శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

నాలుగు చేతులు కలిగినవాడు, తెల్లని శరీరకాంతి కలిగినవాడు, తెల్లని వస్త్రాలను ధరించినవాడు, సర్వవ్యాపకుడు, ప్రసన్నవదనుడు అయిన వినాయకుని సర్వవిఘ్నాలు తొలగిపోవడం కోసం ధ్యానించాలి. జీవితాలను చెల్లాచెదరు చేస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పూర్తిస్థాయిలో కొనసాగనివ్వకుండా విఘ్నాలు కలిగిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తిగా తొలగించమని గణపతిని ధ్యానిద్దాం. ప్రకృతి ప్రియుడైన గణపతి విపత్తుల నుంచి మనల్ని బయట పడేయాలని కోరుకుంటూ వినాయక చవితిని (సెప్టెంబర్ 10) జరుపుకుందాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మూతపడ్డవన్నీ ఇప్పుడిప్పుడే ఒక్కటొక్కటిగా తెరుచుకుంటున్నాయి. మరోపక్క థర్డ్ వేవ్ పొంచి ఉందనే హెచ్చరికలు కూడా వినవస్తున్న నేపధ్యంలో సమాజంలోని ప్రతిఒక్కరూ బాధ్యతగా మసలుకోవాల్సి  ఉంది. అందుకే పండుగల నిర్వహణ, క్షేత్ర సందర్శనలు మరికొంత కాలం వాయిదా వేసుకోవడం సర్వధా శ్రేయస్కరం. 

భాద్రపద పౌర్ణమి మరునాటి నుంచి అంటే ఈనెల 21 నుంచి మహాలయ పక్షం ఆరంభమవుతోంది. పితృదేవతలను స్మరిస్తూ తర్పణలు విడిచే, శ్రాద్ధకర్మలు నిర్వహించే సందర్భమిది. ఈ మాసంలోనే రెండుసార్లు (సెప్టెంబర్ 4, 18 తేదీలు) శనిత్రయోదశి వస్తున్నది. వినాయకుని పరంగానే నిర్వహించుకునే ఉండ్రాళ్ల తద్దె (23వ తేదీ), ద్వైతసిద్ధాంత వేత్త మధ్వాచార్యుని సంస్మరించుకునే మధ్వాష్టమి వంటి విశిష్ట సందర్భాలు ఈ నెలలోనే రానున్నాయి. ముఖ్యమైన  ఆరాధనలన్నింటినీ నియమాలను అనుసరించి నిర్వహించుకుందాం. వినాయకచవితి సందర్భంగా ప్రతిఒక్కరూ తమంతతామే నిర్వహించుకునేందుకు వీలుగా సమగ్రమైన వినాయకపూజా విధానాన్ని ఈ సంచికతోపాటే అందిస్తున్నాం. అందుకోండి.

➠ భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకూ పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు. ఈ పదిహేను రోజులూ పితృదేవతారాధనకు సంబంధించినవే. ఈనెల 21వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభమవుతోంది. ఈ మహాలయ పక్షాలను ఇంటివద్ద నిర్వర్తించవచ్చు. మహాలయ అమావాస్య (అక్టోబర్ 6) నాడు ఎవరైనా తమ పితృదేవతలకు శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.

➠ ఈ సమస్త సృష్టికి మూలాధారమైన శక్తి స్వరూపిణి, జగన్మాత. గ్రామీణులతో జాతరలు జరిపించుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామదేవతలకు జాతరలను జరిపించడం అనాది నుంచీ వస్తున్న ఆచారం. అటువంటి జాతరల్లో ప్రసిద్ధమైన జాతర వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర. 

➠ మధ్వాచార్యులు ద్వైతసిద్ధాంతాన్ని ప్రవచించారు. ఆ సిద్ధాంతం ప్రకారం జీవుడు వేరు, బ్రహ్మం వేరు. జడ జగత్తు, జీవుడు మిథ్య కాదు. పరబ్రహ్మం ఎంత సత్యమో - జీవుడు, జగత్తు కూడా అంతే సత్యం. మధ్వాచార్యులు ఉడుపిలోని అనంతేశ్వరాలయంలో భక్తులందరి సమక్షంలోనూ ఐతరేయోపనిషత్తుకు భాష్యాన్ని చెబుతూ పూలవాన మధ్య అంతర్ధానమయ్యారు. అదే భాద్రపద బహుళాష్టమి... మధ్వాష్టమి.

➠ శ్రీదత్తుడు గురుసార్వభౌముడు. ఆయనే తొలి అవధూత. మానవులకు జ్ఞాన ప్రాప్తిని, మోక్షాన్ని ప్రసాదించడమే దత్తావతారుని లక్ష్యం. కృతయుగంలోనే ఆయన ఉన్నాడు. తరువాతి కాలంలో ఎంతోమంది శ్రీదత్తుని ఉపాసించి జన్మ తరింపచేసుకున్నారు. దత్తునికి స్మర్తృగామి అనిపేరు. అంటే స్మరించినంత మాత్రానే భక్తుల కోర్కెలు తీరుస్తాడు. కలియుగంలో దత్తుని అవతారమే శ్రీపాద శ్రీవల్లభులు. 

➠ మాతృశక్తికి ఎల్లలు లేవు. ప్రకృతి, సమస్త జంతుజాలం, వృక్షాదులు అన్నింటిలో ఆ శక్తియే నిండివుంది. మనం గుర్తించినా గుర్తించక పోయినా మనచుట్టూ ఆమె ఉంది. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే అందరిలోనూ అన్నింటా అమ్మను చూడగలుగుతాం. అందరినీ అన్నింటినీ మనకు వలెనే ప్రేమించగలుగుతాం అంటారు మాతా అమృతానందమయి. ఆమె మనసు అమృతం. వాక్కు అమృతం. ఆర్తులకు, ఆపన్నులకు అమృతహస్తం అందించి... సుధలు పంచడానికే పుట్టిన పున్నమి జాబిలి మాతా అమృతానందమయి.

➠ సద్గురు జగ్గీవాసుదేవ్ స్థాపించిన ఈశా ఫౌండేషన్ ఒక సేవాకేంద్రం. శాంతి మంత్రం. సద్గురు సంకల్పించిన వినూత్న ప్రయోగం. అలజడితో సతమతమవుతున్న ఆధునిక జీవన సరళికి ఒక గొప్ప సాంత్వన. కోయంబత్తూరు ఈశా ఫౌండేషన్ ప్రాంగణంలో ఆకాశమే మతం. కొండలు, వాగులు వంకలే వర్ణాలు. అక్కడ తారతమ్యాలు లేని విశాల విశ్వమే ఉంది. కొండల్లో ప్రణవనాదం వినవస్తూ ఉంటుంది. జగ్గీవాసుదేవ్ స్థాపించిన ఈశాఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Recent Comments