ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోఃపదమ్
మంత్రమూలం గురోఃవాక్యం మోక్షమూలం గురోఃకృపా

గురువులందరినీ పూజించుకునే గురుపూర్ణిమ పర్వదినం జూలై 3న వస్తోంది. ఆధునిక మానవుడు శాంతి, ఆనందాలను అనుభవించాలంటే... యుగయుగాలుగా మానవజాతిని సంస్కరించి, ముందుండి నడిపించిన సద్గురువుల బోధనలను సదా స్మరిస్తూ ఉండాలి. దానికి తగిన తరుణం గురుపూర్ణిమ. ఈ నిండు పున్నమి వేళలోనే పీఠాధిపతులు, ఇతర స్వాములు చాతుర్మాస్య దీక్షలు చేపడుతుంటారు. ఏడాది పొడవునా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ... ధర్మప్రచారంలో తీరికలేకుండా ఉండే సాధుసంతులంతా ఈ నాలుగునెలల కాలంపాటు ఎంచుకున్న ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే ఉంటూ శిష్యులను అనుగ్రహిస్తుంటారు. అటువంటి గురువులందరికీ నమస్కారం.

వచ్చెవచ్చె బోనాలు! అమ్మతల్లులు తెచ్చెతెచ్చె బోనాలు!! బిడ్డపాపల రక్షించే అమ్మతల్లి జగదంబికా నీకు బోనాలు! సర్వజీవుల చల్లంగ చూసే ఉజ్జయిని మహంకాళికి కోటి దండాలు! లాల్ దర్వాజా మూలపుటమ్మకి భక్తిమీరగా బోనాలు! ఆషాఢ ప్రవేశంతో జూన్ నెలలో తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఈ నెలలో ఊపందుకుంటాయి. 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 16న లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు మహోత్సాహంగా నిర్వహిస్తారు. ఏటా వచ్చి... బోనం స్వీకరించి కన్నబిడ్డలందరినీ చల్లంగా దీవించే అమ్మతల్లులందరికీ వేలవందనాలు. ఇది భక్తిపత్రిక జన్మదిన సంచిక. ఈ సంచికతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని, తొమ్మిదో ఏట అడుగుపెడుతోంది. భక్తిపత్రిక పట్ల మీరందరూ చూపిస్తున్న ఆదరాభిమానాలు ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

➠ శనివారం, త్రయోదశి తిథి కలిసివస్తే శనిత్రయోదశిగా భావిస్తారు. శని దోష నివారణల కోసం ఆరోజున అభిషేకాలు, జపదానాలు నిర్వహిస్తారు. శనిమహాదశ, ఏల్నాటి శని, అష్టమ - అర్థాష్టమ శనిదోషాలు మానవుణ్ణి పరీక్షిస్తాయి. ధర్మమార్గంలో ప్రవర్తించేలా తీర్చిదిద్దుతాయి. శనిదోషం అందరికీ ఒకేలాంటి ఫలితాలనివ్వదు అనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

➠ రామేశ్వరంలోని ఇసుకను కాశీలో అభిషేకించాలి. కాశీ గంగతో రామేశ్వరుణ్ణి అర్చించాలి. రెండుసార్లు రామేశ్వరం, ఒకసారి కాశీ వెళితే సంపూర్ణ యాత్రాఫలం వచ్చినట్లే అని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రామేశ్వరంలో రామనాథ స్వామికి, పర్వత వర్ధిని అమ్మవారికి ఆడి తిరుకల్యాణ మహోత్సవం కనుల పండువగా జరుగుతుంది.

➠ పురాణాల పుట్టిల్లు నైమిశారణ్యం. గురువులకు, తపస్వులకు నిలయం. వేదకాలం నుంచి నైమిశారణ్యంలో ఎప్పుడూ ఏవేవో దివ్య క్రతువులు, జ్ఞాన సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ మూడులోకాలలోని తీర్థాలలో ఉత్తమమైనది నైమిశారణ్యం. ఈ దివ్య తీర్థాన్ని దర్శిస్తే సకల తీర్థాలనూ సేవించిన ఫలితం లభిస్తుంది. 

➠ గురువు అనే పదానికి చీకటిని పోగొట్టి వెలుగును ప్రసాదించేవాడని అర్థం. గురువు ఓ జ్ఞాన దీపం. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి శిష్యుల జీవన గమనమంతటా జ్ఞానకాంతులను నింపుతూ వుంటాడు. భారతీయ సనాతన సంప్రదాయంలో తొలినాళ్లనుంచి ఈ వెలుగు దివ్వెకు అంతటి విశేష స్థానం ఉంది. ఆషాఢ పూర్ణిమనాడు గురువులందరినీ పూజించుకుంటాం మనం.

➠ చాంద్రమానంలో కూడా ఒకే నెలలో రెండు పున్నములు వస్తే దానినే అధికమాసం అంటారు. శోభకృత్ నామ సంవత్సరంలో శ్రావణమాసం అధికమాసంగా వచ్చింది. అధికమాసాన్ని పురుషోత్తమమాసం అంటారు. ఆ మాసంలో చేసిన పుణ్యకార్యాలకు అధిక ఫలితాలు సిద్ధిస్తాయంటారు. 

➠ గ్రామదేవతారాధన విశిష్టస్థానాన్ని ఆక్రమించింది. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చేందుకు వెలసిన కొన్ని స్త్రీ దేవతా రూపాలనే గ్రామదేవతలని అంటారు. అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉంచుతూ, గ్రామాన్ని భూత ప్రేతాదులనుండి రక్షిస్తూ, జనాలను చల్లగా చూస్తూ, గ్రామానికి రక్షణగా పొలిమేరలలో సదా కాపు కాస్తుండేవారు ఈ గ్రామదేవతలే.

Recent Comments