరలివచ్చి మహాదేవుని ఆశీస్సులను పొందాలని కోరుతున్నాం.

➠ కార్తిక పౌర్ణమికి దీపారాధన అందరూ చేస్తారు. లోగిళ్లలో, ఆలయాలన్నింటిలో ప్రమిదలలో ఆవునేతి దీపాలను పెద్దసంఖ్యలో వెలిగిస్తారు. ఈపౌర్ణమికి దీపోత్సవాలతో పాటు శివాలయాల్లో జ్వాలాతోరణం ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తారు.

➠ ఆద్యంతం ఆధ్యాత్మికం.. అణువణువునా భక్తిభావం.. ప్రతి దీపం ప్రణవ స్వరూపం.. ప్రతి అణువూ శివమయం..! అద్భుతం.. అనిర్వచనీయం..! అపూర్వం... అనితరసాధ్యం..! అరుదైన ఆవిష్కరణం.. కోటిదీపాల తోరణం.. మనసునిండా దైవాన్ని నింపుకున్న భక్తకోటికి ఇదే మా ఆహ్వానం..!

➠ శివ, కేశవులిద్దరికీ ప్రీతి పాత్రమైన కార్తికమాసంలో అత్యంత విశేషమైన ఫలితాలనిచ్చే పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి. కార్తిక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా నిర్వహించుకుంటారు. క్షీరసాగర మధనం ముగిసిన రోజది. ఆనాడే తులసీ దామోదర పూజ నిర్వహిస్తారు. క్షీరాబ్ధి ద్వాదశి మహిమ అపారం.

➠ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. కార్తికంలో ప్రతినిత్యం శ్రీశైలానికి లక్షలాది భక్తులు పోటెత్తుతారు. అటువంటి శ్రీశైల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కల్యాణోత్సవ మూర్తిగా తిలకించే భాగ్యం కలుగుతుంది.

➠ అతిరథ మహారధులెందరో భక్తిటీవీ కోటిదీపోత్సవానికి అతిథులుగా విచ్చేస్తుంటారు. గత సంవత్సరం భారత ప్రధాని నరేంద్రమోదీ కోటిదీపోత్సవంలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశిష్టతను మరింతగా పెంచింది. భక్తి టీవీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మరింతగా పెరిగింది.

➠ భక్తిటీవీ కోటిదీపోత్సవం ఒక అపూర్వ యజ్ఞం. ఈ మహోత్సవానికి భక్తులందరికీ భక్తిటీవీ సాదర స్వాగతం పలుకుతోంది.. ఇది మీ ఉత్సవం. 204 నవంబరు 9 నుంచి నవంబరు 25 వరకు వేదిక: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం సమయం : ప్రతిరోజూ సా. 5.30 నుంచి. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, ఆస్తిక మహాశయులందరికీ ఇదే మా ఆహ్వానం.

Recent Comments