NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
విశ్వమంతా ఆవరించి ఉన్న పంచభూతాలలోనూ శక్తిరూపంలో జగన్మాత కొలువై ఉంటుంది. అటువంటి తల్లిని దేవీ నవరాత్రుల పేరిట భక్తిపూర్వకంగా ఆరాధిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాలవారూ భక్తిభావంతో ఎదురుచూసే పండుగ దసరా. అక్టోబర్ 11 నుంచి 20 వరకు పదిరోజులు నవదుర్గల అలంకారాలతో, ఆరాధనలతో, జరగింపులతో దసరా విలక్షణంగా సాగుతుంది. మహిషాసురుడి మీద మహాదుర్గ పోరు సాగించి ఆఖరుకు విజయదుర్గగా జేజేలతో పూజలు అందుకుంటుంది. చెడుపై మంచిని సాధించిన గెలుపుకు ప్రతీకగా విజయదశమిని అభివర్ణిస్తారు. ఆయుధ పూజ, అలయ్ బలయ్, బొమ్మల కొలువులు దసరాకు ప్రత్యేకించినవి. రామలీలా, దాండియా పంటివి దసరా సరదాను పెంచుతాయి. పాలపిట్టను దర్శించి, జమ్మి ఆకులను పెద్దలకు సమర్పించి సమస్కరించడం ఈ పండుగ ఆనవాయితీ.
పితరులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహాలయ అమావాస్య అక్టోబర్ 10న వస్తోంది. గతించిన పెద్దలను తలుచుకుని, వారికి తిలతర్పణలు విడిచే పవిత్ర సమయమిది. ఆనాడే తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. బంగారు బతుకమ్మ ఉయ్యాలో... ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా... అని పాటలు పాడుతూ. తెలంగాణ ఆడపడుచులు పూలబతుకమ్మలను సేవించుకుంటారు. తీరొక్క పువ్వుతో తెలంగాణ మాగాణం పూలపుంతలా శోభిస్తుంది. అక్టోబర్ 12 నుంచి తిరుమలలో దేవదేవుని బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. తొమ్మిదిరోజుల పాటు ప్రతి ఉదయం, సాయంత్రం వాహన సేవలతో మాడవీధులలో ఊరేగి శ్రీవారు భక్తులను ఆనందింప చేస్తారు. అక్టోబర్ 27న తెలుగునాట అత్యంత ప్రసిద్ధి పొందిన విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం జరగనుంది. ఇవే కాకుండా ఈ మాసంలో అనేక క్షేత్రాల్లో జాతరలు, ఉత్సవాలు జరగనున్నాయి. పూజలందుకునే ఆ దేవీదేవతలందరూ మనందరి ఆకాంక్షలనూ పరిపూర్ణం చేయాలని కోరుకుంటున్నాం.
➠ నవరాత్రి ఉత్సవాల పేరు వినగానే నూతనోత్తేజంతో మనసు ముప్పిరిగొంటుంది. భక్తి సమ్మిళితమైన ఉత్సాహ వాతావరణం ఆ తొమ్మిది రోజులూ ఉంటుంది. ఓ అద్భుత దివ్యానుభూతికి నిదర్శనమై నిలుస్తుంది. శరన్నవరాత్రుల్లో కనీసం మూడురోజులైనా దేవీపూజ చేస్తే ఏడాది మొత్తం దేవిని ఆరాధించిన ఫలం దక్కుతుంది. దసరాల్లో ప్రధానంగా పూజించే దుర్గామాత తత్త్వం తెలుసుకుందాం...
➠ లోకాలనేలే చల్లని తల్లి కనకదుర్గమ్మ. దసరా పండుగ నేపధ్యంలో కనకదుర్గమ్మను దర్శించడానికి అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వెల్లువెత్తుతారు. ఎన్నో పురాణ, ఇతిహాస విశేషాలు, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలకు నిలయమైన బెజవాడ కనకదుర్గమ్మ వైభవాన్ని కనులారా దర్శించి తరిస్తారు.
➠ శ్రీశైలం భ్రమరాంబిక అష్టాదశ శక్తి పీఠాలలో ఆరో శక్తిపీఠం. కార్తికం, శివరాత్రి వంటి శివసంబంధమైన సందర్భాల్లో దర్శించినట్లే దసరావేళల్లో ప్రత్యేకంగా శ్రీశైలాన్ని దర్శించాలి. భ్రమరాంబకు జరిగే అలంకారాలు, వాహన సేవలు చూసి తరించాలి.
➠ ఏడుకొండలవాడు ఇంటింటి దైవం. తిరుమల కొండపై ప్రతిఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒకరకంగా వీటిని శ్రీవారి పుట్టినరోజు ఉత్సవాలు అని కూడా చెప్పవచ్చు. శ్రీహరి నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో పూర్తయ్యేలా కన్యామాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ వేళ వేంకటేశ్వరుడు ఇద్దరు దేవేరులతో వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తకోటిని తరింపచేస్తాడు.
➠ విజయనగరం పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. 1757 నాటి చారిత్రాత్మక బొబ్బిలియుద్ధం నేపధ్యంలో పైడితల్లి అవతరణ జరిగింది. ఆమె విజయనగర రాజులైన పూసపాటి వారి వంశానికి చెందినది. ఆత్మత్యాగం తరువాత దేవతగా అవతరించింది. ప్రతి సంవత్సరం దసరా తరువాత పైడితల్లి సిరిమానోత్సవం భక్తజనుల కోలాహలం మధ్య వైభవంగా జరుగుతుంది.
➠ నా చరితం తెరిచిన పుస్తకం. ప్రతి పుటలో మానవ జీవన పరమార్థ సత్యం గోచరమవుతుంది. ప్రతి వాక్యంలో ఆధ్యాత్మిక ప్రబోధం కనిపిస్తుంది. ప్రతి అక్షరంలో నేను చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తాను. ఆశీర్వదిస్తాను. నేను సూచించిన బాటలో మీరు పయనిస్తే మీ జీవితాలు చరితార్థమవుతాయి.
➠ బతుకమ్మ పూలశిల్పం. బతుకమ్మ సహజసౌందర్య ప్రతీక. తీరొక్క పూలతో బతుకమ్మను చేయడం జానపదుల హస్తకళకు ఎత్తిన జెండా. బతుకమ్మను చేసుకుంటూ పల్లెప్రజలు మురిసిపోతుంటారు. గుళ్ళో కాదు ఇండ్లలోనే నిలుపుకున్న అమ్మదేవత బతుకమ్మ. వేలయేండ్ల మానవ సంస్కృతికి పట్టిన పూలహారతి. బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ ప్రకటనగా గౌరవం అందుకున్నది.