NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
శరత్కాలమిది... ఇందులో ఆశ్వయుజ, కార్తికమాసాలు రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. ఆశ్వయుజ మాసం సందర్భంగా ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు మహోత్సాహంగా సాగుతున్నాయి. అమ్మవారి ఆలయాలన్నీ వెలుగులతో, వేదమంత్రాలతో వెలిగిపోతున్నాయి. అమ్మవారు రోజుకో అలంకారంతో శోభిస్తున్నారు. వివిధ అవతారాలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. విజయదశమి (అక్టోబర్ 2) నాటికి ఈ ఉత్సవాలు పతాకస్థాయికి చేరుకుంటాయి. ఆశ్వయుజమాసం చివరిలో దీపావళి పర్వదినం అక్టోబర్ 20న రానున్నది. దివ్యదీపావళి... చీకట్లు పోకార్చి, వెలుగులు పూయించే ఆనందకేళి. ప్రజలందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరియగా బాణసంచా కాలుస్తూ సందడిగా పండగ జరుపుకుంటారు. ఈ దీపావళి అందరికీ ఆనందాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కాంక్షిస్తున్నాము.
ఇక కార్తికం హరిహరులకు ప్రీతిపాత్రమైన మాసం. శివుని వంటి దైవం, గంగకంటే పవిత్రమైన నది, కార్తికం వంటి పుణ్యమాసం మరొకటి లేవు అని పెద్దలు చెబుతుంటారు. ఆహ్లాదకరమైన ఈ కార్తికంలో శివాలయాల్లో ధ్వజస్తంభాలపై ఆకాశదీపాలు కొలువు తీరతాయి. ప్రతి గడపలోనూ సంధ్యాదీపాలు పలకరిస్తాయి. అసమానతలు, అరమరికలు లేకుండా ఒక చెట్టునీడన అందరూ కలిసిమెలిసి భోజనాలు చేయడం కార్తికంలో కనిపించే గొప్ప సంప్రదాయం. ఇక కార్తికంలో స్నానం, దీపారాధనం ప్రత్యేక విధులు. కార్తికంలో వెలిగించే సంధ్యాదీపం మనలోని అజ్ఞానపు చీకట్లను పోగొడుతుంది. కార్తికంలో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. అటువంటి పుణ్యఫలాలు మనందరికీ విరివిగా లభించాలని కోరుకుందాము. చెప్పాలంటే కార్తికం దీక్షామాసం. అయ్యప్ప స్వాములు చన్నీళ్ల స్నానాలతో, ఒంటిపొద్దు భోజనాలతో కార్తికాన్ని మరింత పవిత్రంగా చేస్తారు. 'స్వామియే శరణం అయ్యప్పా' అంటూ భజనలు కొనసాగుతాయి. ఆ స్వాముల దీక్షలు సఫలీకృతం కావాలని కోరుకుందాం.
➠ షిర్డీలో విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆ రోజే 1918లో, శ్రీసాయిబాబా మహాసమాధి చెందారు. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ పండుగ రోజున విశేషమైన భజనలు, పారాయణలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి.
➠ కళల కాణాచి విజయనగరంలో భక్తులకు కొంగుబంగారమై భాసిల్లుతోంది పైడిమాంబ. విజయదశమి తరువాత వచ్చే మంగళవారం నాడు పైడితల్లికి సిరిమానోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. విజయనగరంలో తొలిసారి సిరిమానోత్సవం 1758లో నిర్వహించారు.
➠ మధ్వాచార్యుడు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అద్వైత, విశిష్టాద్వైతాల తరువాత జగత్తు, బ్రహ్మము రెండూ సత్యమే అన్న ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యుని వల్ల వెలుగులోనికి వచ్చింది. విజయదశమి మరునాడు మధ్వాచార్యుని జయంతిగా మాధ్వులు నిర్వహించుకుంటారు.
➠ కార్తికం అయ్యప్ప దీక్షల సమయం. దీక్షలన్నింటిలోనూ అయ్యప్ప దీక్ష కఠిన నియమాలతో కూడి ఉంటుంది. నలభై రోజుల పాటు అయ్యప్ప దీక్షలో గడిపే వారికి అలుపెరుగని ఉత్సాహాన్ని, జీవన గమనాన్ని సరైన దిశలో ముందుకు ఉరికించగల ఉత్తేజాన్ని అందించగల శక్తి ఈ దీక్షకు ఉంది.
➠ మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది. మైసూరు ప్యాలస్ లో అమ్మవారు స్వర్ణ అంబారీలో ఊరేగుతుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
➠ నరకచతుర్దశి, దీపావళి రెండురోజుల పండుగగానే నేటితరానికి ఈ పర్వం తెలుసు. త్రయోదశినాడు లక్ష్మీపూజా తిథియైన ధనద త్రయోదశి, చతుర్దశినాడు నరకచతుర్దశి, అమావాస్యనాడు దీపావళీ పర్వం, కార్తిక శుద్ధ ప్రతిపదా దినాన బలిపాడ్యమి, విదియ నాడు సహోదర ప్రేమకు ప్రతీకయైన భగినీహస్త భోజనం అనే పండుగ క్రమంగా వస్తాయి.