ఏరువాక పున్నమినాటికి తొలకరి రుతువు ప్రవేశిస్తుంది. రైతన్నలు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. విత్తనాలు చల్లడానికి వీలుగా నేలను దున్నడం మొదలుపెడతారు. ఏరువాకా సాగారో అంటూ ఉత్సాహంగా సాగే కృషీవలుల శ్రమ ఫలించాలని, అధిక దిగుబడులతో నేలతల్లి కరుణించాలని కోరుకుందాం. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుత కానుక యోగశాస్త్రం. వ్యాకరణంతో భాషను సంస్కరించి, ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని ప్రసాదించి, యోగశాస్త్రంతో జ్ఞానాన్ని సుస్థిరం చేసిన పతంజలి మహర్షికి మునుముందుగా నమస్కరిద్దాం. పతంజలి కాలం నుంచి యోగశాస్త్రం అనేక మార్గాల్లో విస్తరించింది. జూన్ 21, అంతర్జాతీయ యోగదినోత్సవం సందర్భంగా నేటికాలపు అనారోగ్యాలకు యోగశాస్త్రం అందించే పరిష్కారాలను పరిశీలిద్దాం. గీతాజయంతిలాగా సౌందర్యలహరి పుట్టిన రోజును కూడా జూన్ 1న మనవారు ఘనంగా జరుపుకుంటారు. సౌందర్యలహరి గ్రంథాన్ని ఆదిశంకరులు కైలాసం నుంచి తీసుకువచ్చారని చెబుతారు.
ఆషాఢమాసం వస్తూనే పూరీ జగన్నాథ రథచక్రాలు ముందుకు కదులుతాయి. ఒక్క పూరీక్షేత్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక దేశాల్లో జగన్నాథ రథోత్సవం భక్తులను పునీతం చేస్తోంది. ఆ దివ్యమైన వేడుక వెనుకనున్న సంప్రదాయాలను స్మరిద్దాం. ఆషాఢమాసం శక్తి ఆరాధనకు ప్రత్యేకించినది. ఈ ఆషాఢంలోనే శుక్ల ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. తొలి ఏకాదశి పేరుతో ఈ పర్వాన్ని జూన్ 29న జరుపుకోబోతున్నాం. ఆ రోజునుంచి కార్తికం వరకు నాలుగునెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు కనుక, జగత్తుల పాలనా బాధ్యతలను ఆయన తన సోదరి అయిన పార్వతికి ఇస్తాడని చెబుతారు. అందుకే ఆషాఢంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు. ఈ ఏడాది జూన్ 22 నాడు గోల్కొండ జగదంబిక తొలిబోనం స్వీకరిస్తుంది. మన ఆడపడుచులు సమర్పించే బోనాలతో, శివసత్తుల ఊరేగింపులతో సంతోషించిన జగన్మాత మనందరికీ కోరిన వరాలన్నీ అందించాలని వేడుకుందాం.