NOTE : ఇది కేవలం ఆన్లైన్ కాపీ. మీ ఇంటికి పుస్తకం పంపబడదు.
దక్షిణాయనంలో వచ్చే తొలిపండుగ వినాయక చవితి. అదిగో... ఆదిదేవుడైన విఘ్నేశ్వరుడు తొలిపూజలు అందుకుని మనకు విజయాలు చేకూర్చడానికి విచ్చేస్తున్నాడు. ఆ వరసిద్ధి వినాయకుడు మనందరికీ సర్వశుభాలనూ చేకూర్చాలని మనసారా ప్రార్థిస్తున్నాను. భక్తిశ్రద్ధలతో, చిత్తశుద్ధితో సమర్పించే గరికపోచకే గణేశుడు ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రకృతి స్వరూపుడు కనుక, విగ్రహాల పరిమాణాలతో రంగుహంగులతో పోటీపడకుండా, సహజమైన మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం. ఈ మాసం భక్తిపత్రికకు అనుబంధంగా శ్రీవినాయక వ్రతకల్పాన్ని అందుకుని, శాస్త్రోక్తంగా గణనాథుడిని పూజించండి. ఈ మాసం ప్రారంభంలోనే 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక వస్తోంది. ఉట్టికొట్టే సంబరాల్లో యువకులు, కోలాటపాటలతో యువతులు ఈ ఉత్సవానికి వసంతాలు అద్దుతారు. పిల్లలకు వేషాలు వేసి వారిలో కృష్ణుడిని చూసుకుని పెద్దలు మురిసిపోతారు. జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ సదా మనల్ని కాపాడాలని వేడుకుందాం.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ మాసానికి (15 నుంచి 23 వరకు) వన్నెదిద్దుతున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చిన కారణంగా ఈ మాసంలోనూ వచ్చేమాసంలోనూ కూడా రెండుసార్లు కొండమీద బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమాడ వీధులలో పూటకొక్క వాహనంలో ఊరేగే దేవదేవుడు భక్తులకు ప్రధాన సంపాదకులు తుమ్మల నరేంద్ర చౌదరి కోరిన వరాలిచ్చే కొంగుబంగారు దేవుడు కావాలని కోరుకుంటున్నాను. భక్తిపత్రికకు మాతృసంస్థలైన ఎన్టీవీ, భక్తి టీవీలు ఆగస్టు 30వ తేదీతో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ సందర్భంగా ఇంతకాలంగా మమ్మల్ని ఆదరిస్తున్న వీక్షక మహాశయులందరికీ శుభాభినందనలు. ఎప్పటిలాగానే ప్రజల పక్షాన నిలుస్తూ తెలుగు ప్రజల గుండె చప్పుళ్లు వినిపిస్తామని... మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాము.
➠ వినాయక చవితి మన సంస్కృతికి ప్రతీక. ప్రతి ఇంటిలోనూ పసుపుతో, బంకమట్టితో వివినాయకుణ్ణి రూపొందించి పూజిస్తారు. పళ్లూ కాయలతో పాలవెల్లిని తయారు చేస్తారు. దానికింద వినాయక ప్రతిమను ఏర్పాటు చేస్తారు. వినాయక చతుర్థినాడు పూజలందుకునే వినాయకుణ్ణి వరసిద్ధి వినాయకుడని పిలుస్తారు. యుగయుగాలనాటి వినాయకుని గాథలను వరసిద్ధి వినాయక వ్రతంలో భాగంగా పఠిస్తారు, శ్రవణం చేస్తారు. దేశమంతటా వినాయకచవితిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
➠ వేదములే శిలలైన కొండపై శ్రీవేంకటనాథునికి ఎన్నో ఉత్సవాలు రంగరంగ వైభవంగా, నిత్యకల్యాణం పచ్చతోరణంగా జరుగుతుంటాయి. కలియుగ వైకుంఠంలో జరిగే బ్రహ్మోత్సవాలంటే... మానవాళికి మహోత్సవాలు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అధికమాసం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వర్తిస్తారు. బ్రహ్మోత్సవ సంప్రదాయాల వెనుక తెలుసుకోదగిన ఎన్నెన్నో విశేషాలున్నాయి.
➠ ఓ పెద్ద బంగారు పెంకుటిల్లు. ఆ పెంకుటింటి మధ్యలో... దీపాల వెలుగులు. ఆ వెలుగుల కాంతిలో ఎవరో మనల్నే చూస్తున్నట్లుగా కనిపించే రూపం. ఆ మెరిసే పెంకుటిల్లే గురువాయూర్ ఆలయం. ఎక్కడో రేపల్లెలో పుట్టినవాడు ఇక్కడ కూడా కనిపిస్తాడు. వచ్చిన ప్రతీ ఒక్కరినీ పలకిరిస్తాడు. అభయమిస్తాడు. ఆనందబాష్పాలు తెప్పిస్తాడు. నవ్విస్తాడు. ఏం కావాలో కోరుకోమంటాడు. కోరుకున్నవీ ఇస్తాడు. ఒకటేమిటి ఇకపై నేనే నీకు సర్వస్వం అనేంతలా మాయ చేస్తాడు. రండి... జన్మాష్టమివేళ.. మనమూ గురువాయూర్ లో అడుగుపెడదాం.
➠ గణపతి ఆరాధన అనేది పండుగ కాదు... అదొక జీవన విధానం. అదొక ఆచారం కాదు... ఆత్మపరిశుద్ధికి ఆరంభం. అది కేవలం ప్రార్థన కాదు... పరబ్రహ్మ తత్త్వాన్ని అనుభవించే మార్గం. మన ఆలోచనలో విశాలత్వం, మాటలో మాధుర్యం, ప్రవర్తనలో వినయం, నిర్ణయాలలో వివేకం, జీవితంలో ధర్మం వికసించినప్పుడే గణపతి మన హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటాడు.
➠ నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు అమావాస్యలున్నా వాటిలో శ్రేష్ఠమైనది మహాలయ అమావాస్య. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకూ పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు. ఈ పదిహేను రోజులూ పితృదేవతారాధనకు సంబంధించినవే. ఈనెల 27వ తేదీ నుంచి మహాలయపక్షం ఆరంభమవుతోంది. ఈ మహాలయ పక్షాలను ఇంటివద్ద, నదీతీరాల్లో నిర్వర్తించవచ్చు. మహాలయ అమావాస్య (అక్టోబర్ 10) నాడు ఎవరైనా తమ పితృదేవతలకు శ్రాద్ధవిధిని జరుపుకోవచ్చు.
➠ వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభోగంగా జరుగుతాయి. అన్ని చోట్లా వినాయక పందిళ్లు వెలుస్తాయి. భక్తులు సామూహికంగా వ్రతాచరణలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. తొమ్మిది రోజులు పూజించిన అనంతరం గణనాథుడిని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.