వినాయక నవరాత్రి మహోత్సవాలు వేడుకగా ఆగస్టు 31న ప్రారంభమౌతాయి. వాడవాడలా పందిళ్లువేసి, రకరకాల మట్టివినాయక ప్రతిమలను నెలకొల్పి భక్తజనం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదిరోజులపాటు పందిళ్లలో నెలకొనే గజాననుడు అందరినీ చల్లగా ఆశీర్వదిస్తాడు. అనంతపద్మనాభ చతుర్దశి సందర్భంగా సెప్టెంబర్ 9న వినాయక నిమజ్జనం జరుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమినుంచి పితృదేవతలను స్మరించుకునే మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. 25వ తేదీ అమావాస్యనాడు మహాలయ అమావాస్య. తీర్థక్షేత్రాలలోనూ ఇళ్లవద్ద కూడా పితృదేవతలకు తర్పణలు, శ్రాద్ధవిధులు పాటించి పితృగణాల ఆశీస్సులు అందుకుందాం. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ వాతావరణం నెలకొంటుంది. మహిళలంతా వినవేడుకగా జానపదాలు పాడుతారు. కనవేడుకగా ఆటలాడతారు. నీళ్లలో బతుకమ్మలను సాగనంపుతారు.
సెప్టెంబర్ 26 నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. దేశంలోని శక్తిక్షేత్రాలన్నీ వివిధ అలంకారాలతో అమ్మ దర్శనాన్ని అనుగ్రహిస్తాయి. తెలుగునాట సుప్రసిద్ధ క్షేత్రాలైన ఇంద్రకీలాద్రి కనకదుర్గ, వరంగల్ భద్రకాళి, అలంపూర్ జోగులాంబ, శ్రీశైలం భ్రమరాంబిక ఆలయాల్లో వాహన సేవలు, అలంకారాలు భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతాయి. నవరాత్రి వ్రతాన్ని పాటించే వారందరికీ ఈ ఆశ్వయుజం కోరిన కోరికలన్నీ అందించాలని వేడుకుందాం. సెప్టెంబర్ 27నుంచి తిరుమల గిరివాసుని బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆశ్వయుజ, కార్తికాలు యముని కోరల వంటివని పెద్దలు చెబుతారు. సహజంగానే అనారోగ్యాన్ని కలుగచేసే వాతావరణానికి తోడు, కరోనా మహమ్మారి కూడా ఇంకా పూర్తిగా నశించని స్థితిలో నేడు మనం జీవనం సాగిస్తున్నాం. మనందరికీ ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని కోరుకుందాం.
➠ అమృతానందమయి పూర్వాశ్రమ నామం సుధామణి ఇడమన్నేల్. 1953లో సెప్టెంబర్ 24న కేరళలోని ఒక నిరుపేద మత్స్యకార కుటుంబంలో జన్మించింది. చిన్ననాటినుండి సుధామణి విలక్షణంగా ఉండేది. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చడమే గొప్ప తపస్సుగా భావిస్తారామె. శ్రీకృష్ణ భక్తురాలు. పరిపూర్ణమైన ఆనందాన్ని తాను అనుభవిస్తూ, ఆ ఆనందాన్ని నలుగురికీ పంచుతూ ఆనందమయి అయ్యింది.
➠ భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు. ఈనెల 11వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభమవుతోంది. వీటిలో ఎవరి పితృతిథినాడు వారు శ్రాద్ధాదులను ఇంటివద్ద నిర్వర్తించవచ్చు. పితృతిథినాడు సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.
➠ పూల పండుగ ఇది. ఆటపాటల పర్వమిది. ప్రకృతి ఆరాధన పర్వం బతుకమ్మ. మహాలయ అమావాస్యతో సెప్టెంబర్ 25న ఆరంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు దుర్గాష్టమి వరకు సాగుతాయి. బతుకమ్మ సంబురాల వేళ తెలంగాణాలోని పల్లె పల్లె పూల అలంకరణలతో, పడతుల ఆటపాటలతో, నిమజ్జనవేళ జనసందోహంతో పరిమళిస్తుంది. పిల్లాజెల్లాతో కలసి బతుకమ్మ వద్ద ఆడిపాడే ప్రతి మహిళా ప్రకృతి ప్రతిబింబంగా శోభిస్తుంది.
➠ కాణిపాకం వినాయకుడు స్వయంభువు. సుమారు వెయ్యేళ్ల క్రిందట బావి తవ్వుతుండగా బయటపడ్డాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా స్వామి కొంచెంకొంచెం పెరుగుతూనే ఉన్నాడు. కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత దైవంగా కాణిపాక వరసిద్ధి వినాయకుడు ప్రసిద్ధి పొందాడు. ఏటా వినాయక చవితికి ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
➠ మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా తొమ్మిదిరోజులు పూజలందుకుని జగన్మాత పదోనాడు విజయోత్సవాలలో అపరాజితాదేవిగా ఊరేగుతుంది. తొమ్మిదిరోజులూ భయంకరమైన రాక్షసులతో పోరాడి, వారిని మట్టుపెట్టి సర్వలోకాలకు శాంతిని సమకూర్చింది జగజ్జనని. ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి దశమిదాకా నవరాత్రవ్రతంగా శ్రీమాతను ప్రజలు కొలుస్తారు. ఆసేతుహిమాచలం జరుపుకునే పెద్దపండుగ దసరా.
➠ కరోనా నేపధ్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల శోభ గత రెండేళ్లుగా కనుమరుగైంది. ఈ ఏడాది పెద్దఎత్తున వినాయక విగ్రహాలను నెలకొల్పి, అంగరంగ వైభవంగా నవరాత్రోత్సవాలను నిర్వహించడానికి భక్తజనం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిమజ్జనోత్సవాల కోలాహలం కూడా అంతేస్థాయిలో ఉంటుంది.