NOTE : ఇది కేవలం ఆన్‌లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.

యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఆశ్వయుజ మాసంలోని తొలి పది రోజులూ దసరా ఉత్సవాలు అంగరంగవైభోగంగా జరుగుతాయి. అమ్మలగన్నయమ్మను రోజుకొక్క అలంకారంతో భక్తులు పూజిస్తారు. దసరా రోజుల్లో జనసామాన్యానికి పరిచయమైనవి, అందరూ ఉత్సాహంగా జరుపుకునేవి దుర్గాష్టమి(సెప్టెంబర్ 30), మహర్నవమి (అక్టోబర్ 1), విజయ దశమి (అక్టోబర్ 2) వేడుకలు. పురాణకాలంలో జగదంబ లోకకంటకుడైన మహిషాసురుడిని మర్దించి లోకకల్యాణాన్ని కలిగించింది. ఆ గాథలు నేటికీ స్మరణీయాలే. ఈ దసరా రోజుల్లోనే జీవన పోరాటంలో నిత్యం ఉపయోగపడే పనిముట్లు, యంత్రాలు, వాహనాలు వగైరాలకు ఆయుధపూజ నిర్వహిస్తారు. విజయదశమినాడు జమ్మిపత్రాలను సేకరించి తెచ్చి, పెద్దల దీవెనలు తీసుకుంటారు. తెలంగాణ ప్రజలు పాలపిట్టను చూడాలనుకుంటారు, దసరాల్లో బొమ్మల కొలువులు పెట్టడం వంటి ఎన్నో సంప్రదాయాలు చోటు చేసుకుంటాయి. భక్తులందరి పూజలను స్వీకరించే జగన్మాత మనకు ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని వేడుకుందాం. 

తెలంగాణలో దసరాలతో పాటుగా బతుకమ్మ సంబురాలు (సెప్టెంబర్ 21 - 29) జరుగుతాయి. బంగారు బతుకమ్మ ఉయ్యాలో... అని పాడుతూ తెలంగాణ ఆడపడుచులు తమ కోర్కెలు చెప్పుకుంటూ బతుకమ్మలు ఆడుతారు. బతుకమ్మ ఉత్సవాలు మన ముంగిట ఆనందోత్సాహాలను తెచ్చిపెట్టాలని కోరుకుందాం. పితరులకు ప్రియమైన మహాలయ అమావాస్యను (సెప్టెంబర్ 21) భక్తిశ్రద్ధలతో ఆచరించి పితృదేవతల ఆశీస్సులను అందుకుందాం. సెప్టెంబర్ 6 న హైదరాబాదులో మహోత్సాహంగా జరిగే నిమజ్జనోత్సవాల్లో మట్టిగణపతి విగ్రహాలనే ప్రధానంగా నిమజ్జనం చేద్దాం. దసరా రోజుల్లో దేవాధిదేవుడైన తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు కమనీయంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా తిరుమల మాడవీధులలో పూటకొక్క వాహనంపై ఊరేగే శ్రీవారు మనకు అభీష్ట వరాలను ప్రసాదించాలని కోరుకుందాం.

➠ పరమాత్మ ఇంద్రియాలతో తెలుసుకోదగినవాడు కాదు. ఆయనకు ఇంద్రియాదులతో కూడిన రూపం లేనే లేదు. ఒకవేళ ఎవరైనా నేను ఈశ్వర స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నానని చెప్పినా అది సత్యం కానేరదు. ఇంద్రియాల సహాయంతో మానవుడు ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకునే సాధనాలను గురించి కేనోపనిషత్తు వివరించి చెప్పింది.

➠ కృష్ణా నది తీరాన వెలసిన కనక దుర్గమ్మ భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచింది. దసరా నవరాత్రుల వేడుకలను దుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహిస్తారు. దుర్గా మాతను పది రోజుల పాటు ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున కృష్ణా నదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా జరుపుతారు.

➠ వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. అన్ని చోట్లా వినాయక పందిళ్లు వెలిశాయి. భక్తులు సామూహికంగా వ్రతాచరణలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటున్నారు. తొమ్మిది రోజులు పూజించిన అనంతరం గణనాథుడిని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.

➠ దసరాల్లో దేవీపూజ ఎలా చేయాలో వివరంగా తెలియచేసిన మహత్తర గ్రంథం దేవీ భాగవతం. దేవీ భక్తులు ఆశ్వయుజ పాడ్యమి మొదలు దశమి వరకు ఎటువంటి నియమాలతో దేవీ పూజ చేయాలో మనకు దేవీభాగవతమే నేర్పింది. దసరాల్లో కలశ పూజా విధానాలు, కుమారీ పూజ, సువాసినీ పూజలు ప్రధానంగా ఆచరిస్తుంటారు.

➠ భాద్రపదమాసంలో బహుళ పక్షాన్ని (పూర్ణిమ తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల కాలం) పితృపక్షం అంటారు. ఈ కాలం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైంది. పితృపక్షంలో అన్ని వర్ణాల వారూ గతించిన తమ పితృదేవతలను తలుచుకుంటూ శ్రాద్ధవిధులను తప్పక నిర్వహించాలి. పితృపక్షం పుణ్యకార్యాలు చేయటానికి మంచిది కాదు.

➠ తెలంగాణ రాష్ట్ర పువ్వుగా గుర్తింపు పొందిన తంగేడు పువ్వును ప్రధానంగా వినియోగిస్తూ... బంతులు చేమంతులతో బతుకమ్మలను తయారు చేస్తారు. ఇంకా విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో సంప్రదాయంగా, వేడుకగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అంతటా ఒక జాతరగా బతుకమ్మ పండుగ సాగుతుంది.

Recent Comments