bhakthipathrika

జన్మకో శివరాత్రి అని సామెత. మహాశివరాత్రినాడైనా ఉపవాసంతో, జాగరంతో, అభిషేకంతో శివుని మెప్పించాలి. తనకోసం ఏ చిన్నపని చేసినా వెంటనే దానిని స్వీకరించే అల్ప సంతోషి శివుడు. మనకు ఉన్నదానితోనే సంతోషించాలని, బయటెక్కడో వెతకడం కంటే మనలోనే ఆనందాన్ని అన్వేషించి తెలుసుకోవాలని మనకు తెలియచెప్పే మహత్తర పర్వదినం శివరాత్రి. ఆ రోజున ప్రతి శివాలయంలో అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. ప్రతి చిన్న గుడిలోనూ మహాదేవుడు నిర్విరామంగా దర్శనాలు అనుగ్రహిస్తాడు. ఊరూవాడా తిరునాళ్లు, జాతరలు కోలాహలంగా సాగుతాయి. తెలుగునాట శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి చోట్ల బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆలయలకు పోటెత్తుతారు. ‘హరహర మహాదేవ, ఓం నమఃశివాయ’ అని చేతులెత్తి మొక్కే ప్రతి భక్తుడి మొరనూ ఆలకించే పరమేశ్వరుడు మనకు మనోబలాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుందాం. మాఘం పర్వదినాలకు పెట్టింది పేరైతే, ఫాల్గుణమాసం నృసింహ కల్యాణాల మాసంగా చెబుతారు. 

తెలంగాణ తిరుపతిగా భక్తులందరూ పిలుచుకునే యాదాద్రిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 18న స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం జరుగుతుంది. అలాగే వివిధ నృసింహ క్షేత్రాల్లో కూడా ఈ ఫాల్గుణమాసంలోనే వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. శివుని వలెనే నృసింహుడు కూడా మనం కోరిన కోరికలు అడిగినవెంటనే తీరుస్తాడంటారు. ఆ స్వామికి మొక్కి మనోభీష్టులు నెరవేర్చుకుందాం. భక్తులపాలిట కల్పవృక్షంగా, కామధేనువుగా ప్రసిద్ధి వహించిన గురురాఘవేంద్రస్వామి జయింతి మహోత్సవాల సందర్భంగా మంత్రాలయ క్షేత్రాన్ని వేలాదిమంది సందర్శించుకుంటారు. ఆ మహాగురుని అనుగ్రహ ఆశీస్సులు పొంది తరిస్తుంటారు. ఏడాదిలో చిట్టచివరి పౌర్ణమి అయిన ఫాల్గుణ పౌర్ణమిని ఆటపాటల్లో ముగించడం మన సంప్రదాయం. హోళీ (మార్చి 25) వేడుకల్లో సహజమైన రంగులనే వాడుదాం. ఫాల్గుణమాసం మనలో ఆనందాన్ని ఉత్సాహాన్ని అత్యంత  సహజశైలిలో పెంపొందింపచేయాలి.

Read More