దక్షిణాయనంలోని భాద్రపదం పూర్తి కావచ్చింది. భాద్రపద మాస కృష్ణపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. చివరి రోజును మహాలయ అమావాస్య (అక్టోబర్ 2) అంటారు. ఆ రోజునే తెలంగాణలో బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఈ ఋతువులో పూచే పూలను సేకరించి... వర్తులాకారంలో పేర్చుతారు. దానికి బతుకమ్మ అని పేరు. అమ్మవారికి వలెనే ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. అన్ని ఇళ్లనుంచి స్త్రీలు బతుకమ్మలను నెత్తిమీద పెట్టుకుని వస్తారు. ఒక కూడలిలో అందరి బతుకమ్మలను ఉంచి... వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో బతుకమ్మలకు ఆనందం కలిగిస్తారు. అనంతరం పారేనీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తుంటారు. ఇది మహార్నవమి వరకు సాగే వేడుక, ఆశ్వయుజ మాసం మొదటిరోజు నుంచి పదోరోజు వరకు దసరా ఉత్సవాలు.
జగన్మాతను విశేషంగా ఆరాధించే దసరా ఉత్సవాలనే శరన్నవరాత్రులు అంటారు. దసరాలతో శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది. ఆరు ఋతువులు ప్రారంభకాలాన్ని మనవారు యముని కోరల వంటి కాలాలు అంటారు. ఆ సమయంలో ప్రత్యేక పూజలు చేయడం, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దసరాల్లో మూల నక్షత్రం నాడు సరస్వతీపూజ నిర్వహిస్తారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ముఖ్యమైన పండుగలు. దసరా రోజుల్లో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అన్ని శక్తి క్షేత్రాల్లోనూ బ్రహ్మోత్సవాలు, విశేషోత్సవాలు జరుగుతుంటాయి. దసరా రోజుల్లో కొందరు దీక్షగా పూజలు చేస్తారు. మరికొందరు శక్తి ఆలయాలను సందర్శిస్తారు. ఎలా పూజించినా జగన్మాత కరుణను అందరికీ లభిస్తుంది. ఆశ్వయుజమాసం చివరిలో దీపావళి అమావాస్య (అక్టోబర్ 31) వస్తుంది. బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పండుగ అంటే పెద్దలకు. పిల్లలకూ కూడా ఇష్టమే. ఈ దీపావళిని శబ్దకాలుష్యానికి, వాయుకాలుష్యానికి దూరంగా ఆనందంగా జరుపుకుందాం.
➠ దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఆయుధం దీపమే. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో దివ్వెల పండగ అని, మరికొన్ని ప్రాంతాల్లో దివిటీల పండగ అని పిలుస్తారు. దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి ఆనందంగా జరుపుకునే జాతీయ పండుగల్లో దీపావళికి ప్రత్యేకస్థానం ఉంది.
➠ బాబా సాధారణ యోగిపుంగవుడు కాడు. యోగులకే యోగి. ఆయన అవతారం కలియుగ నియమాలను భక్తులకు అనువుగా మార్చేందుకే వచ్చింది. భక్తి, యోగ మార్గాలను సులభతరం చేసేందుకే వచ్చింది. ఇదే విషయాన్ని భారతీయ యోగులందరో పలుమార్లు నిరూపించారు. 1918 అక్టోబర్ 15న సరిగ్గా విజయదశమినాడే ఆయన సమాధి పొందారు.
➠ దసరా రోజుల్లో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవం అంటే అతిపెద్ద ఉత్సవం. పూర్వం బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవాలని ఆగమ పండితులు చెబుతుంటారు. ధ్వజారోహణం జరిగినప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలుంటాయి. 12వ తేదీన విజయదశమినాడు చక్రస్నానంతో తిరుమల బ్రహ్మోత్సవాలు సంపూర్ణమవుతాయి.
➠ బతుకమ్మ జీవన వైవిధ్యానికి ప్రతీక. బతుకు పోరాటానికి సంకేతం. ఆటపాటల పల్లకి. శ్రమైక జీవన సౌందర్యం. పంటలు సమృద్ధిగా పండాలని లోకం సుభిక్షంగా ఉండాలని బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సందడి చేస్తారు. అందరూ క్షేమంగా ఆనందంగా ఉండాలి. బతుకు - బతకనివ్వు అనే సందేశాన్ని తెలియచేసేదే బతుకమ్మ పండుగ.
➠ లోకాలనేలే చల్లని తల్లి కనకదుర్గమ్మ. దసరా పండుగ నేపధ్యంలో కనకదుర్గమ్మను దర్శించడానికి అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వెల్లువెత్తుతారు. ఎన్నో పురాణ, ఇతిహాస విశేషాలు, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలకు నిలయమైన బెజవాడ కనకదుర్గమ్మ వైభవాన్ని కనులారా దర్శించి తరిస్తారు.
➠ దసరాల్లో మూలనక్షత్రంనాడు సరస్వతీ పూజ చేస్తారు. మహిషాసుర వధలో భాగంగా అతడి సైన్యంలోని శుంభుడనే రాక్షసుణ్ణి మహాసరస్వతి మట్టుబెట్టింది. వేదకాలం నుంచి సరస్వతీ ఆరాధన భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది. కోరి పూజించేవారికి సరస్వతి చదువులే కాదు, సమస్తమూ ఇస్తుంది.