bhakthipathrika

వైశాఖమాసం (మే 9 - జూన్ 6) తెలుగునెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ (మే10). ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు. ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ. నదీమ తల్లులను సేవించుకునే పుష్కర పుణ్యకాలం మే 1 నుంచే ప్రారంభం అవుతోంది. నర్మదా పుష్కరాల సందర్భంగా తీర్థక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి. బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ.

ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి (మే 22) నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి (జూన్ 1) నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా (మే 19) ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం.

Read More