NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

దీపం మన సంస్కృతికి ప్రతీక. దీపం వెలిగించిన చోట స్వయంగా పరమాత్మ నెలకొని ఉంటాడు. బయటి చీకట్లను పోగొట్టినట్లే... మన అంతరంగాలలో ఉన్న చీకట్లను సైతం దీపం తొలగించగలదని మనకు పురాణాలు తెలియ చేస్తున్నాయి. అందుకే దీపాన్ని వెలుగుకు, జ్ఞానానికి కూడా సంకేతాలుగా భావిస్తారు. కార్తికమాసంలో దీపారాధన ప్రధానంగా చేస్తారు. ఈ పవిత్ర కార్తికంలో ఇరు సంధ్యలలోనూ దీపాలను వెలిగిస్తారు. ఇటువంటి దీపసంప్రదాయాన్ని ముందుతరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2012 నుంచి భక్తిటిని దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. 

ఏటా హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవం సంప్రదాయబద్దంగా కొనసాగుతోంది. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలు అందిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందచేస్తున్నారు. అతిరథ మహారథులు అతిథులుగా విచ్చేస్తున్నారు. వేలాదిమంది ప్రజలు ఒక్కసారిగా వెలిగించిన కోటిదీపాలు ప్రపంచంలోని భక్తకోటికి అంతటికీ మధురానుభూతులు పంచిపెడుతుంటాయి. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరి ప్రశంసలూ అందుకుంటూ... కార్తికమాసం అంటేనే భక్తి టీవీ కోటిదీపోత్సవ మాసం అన్నంతగా దిగ్విజయంగా సాగిపోతోంది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 13 వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా... నిర్వహించబోయే భక్తిటివీ కోటిదీపోత్సవానికి మీరందరూ సకుటుంబంగా తరలిరండి. మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి.

➠ కార్తికమాసం వచ్చిందంటే చాలు... భాగ్యనగరంలో జరిగే భక్తిటీవీ కోటిదీపోత్సవ ప్రాంగణంలో కనిపించే సంరంభమిది. పన్నెండు కార్తికమాసాలుగా కార్యక్రమం జరుగుతున్నా ప్రతీ సంవత్సరం పరమాద్భుతమనే పదం తప్పించి మరో మాట లేదు. ఈ ఏడాది సైతం భక్తిటీవీ కోటిదీపోత్సవం మీకు స్వాగతం పలుకుతోంది. కోటిదీపాల వెలుగులు కైలాసశిఖరం వరకు ప్రకాశించేలా కాంతులు ప్రసరిస్తోంది.

➠ 'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం' అన్నట్లు సాధకులకు శివతత్త్వం అరచేతి అద్దంలో కనిపించే కొండ. భక్తులకు సులభసాధ్యుడు మహాదేవుడు. ఏరీతిగా ఆరాధించినా సంతోషించి కోరిన వరాలు కురిపిస్తాడు. మహాయోగులకు, మామూలు మానవులకు కూడా అందుబాటులో ఉంటూ 'శివేన సహమోదతే' అంటూ ఆత్మీయతను, ఆనందాన్ని పంచిపెడతాడు.

➠ కార్తికం సాధనామాసం. దక్షిణాయనంలో వచ్చే ఈ పుణ్యమాసంలో జీవుడు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసిన సాధనకు కేటాయించినది. ఈ సమయంలో శివకేశవ అభేదమైన ఉపాసన చేయాలి. ఇప్పుడు ప్రారంభించిన ఉపాసన ఉత్తరాయణ కాలం నాటికి ఫలవంతం కావాలి. కార్తికం నెల్లాళ్లూ పర్వదినాలే. ఇటువంటి యోగ్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్లీ లభించడం కష్టం.

➠ విశ్వమే దీపం. దాని నుంచి వచ్చే కాంతి పరమాత్మ. దీపంలో అన్నీ దర్శనమిస్తాయి. మూడులోకాలనూ సత్త్వగుణ ప్రధానమైన దేవలోకం, రజోగుణ ప్రధానమైన మానవలోకం, తమోగుణ ప్రధానమైన రాక్షసలోకం కూడా మన శరీరంలోనే, మన మనసులోనే ఉంటాయి. అందుకే దీపం వెలిగించేప్పుడు మూడు పత్తిదారాలను ఒకటిగా చేసి వెలిగించమంటారు.

➠ కార్తిక పౌర్ణమికి దీపారాధన అందరూ చేస్తారు. లోగిళ్లలో, ఆలయాలన్నింటిలో ప్రమిదలలో ఆవునేతి దీపాలను పెద్దసంఖ్యలో వెలిగిస్తారు. ఈపౌర్ణమికి దీపోత్సవాలతో పాటు శివాలయాల్లో జ్వాలాతోరణం ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తారు. 

➠ జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు దీపమే సంకేతం. తమసోమా జ్యోతిర్గమయ అంటుంటాం. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు ప్రయాణం. దుఃఖం నుంచి ఆనందానికి ప్రయాణం. అది దీపం ద్వారానే సాధ్యమవుతుంది. దేవతలు తేజో శరీరులు. దేవతాలోకాలు కాంతిమయాలు. మోక్షమార్గానికి వెళ్లేవారు జ్యోతిమార్గంలో పయనిస్తారంటారు.

➠ భక్తిటీవీ కోటిదీపోత్సవ అపూర్వ యజ్ఞం మరోమారు జరగనుంది. కార్తికమాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ అధినేత శ్రీతుమ్మల నరేంద్రచౌదరి గత పదమూడేళ్లుగా భక్తిటీవీ కోటిదీపోత్సవాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా నిర్విరామంగా ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్నారు. ఎలాంటి రుసుములు లేకుండా... ఏ విధమైన ఆంక్షలు లేకుండా.. కోటిదీపాలు స్వయంగా వెలిగించుకునే ఏకైక పుణ్యప్రద ఉత్సవమిది. మరెక్కడా జరగనటువంటి దివ్యదీపాల సంరంభమిది. ఈ వేదికపైకి ఎందరో సాధుసన్యాసులు, ప్రవచన కర్తలు విచ్చేసి తమ సందేశాలను వినిపిస్తున్నారు. ఎన్నెన్నో దేవతా కల్యాణాలు జరుగుతుంటాయి. ఎంతోమంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తుంటారు. కోట్లాది భక్తుల సాక్షిగా జరిగే మహత్తరమైన వేడుకకు భక్తులందరికీ భక్తిటీవీ సాదర స్వాగతం పలుకుతోంది... ఇది మీ ఉత్సవం. సకలదేవతలను దర్శించే ఉత్సవం. ఈ మహాద్బుత ఉత్సవంలో పాల్గొనేందుకు..... రండి.. తరలిరండి. మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి.

2025 నవంబరు 1 నుంచి నవంబరు 13 వరకు
వేదిక : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం
సమయం : ప్రతిరోజూ సా. 5.30 నుంచి.
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
ఆస్తిక మహాశయులందరికీ ఇదే మా ఆహ్వానం.

Recent Comments