శుంక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

వినాయకుడు ఆదిదేవుడు. ఆయన చవితిపూట (సెప్టెంబర్ 7) మనందరి పూజలు అందుకుని, మనకు విజయాలు చేకూర్చడానికి విచ్చేస్తున్నాడు. కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించలేం. భక్తిశ్రద్ధలతో, చిత్తశుద్ధితో సమర్పించే గరికపోచకే ఆయస ప్రసన్నుడవుతాడు. మనకు అన్నీ ఇచ్చి, మననుంచి ఏమీ ఆశించని గొప్పవాడు భగవంతుడు. ఆయన మనకు ఈ జీవితం అనే అరుదైన అవకాశమిచ్చాడు. అందుకే మనం నిత్యం వివిధ స్తోత్రాలు, పూజలు చేయడం ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం. మనకు నేలా నింగి నీరూ నిప్పూ వీచే గాలీ అన్నీ దైవాలే. ప్రకృతినే పరమేశ్వరునికి మరోరూపంగా భావించే సంప్రదాయం మనది. అటువంటి ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా ప్రవర్తించడం భక్తిపరులుగా మనందరి కర్తవ్యం. మన ఆచారాలు, సంప్రదాయాల్లో కాలుష్యానికి ఏమాత్రం తావు లేదు. భగవంతుడు ప్రకృతి స్వరూపుడు. ఆయనను పర్యావరణానికి చెడు చేసే కృత్రిమ పదార్థాలతో రూపొందించడం, పూజించడం ద్రోహం. అందుకే విగ్రహాల పరిమాణాలతో, రంగుహంగులతో మనం పోటీపడవద్దు. సహజమైన మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం.

దక్షిణాయనంలో వచ్చే తొలి పండుగ వినాయక చవితి. అంతకుముందు వచ్చిన ఆషాఢ, శ్రవణాలు వర్ణాలతో.... వరలక్ష్మీ వ్రతాలతో గడిచిపోతుంది. భాద్రపదమాసంలో వినాయక చవితితోనే మన పండుగలు మొదలవుతాయి. ఈ మాసంలో వచ్చే బహుళ పక్షాన్ని మహాలయ పక్షం అని పిలుస్తారు. ఆ సమయంలో పితృదేవతలను ఆరాధిస్తుంటారు. గతించిన పెద్దలందరికీ పిండప్రదానాలు, తర్పణాలు తప్పక చేస్తుంటారు. ఈ భాద్రపదంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలుండవు. వివిధ ఆలయాల్లో ఉత్సవాలు, జాతరలు జరుగుతుంటాయి. ఈ మాసం భక్తిపత్రికలో అందరూ ఇంటిలో స్వయంగా ఆచరించుకునేందుకు వీలుగా రూపొందించిన వినాయక పూజావిధానాన్ని అందిస్తున్నాం. భక్తిపత్రిక సాయంతో మీరంతా ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిస్తున్నాం.

➠ భాద్రపదమాసంలో శుద్ధ చతుర్దశి తిథినాడు వినాయక నిమజ్జనం జరుగుతుంది. నవరాత్రులు పూర్తవుతాయి. ఆ రోజునే విష్ణుభక్తులు అనంత పద్మనాభ చతుర్దశిగా నిర్వహించుకుంటారు.

➠ నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు అమావాస్యలున్నా వాటిలో శ్రేష్ఠమైనది మహాలయ అమావాస్య. ఈనెల 30వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభమవుతోంది. ఈ మహాలయ పక్షాలను ఇంటివద్ద నిర్వర్తించవచ్చు. మహాలయ అమావాస్య (అక్టోబర్ 2) నాడు ఎవరైనా తమ పితృదేవతలకు శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.

➠ వినాయక చవితి మన సంస్కృతికి ప్రతీక. ప్రతి ఇంటిలోనూ పసుపుతో, బంకమట్టితో వినాయకుణ్ణి రూపొందించి పూజిస్తారు. పళ్లూ కాయలతో పాలవెల్లిని తయారు చేస్తారు. దానికింద వినాయక ప్రతిమను ఏర్పాటు చేస్తారు. కొండంత దేవుడికి కొండంత పత్రి తేగలమా అనుకుంటూనే ప్రతి ఒక్కరూ యధాశక్తిగా పత్రి సేకరించి వినాయక పూజ నిర్వహిస్తారు.

➠ కాణిపాకం వినాయక స్వామిని సత్యప్రమాణాల దేవుడు అంటాడు. ఒక బావిలో లభించిన ఈ వినాయకుని విగ్రహం పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. వినాయక చవితికి కాణిపాకంలో గ్రామోత్సవం జరుగుతుంది. మరునాటినుంచి అంగరంగవైభోగంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా వాహన సేవలు, కల్యాణోత్సవం, రథోత్సవం నిర్వహిస్తారు.

➠ 'సద్గురు'గా ప్రసిద్ధులైన జగ్గీవాసుదేవ్ 1957 సెప్టెంబర్ 3వ తేదీన మైసూర్ నగరంలో జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు సమీపంలోని వెల్లంగిరి పర్వతాల వద్ద ఆయన స్థాపించిన ధ్యానలింగం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆయన ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు. ఆ సంస్థ లాభాపేక్ష లేకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

➠ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినంగా జరుపుకొంటాం. ఆయన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. తన జీవితకాలంలో ఎన్నో తాత్త్విక రచనలు చేశారు. వాటిలో ది ప్రజెంట్ క్రైసిస్ అఫ్ ఫెయిత్, రికవరీ అఫ్ ఫెయిత్ అనే రెండు చిన్ని పుస్తకాలూ ఆనాడు మేధావి వర్గాల్లో విస్తృత చర్చను లేవదీశాయి.

Recent Comments