శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి

శివరాత్రి మహాపర్వం ఫిబ్రవరి 13న వస్తోంది. దేశంలోని శివక్షేత్రాలన్నీ శివనామంతో మార్మోగుతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ శివాలయాల్లో మాత్రమేకాదు మారుమూల గుళ్లల్లో కూడా అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. ఊరూవాడా శివరాత్రి ఉపవాసాలు, జాగారాలు భక్తి ప్రపత్తులతో పాటిస్తాయి. శివక్షేత్రాల్లో తిరునాళ్లు కోలాహలంగా సాగుతాయి. కోడెలను నందీశ్వరునికి సమర్పించడం, వైభవంగా ప్రభలు కట్టి శివదేవర దర్శనానికి రావడం ఆనవాయితీ. ‘జన్మకో శివరాత్రి’ అని సామెత. బోళాశంకరుడు శివరాత్రి ఉపవాస జాగారాలతో ప్రసన్నుడవుతాడని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. పన్నెండేళ్లకోసారి వచ్చే శ్రావణ బెళగొళ (కర్ణాటక) శ్రీగోమఠేశ్వర మహామస్తకాభిషేకం ఫిబ్రవరి విశేషాలతో వచ్చి చేరడం ముదావహం. ఈ నెల 17 నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పుణ్య అభిషేకోత్సవానికి లక్షలాది భక్తజనం తరలివచ్చి తరిస్తుంది. మహాశివరాత్రి పొద్దులో ఈ భక్తిపత్రిక పుటలు మారేడు పరిమళాలనద్దుకున్నాయి. దేశంలోని శివక్షేత్రాలను దర్శింపజేసే చిన్న పుస్తకాన్ని అనుబంధంగా అందుకోండి.

➠ కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలును గతంలో పెదకంచి అని పిలిచేవారు. శ్రీలక్ష్మీ తిరుపతమ్మ పేరంటాలుగా ఈ క్షేత్రంలో పూజలందుకుంటోంది. పతిభక్తికి దైవశక్తికి ప్రతీకగా తిరుపతమ్మను భక్తులు కొలుస్తారు. పెనుగంచిప్రోలులో ప్రతి మాఘపౌర్ణమికి శ్రీలక్ష్మీ తిరుపతమ్మ కల్యాణం వైభవంగా జరుగుతుంది.

➠ తిరుపతికి అలమేలు మంగాపురం తూర్పున ఉంటే శ్రీనివాసమంగాపురం పశ్చిమాన అతిసమీపంలోనే ఉంది. ఈ కల్యాణ శ్రీనివాసుని వార్షిక కల్యాణోత్సవ, బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో వైభవంగా జరుగుతాయి.

➠ మాఘ శుద్ధ పౌర్ణమికి రెండేళ్లకోసారి మేడారంలో మహాజాతర నిర్వహిస్తారు. తదుపరి సంవత్సరం చిన్నజాతర జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన సంప్రదాయంలో ఉంటుంది. ఈ జాతరలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అసంఖ్యాకంగా పాల్గొంటారు. సమ్మక్క సారలమ్మలను ఒకే గద్దెపైకి తీసుకువచ్చి బంగారం అనేపేరుతో బెల్లంతో తులాభారాలు తూగి సమర్పిస్తారు.

➠ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని ప్రతీతి. అంటే కేవలం శిఖర దర్శనం చేసుకుంటే చాలు పునర్జన్మ లేకుండా చేసే దివ్యక్షేత్రం శ్రీశైలం. ఇలలో శివదేవుడి నివాసమై విరాజిల్లుతోంది. అందుకే శ్రీశైలం భూలోక కైలాసమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి లింగోద్భవం తరువాత శివపార్వతుల కల్యాణం జరుగుతుంది.

➠ శివుడు కానిది అంటూ సృష్టిలో ఏదీ లేదు. ఆయన అంతటా నిండిపోయిన వాడు. అన్నీ ఆయనే అయినవాడు. ఏమీ కానివాడు కూడా ఆయనే. రూపం లేనివాడు, వేదమయరూపం ఉన్నవాడు కూడా ఆయనే. అందుకే ఆయనను అరూపరూపి అన్నారు. అదే శివలింగ స్వరూపం. జ్యోతిస్వరూపుడైన శివుని లింగోద్భవ లీల సాగిన మహాశివరాత్రి పర్వాలలో మహాపర్వదినం.

➠ తెలంగాణ ప్రజల ఇష్టదైవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడు. ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణం జరిపించుకుంటున్న నేపధ్యంలో యాదగిరీశుడు ప్రస్తుతం బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఫాల్గుణ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవ, రథోత్సవాలకు సిద్ధ పడుతున్నాడు. బాలాలయంలో పగటిపూట, భక్తులందరి సమక్షంలో జడ్పీ హైస్కూల్ మైదానంలో రాత్రివేళ నృసింహ కల్యాణం జరగబోతోంది. 

Recent Comments