యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమో నమః
దేవీ శరన్నవరాత్రులు (సెప్టెంబర్ 26 - అక్టోబర్ 5) ప్రారంభమయ్యాయి. లోకకంటకుడైన మహిషాసురుని మర్దించి, ఆదిపరాశక్తి లోకకల్యాణాన్ని కలిగించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా వేడుకలను మనం నిర్వహించుకుంటాం. జీవనపోరాటంలో మనకు నిత్యం వినియోగపడే పనిముట్లను పసుపు కుంకుమలతో అలంకరించి, పూజిస్తాం. దసరా వేడుకలు అనేక సరదాలకు ఆటపట్టు. ఈ సందర్భంలో విజయవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబిక వంటి శక్తి క్షేత్రాలన్నీ వేదఘోషలతో, వివిధాలంకారాలతో శోభిస్తుంటాయి. ఈ దసరా తరుణంలోనే తెలంగాణ బతుకమ్మ వేడుకలు (అక్టోబర్ 3 వరకు) జరుపుకుంటారు. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... అని పాటలు పాడుతూ తెలంగాణ ఆడపడుచులు పూలబతుకమ్మలను సేవించుకుంటారు. దసరాతో పాటుగా తిరుమలలో దేవదేవుని బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. తొమ్మిదిరోజులపాటు ప్రతి ఉదయం, సాయంత్రం వాహన సేవలతో మాడవీధులలో ఊరేగి శ్రీవారు భక్తులను ఆనందింప చేస్తారు. 

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ 
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యాదీప నమోస్తుతే 
చీకట్లను పోకార్చి వెలుగులు పంచే దీపావళి (అక్టోబర్ 24) పర్వదినాన్ని ప్రజలంతా ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. 26వ తేదీనుంచి పవిత్ర కార్తికమాసం ప్రవేశిస్తోంది. తెలుగువారికి కార్తికం రాగానే భక్తిటివి కోటిదీపోత్సవం జ్ఞాపకం వస్తుంది. ప్రదోషవేళ మహాదేవుని అభిషేకాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవీదేవతల కల్యాణ మహోత్సవాలు, స్వామీజీలు అనుగ్రహ భాషణలు, ప్రత్యేక ప్రవచనాలు, మన సంస్కృతిని ప్రతిబింబించే నృత్యగీతాల సమాహారంగా కోటిదీపోత్సవాన్ని ఏటా భక్తిటివి నిబద్ధతతో నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14వరకు కోటిదీపోత్సవం జరుగుతుంది. ఎప్పటిలాగే భక్తులంతా పెద్దఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. 

➠ భక్తిటీవీ కోటిదీపోత్సవ వేళ భువిపైకి కైలాసం దిగివస్తుంది. ఆ మహాదేవుని దర్శనార్థం ముక్కోటి దేవతలు విచ్చేస్తుంటారు. కోటి దీపాల కాంతుల్లో ఆ దేవతలంతా తామూ ఒక దివ్వెగా ప్రకాశిస్తుంటారు. ఉత్సవమూర్తుల కల్యాణాలు, నిత్యపూజలు, అభిషేకాలు, పల్లకీ సేవలు, యతిశ్రేష్ఠుల ప్రవచనాల మధ్య భక్తుల మానసాలు కోటికాంతులు విరజిమ్మే వెలుగు జ్యోతులవుతుంటాయి. దీపసంప్రదాయానికి, మన సంస్కృతికి, మన ధార్మిక చైతన్యానికి నిలువెత్తు నీరాజనంగా భక్తి టీవీ కోటిదీపోత్సవం భక్తుల, ప్రేక్షకుల మదిలో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకుంది.

➠ కార్తికమాసం పవిత్రమైనది. శివకేశవులిద్దరినీ ఈ మాసంలో పూజిస్తారు. కార్తికంలో చేసే దేవతారాధన తొందరగా ఫలిస్తుంది. కార్తికం నిజానికి అందరిదీ. స్నాన, భోజన నియమాలు పెద్దలకు ఆరోగ్యాన్ని, పిల్లలకు పండుగ వాతావారణాన్ని తెచ్చిపెడతాయి. కార్తిక శరత్తు ఈ నేలపై ఉన్న జీవులందరికీ సమానమైనదే.

➠ సాయీ అంటే ఓయీ అంటాడు. నువ్వేదిక్కంటే అక్కున డాక్ట ర్ యల్లా ప్ర గడ మల్లి కార్జు న రావు చేర్చుకుంటాడు. వ్యాధులు, బాధలను చెయ్యి పెట్టి తీసేసినట్టు తీసేస్తాడు... అని షిరిడీ సాయి బాబా మీద ఎందరెందరో భక్తులకు అచంచల భక్తి విశ్వాసాలున్నాయి. ఏటా విజయదశమి సందర్భంగా షిరిడీలో సాయి సమాధి మహోత్సవాలు (అక్టోబర్ 5) నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు సాయిమందిరాన్ని దర్శించుకుంటారు.

➠ ప్రకృతినే దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ. బతుకు తెరువును మెరుగు పరిచే అమ్మ కనుక బతుకమ్మ అని పిలిచారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా ఒక జాతరగా బతుకమ్మ పండుగ సాగుతుంది.

➠ నాగులచవితికి నాగన్న... స్నానం సంధ్యలు నాగన్న... పువ్వులు పడగలు నాగన్న... మడిబట్టలతో నాగన్న... అంటూ తెలుగువారు నాగుల చవితి పండుగను నియమ నిష్ఠలతో ఆచరిస్తారు. పుట్టలో పాలుపోసి ఉపవాసవ్రతాలు ఆచరిస్తారు.

➠ దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం చెబుతారు. భారతీయ సంస్కృతి వారసత్వ చిహ్నంగా, అన్నిరకాల విభేదాలకు అతీతంగా జరుపుకొనే పండుగ ఇది. దీపకాంతులతో వెలిగే దేవాలయాలు, గృహ ఆవరణలతో బాణాసంచా పేలుళ్లతో పండుగ నేత్రపర్వంగా ఉంటుంది. దీపావళి వేదకాలం నుంచి అమలులో ఉన్న పండుగ. కార్తికంలో జరిగే విశేష దీపారాధనలకు ముఖద్వారం వంటి పండుగ ఇది.

Recent Comments